One Hundred Crores Of Money Seized in AP: ఎన్నికల వేళ ఏపీలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సరైన పత్రాలు లేకుండా నగదు తరలించే వారిని గుర్తించి డబ్బు స్వాధీనం చేసుకుంటున్నారు. వాటిని స్థానిక ఆర్వోలకు అందజేస్తున్నారు. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా రూ.100 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) గురువారం వెల్లడించారు. వివిధ చెక్ పోస్టులు వద్ద సిబ్బందిని కట్టుదిట్టం చేసి తనిఖీలు విస్తృతం చేసినట్లు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర, జిల్లాల సరిహద్దుల్లో సోదాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సరిహద్దు రాష్ట్రాల పోలీసు బలగాలు, ఇతర ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకుంటున్నట్లు తెలిపారు. అయితే, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవహరించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అటు, తనిఖీల్లో నగదుతో పాటు మద్యం కూడా ఎక్కువగా పట్టుబడుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇతర రాష్ట్రాల నుంచి కొందరు అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడుతున్నారు. ఇప్పటివరకూ పట్టుకున్న అక్రమ మద్యాన్ని లెక్కకట్టే పనిలో ఆబ్కారీ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.


ఒంగోలు ఘర్షణపై ఆగ్రహం


మరోవైపు, ఒంగోలులో బుధవారం అర్ధరాత్రి టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ ఘటనపై సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పందించారు. దీనికి సంబంధించి రాత్రి నుంచి కలెక్టర్, ఎస్పీ తమతో టచ్ లో ఉన్నారని.. ఈ వివాదంపై పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో విచారణ చేపడతామని.. గొడవకు కారణమైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల వేళ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే బైండోవర్ కేసులు నమోదు చేస్తామని.. చర్యలు తప్పవని అన్నారు.


ఇదీ జరిగింది


కాగా, ప్రకాశం (Prakasam) జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బుధవారం రాత్రి టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణలతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సీన్ లోకి ఎంటర్ కావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఒంగోలులోని (Ongole) సమతానగర్ లో బుధవారం రాత్రి వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యరెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా.. ఓ అపార్ట్ మెంట్ లోని మహిళలు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలకు మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడులు చేసుకోగా.. కొందరికి గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. అటు, ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్ ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. టీడీపీ కార్యకర్తపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం, రిమ్స్ వద్దకు బాధితులను పరామర్శించేందుకు ఇరు పార్టీల నేతలు వెళ్లగా.. అక్కడ కూడా ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు నేతలను అక్కడి నుంచి పంపించేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.


Also Read: Anantapur TDP : రాజీపడ్డారు లేకపోతే పార్టీ మారిపోయారు - అనంతపురం జిల్లా టీడీపీలో సర్దుకున్న అసంతృప్తి !