AP CM Chandrababu Approves Projects: ఏపీలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దాదాపు 2,63,411 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా రాష్ట్రానికి రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ మేరకు సచివాలయంలో సోమవారం జరిగిన ఎన్ఐపీబీ సమావేశంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆమోదం తెలిపారు. ఆయా సంస్థలకు భూ కేటాయింపులతో సహా మౌలిక వసతులను శరవేగంగా కల్పించాలని, అదే విధంగా ఒప్పందం ప్రకారం నిర్ధిష్ట సమయంలోనే ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పలు ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు దరఖాస్తు చేసుకోగా వీటిపై చర్చించి.. 9 కీలక ప్రాజెక్టులకు సీఎం ఆమోదముద్ర వేశారు.


ఆ ప్రాజెక్టులు ఇవే..


ఈ ప్రాజెక్టుల్లో బీపీసీఎల్, టీసీఎస్, ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెట్ సహా ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో బీపీసీఎల్ 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. దీంతో 2,400 మందికి ఉపాధి కలుగనుండగా.. మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్ధ్యంతో 5 బ్లాకుల్లో ఇది ఏర్పాటు కానుంది. వచ్చే 20 ఏళ్లల్లో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి రూ.88,747 కోట్ల ఆదాయం రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2028లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.


అటు, విశాఖ మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ. 80 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో 2 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల గ్రీన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఈ సంస్థ రూ.1,046 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 2,381 మందికి ఉపాధి కలుగుతుంది. మరోవైపు, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో రూ.1,174 కోట్లతో 1,500 మందికి ఉపాధి కలిగేలా బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీఎఫ్/పర్టికల్ బోర్డు ప్లాంట్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పనుంది. 


క్లీన్ ఎనర్జీ పాలసీతో..
 
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన క్లీన్ ఎనర్జీ పాలసీతో కొత్తగా 5 సంస్థలు రూ.83 వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నాయి. దీంతో కేవలం క్లీన్ ఎనర్జీ రంగంలోనే రెండున్నర లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. అలాగే, కాకినాడ, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని వివిధ సంస్థల పెట్టుబడులతో రూ.వేల కోట్ల పెట్టుబడులతో పాటు వేలాది మందికి ఉపాధి కలగనుంది. అటు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రాష్ట్రంలో తాజాగా రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్రమంతటా 5 లక్షల ఎకరాల్లో  రెండున్నర లక్షల మందికి ఉపాధి కలిగేలా 11 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు మొత్తం 2028 కల్లా పూర్తి కానుంది. దీని ద్వారా రాష్ట్రానికి రూ. 4,095 కోట్ల ఆదాయం రానుంది. 


Also Read: Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు