Buddha Venkanna: టీడీపీ నేతల కేసుల విషయంలో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ప్రతిపక్ష నాయకులపై కేసులతో పాటు, వారు ఎక్కడికి వెళ్లినా సీఐడీ అధికారులు నిఘా పెడుతున్నట్లు కనిపిస్తోంది. విచారణ పేరుతో ఆయా కేసులలో వారికి నోటీసులు ఇస్తున్నారు. గతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఢిల్లీ వెళ్లారు. అక్కడ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు నోటీసులు అందించారు. విచారణకు హాజరు కావాలని సూచించారు. 


తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జి బుద్దా వెంకన్నకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ నోటీసులు ఇచ్చింది. జడ్జిలను దూషించారన్న అభియోగాలపై ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బుద్దా వెంకన్న ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నారు. వైద్య, ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆయన కోసం సీఐడీ అధికారులు హైదరాబాద్ వెళ్లారు. నేరుగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే నోటీసులు ఇచ్చినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.


ఇదీ జరిగింది..
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ తర్వాత ఆయన పిటిషన్‌లను విచారించిన జడ్జిలపై సోష‌ల్ మీడియాలో రాజకీయపరంగా ఉద్దేశపూర్వకంగానే దూషణల పర్వం కొనసాగిందని పేర్కొంటూ ఏపీ హైకోర్టులో ప్రభుత్వం దాఖ‌లు క్రిమినల్‌ కంటెంప్ట్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది. న్యాయస్థానాలు, జడ్జిలను దూషించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఏజీ పిటిషన్‌లో కోరారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో సోషల్ మీడియాలో జరిగిన పరిణామాలు, టీడీపీ నేతల కామెంట్లను పిటిషన్‌‌లో వివరించారు. 


కోర్టుల గౌరవానికి భంగం కలిగించారని తెలిపారు. న్యాయవిధులను నిర్వర్తిస్తున్న వారిపై దూషణలకు దిగారంటూ పిటిషన్‌ లో వెల్లడించారు. న్యాయవ్యవస్థకు ఉన్న విలువలను ధ్వంసం చేసేలా వ్యవహరించారంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ట్విట్టర్, ఫేస్ బుక్, గోరంట్ల బుచ్చయ్య చౌదరీ, బుద్ధా వెంకన్నతో సహా 26 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఇద్దరు హైకోర్టు జడ్జిలు, ఏసీబీ జడ్జి ఫ్యామిలీలు టార్గెట్ గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని తెలిపారు.


జడ్జిలను ట్రోలింగ్ చేయటానికి ప్రత్యేకంగా ఒక క్యాంపెయిన్ నిర్వహించారని ఏజీ న్యాయస్థానికి వివరించారు. దీంతో ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సీఐడీ అధికారులు అక్కడికి వెళ్లి నోటీసులు అందజేశారు. దీనిపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐడీ తీరును తప్పుపడుతున్నారు. అధికార వైసీపీకి సీఐడీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు.


ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం అధికార పార్టీకి అలవాటుగా మారిందని విమర్శిస్తున్నారు.  సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై కక్ష కట్టారని, సీఐడీని అడ్డుపెట్టుకుని అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని అంటున్నారు. ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని విమర్శిస్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.