Trending
Davos tour: దావోస్‌లో ఆసక్తికర సన్నివేశం - ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఫడణవీస్
Davos Tour: దావోస్ పర్యటనలో కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడణవీస్ పాల్గొన్నారు.
AP CM Chandrababu And Revanth Reddy And Fadnavis On The Same Stage In Davos: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దావోస్ పర్యటన సాగుతోంది. దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, తెలుగు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయి ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలు, రాష్ట్రంలో ఉన్న అవకాశాలు వివరించారు. ఈ క్రమంలో బుధవారం దావోస్ పర్యటనలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) పాల్గొన్నారు. దేశం ఒక యూనిట్‌గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే 3 రాష్ట్రాల సీఎంలు.. స్ట్రాటజిక్ సమావేశంలో పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఏఐ, రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు ఈ మీటింగ్‌లో చర్చించినట్లు తెలుస్తోంది.
'డేటా సెంటర్లు ఏర్పాటు చేయండి'
అటు, దావోస్ పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ టెమాసెక్ హోల్డింగ్స్ భారత్ హెడ్ రవి లాంబాతో భేటీ అయ్యారు. ఏపీలో టెమాసెక్ అనుబంధ సంస్థ క్యాపిటా ల్యాండ్ ద్వారా పారిశ్రామిక పార్కులు, డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. విశాఖ, తిరుపతిలో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయడంతో పాటు పారిశ్రామిక క్లస్టర్లలో ఆర్ఈఐటీ విధానంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. సెంబ్ కార్ప్‌తో కలిసి రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. విశాఖ, తిరుపతి నగరాల్లో సెమాటెక్ టెలీమీడియా ద్వారా డేటా సెంటర్లు, డేటా సెంటర్ పార్కుల ఏర్పాటుకు సహకరించాలన్నారు.
2028 నాటికి క్యాపిటా ల్యాండ్ ద్వారా భారత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను రెట్టింపు చేయాలని అనుకుంటున్నట్లు రవి లాంబా వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, ట్రాఫిక్ జామ్ కారణంగా కాంగ్రెస్ సెంటర్‌లో భేటీకి లోకేశ్ కాలినడకన వెళ్లారు.
'గ్లోబల్ టాలెంట్ హబ్‌గా ఏపీ'
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నూతన ఆవిష్కరణలు జరగాలని మంత్రి లోకేశ్ అన్నారు. దావోస్‌లో విద్యారంగ గవర్నర్ల సమక్షంలో ఆయన మాట్లాడారు. '3 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో రూ.255 కోట్లు కేటాయించాం. పోటీతత్వాన్ని పెంచేందుకు స్టెమ్, ఏఐ విద్యపై దృష్టి సారించాం. 2047 నాటికి 95 శాతం నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయాలని ఏపీ లక్ష్యంగా పెట్టుకుంది.' అని లోకేశ్ వివరించారు.