ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ రెండ్రోజుల పాటు విచారించనుంది. ఇవాళ రేపు చంద్రబాబును ప్రశ్నించనున్నారు సీఐడీ అధికారులు. రాజమండ్రి సెంట్రల్ జైలులోని కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ జరగనుంది.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండే కాన్ఫరెన్స్ హాల్‌లో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. 9 గంటలకు రాజమండ్రి జైలుకు చేరుకున్న అధికారులు 9.30కి చంద్రబాబును తమ కస్టడీలోకి తీసుకున్నారు. ముందుగా ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆయన్ని ప్రశ్నించడం స్టార్ట్ చేశారు.
రెండు రోజుల పాటు చంద్రబాబును ఏపీ సీఐడీ బృందం విచారించనుంది. గంటకోసారి ఐదు నిమిషాల గ్యాప్ ఇవ్వనుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు లంచ్ బ్రేక్ ఇస్తారు. తర్వాత మళ్లీ విచారణ ప్రారంభిస్తారు. ఇలా ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశ్నించనున్నారు.
తన న్యాయవాది సమక్షంలోనే చంద్రబాబును ఏపీ సీఐడీ ప్రశ్నించనుంది. ఆయన తరఫున వచ్చే న్యాయవాది దూరంగా మాత్రమే ఉండాలని పేర్కొంది. ఆయనపై ఎలాంటి థర్డ్ డిగ్రీ వాడటానికి లేదని కోర్టు స్పష్టం చేసింది. తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది కోర్టు. కస్టడీకి తీసుకునే ముందు, కస్టడీ ముగిసిన తర్వాత ఆయనకు తప్పనిసరిగా వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
చంద్రబాబును ప్రశ్నించేటప్పుడు కచ్చితంగా వీడియో తీయాలని కోర్టు ఆదేశించింది. ఆ వీడియోకానీ, ఫొటోలు కానీ బయటకు రాకుండా చూడాలని అధికారులకు సూచించింది. సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్‌తో మాత్రమే రికార్డు చేయించాలని చెప్పింది. ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్‌కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించాలని పేర్కొంది.
సీఐడీ విచారణ జరిగేటప్పుడు చంద్రబాబు తరఫున హాజరయ్యే న్యాయవాదుల జాబితాను కోర్టుకు సమర్పించింది టీడీపీ. మొత్తం ఏడుగురితో తయారు చేసినలిస్ట్ ఇచ్చింది. వీలును బట్టి వారిలో ఒకరు విచారణకు హాజరవుతారని పేర్కొంది.
చంద్రబాబు సీఐడీ విచారణ కోసం సెంట్రల్ జైలులో కాన్ఫరెన్స్ హాల్ సిద్ధం చేశారు జైలు అధికారులు. పర్యవేక్షణ బాధ్యతలు డిప్యూటీ సూపరిడెంట్ కు అప్పగించారు.. 25 మంది కూర్చునేలా కాన్ఫరెన్స్ హాల్ సిద్ధం చేశారు.. సీఐడీకి చెందిన ముగ్గురు డిఎస్పీ స్థాయి అధికారులు, నలుగురు సీఐలు, ఏఎస్ఐ, కానిస్టేబుల్, వీడియోగ్రఫర్, ఇద్దరు ఆఫీషియల్ మధ్యవర్తుల సమక్షంలో ఈ విచారణ జరగనుంది. మరోవైపు చంద్రబాబును సీఐడీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారు అనే చర్చ కూడా సాగుతోంది. చంద్రబాబు విచారణ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చేందుకు అంగీకరించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తమ కస్టడీకి ఐదు రోజుల పాటు ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన చేసిన పిటిషన్‌పై తీర్పు వెల్లడించింది ఏసీబీ కోర్టు.
బుధవారం మధ్యాహ్నం వరకూ వాదలు జరిగాయి. ఆ రోజు సాయంత్రం తీర్పు ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ జడ్జి గురువారం ఉదయానికి వాయిదా వేశారు. తర్వతా సాయంత్రం నాలుగు గంటలకు ప్రకటిస్తామన్నారు. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు రావాల్సి ఉన్నందున మరోసారి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం పదిన్నరకు న్యాయమూర్తి తీర్పు ప్రకటిస్తామని చెప్పారు. అయితే శుక్రవారం ఉదయం క్వాష్ పిటిషన్‌పై తీర్పు వచ్చే ఛాన్స్ ఉందన్న న్యాయవాదులు చెప్పడంతో 2.30కి తీర్పును వాయిదా వేశారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఏసీబీ కోర్టు కూడా సీఐడీ కస్టడీపై తీర్పు వెల్లడించింది న్యాయస్థానం. చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇస్తూ తీర్పు చెప్పింది. ఒకే రోజు రెండు వ్యతిరేక తీర్పులు రావడం టీడీపీ శ్రేణులు నిరాశ చెందాయి. చంద్రబాబును కోర్టులోనే విచారిస్తామని చెప్పింది సిఐడీ.