Chandrababu pays tribute to Harikrishna | అమరావతి: టాలీవుడ్ దివంగత నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ వర్ధంతి నేడు. రాజకీయ నాయకుడిగా, నటుడిగా తెలుగు ప్రజలకు సేవలు అందించిన హరికృష్ణ వర్ధంతి సందర్భంగా నందమూరి, నారా కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు, ఆయన అభిమానులు ఘన నివాళి అర్పిస్తున్నారు. నందమూరి హరికష్ణ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఘన నివాళి అర్పించారు. తమ మధ్య కేవలం బంధుత్వం మాత్రమే కాదు... అంతకంటే ఎక్కువగా ఆత్మీయతను, స్నేహాన్ని తాము పంచుకున్నామని గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యులకే కాదు, టీడీపీ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, నందమూరి అభిమానులకు కూడా ఆత్మీయతను పంచిన మంచి మనిషి హరికృష్ణ అని కొనియాడారు.

ఏపీ మంత్రి లోకేష్ నివాళులుహరికృష్ణ మామయ్య వర్థంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘననివాళులు అర్పించారు ఏపీ మంత్రి నారా లోకేష్. రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యులుగా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ప్రజలకు హరికృష్ణ విశేష సేవలందించారని గుర్తుచేసుకున్నారు. సినీ రంగంలోనూ తనదైన నటనతో తెలుగువారిని అలరించారని లోకేష్ పేర్కొన్నారు. హరి మామయ్య లేనిలోటు మాకు తీర్చలేనిది. సినీ, రాజకీయ రంగానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా నారా లోకేష్ స్మరించుకున్నారు.

అన్నయ్య హరికృష్ణకు భువనేశ్వరి ఘన నివాళి

టీడీపీ నేతల నివాళి..

నందమూరి హరికృష్ణ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. వర్ధంతి సందర్భంగా హరికృష్ణకు ఘన నివాళులు అర్పించారు. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన శైలిలో విశేష సేవలు అందించిన వ్యక్తి హరికృష్ణ అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాళులర్పించారు. జోహార్ హరన్న.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నామంటూ ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పోస్ట్ చేస్తున్నారు.

నందమూరి కుటుంబంలో విషాదం నింపిన రోజు

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ నందమూరి తారక రామారావుకు మూడో కుమారుడు. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ ఏర్పాటులో భాగంగా రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించగా చైతన్య రథం సారథిగా తండ్రి వెన్నంటి నిలిచారు. హరికృష్ణ 2018 ఆగస్టు 29న నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ప్రమాదంలో కారు పల్టీలు కొట్టడంతో తీవ్రగాయాలలైన హరికృష్ణను నార్కట్‌పల్లి లోని కామినేని హాస్పిటల్ కు తరలించగా అక్కడే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ 2014 లో నల్గొండకు సమీపంలోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రస్తుతం హరికృష్ణ కుమారులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ టాలీవుడ్ లో హీరోలుగా సినిమాలు చేస్తున్నారు.