మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని నేడు జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో సీఎం వైఎస్ జగన్ మంత్రులను అలర్ట్ చేశారు. అంటే ఏపీ మంత్రివర్గ విస్తరణకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. కొత్తగా కేబినెట్ లో ముగ్గురు లేదా నలుగురికి అవకాశం కల్పించనుండగా, అదే సమయంలో కొందరు నేతలపై వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. సామాజిక సమీకరణాలను సైతం జగన్ కచ్చితంగా పాటిస్తారని తెలిసిందే.


కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికవుతున్న మర్రి రాజశేఖర్ తో పాటు గ‌వ‌ర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన తోట త్రిమూర్తులును కేబినెట్ లోకి తీసుకుంటున్నారని పార్టీలో వినిపిస్తోంది. అయితే ప్రస్తుత కేబినెట్ లో ఎవరిపై వేటు పడునుందోనని పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. విడదల రజిని, దాడిశెట్టి రాజాను సీఎం జగన్ మంత్రివర్గం నుంచి తప్పించి కొత్త వారికి ఛాన్స్ అవకాశం ఉందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. 


దాడిశెట్టి రాజా స్థానంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును జగన్ మూడో దఫా కేబినెట్ లోకి ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. తోట త్రిమూర్తులు 14 జూన్ 2021లో గ‌వ‌ర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులు కాగా, అదే నెల 21న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. చిలకలూరిపేటకు చెందిన మంత్రి విడదల రజిని బీసీ ఎమ్మెల్యే కాగా, ఆమెను కేబినెట్ నుంచి తప్పించి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ కు అవకాశం ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలకు కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం లేదు. కనుక తప్పని పరిస్థితుల్లో సీఎం జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 


కౌరు శ్రీనివాస్ లతో పాటు గ‌వ‌ర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన తోట త్రిమూర్తులును కేబినెట్ లోకి తీసుకుంటున్నారని పార్టీలో వినిపిస్తోంది. పొన్నాడ సతీష్, కౌరు శ్రీనివాస్ లలో ఒకరిని లేక ఇద్దర్నీ సైతం తన మూడో దఫా కేబినెట్ లోకి జగన్ తీసుకుంటారని ఆ పార్టీ నేతల్లో చర్చ మొదలైంది. అయితే ప్రస్తుత కేబినెట్ లో ఎవరిపై వేటు పడునుందోనని పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. 


ఎమ్మెల్సీ కానున్న కౌరు శ్రీనివాస్, పొన్నాడ సతీష్ లలో ఒకరికి సైతం ఏపీ కేబినెట్ లో బెర్త్ కన్ఫామ్ అని వినిపిస్తోంది. లేక ఇద్దరికి సైతం సీఎం జగన్ ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యం అక్కర్లేదు. మరికొందరు పార్టీ లీడర్లు చెబుతున్న ప్రకారం.. సీదిరి అప్పలరాజుపై వేటు వేసే అవకాశం ఉంది. ఇదివరకే ఏపీ కేబినెట్ లో రెండు దఫాలలో అవకాశం దక్కించుకున్న అప్పలరాజును ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేబినెట్ నుంచి తొలగించి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ను కొత్త కేబినెట్ లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణపై వేటు వేసి ఎమ్మెల్సీ అభ్యర్థి కౌరు శ్రీనివాస్ ను సైతం మంత్రి పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది. 


ఏపీలో మూడో దఫా మంత్రివర్గ విస్తరణ అంశాన్ని గమనిస్తే ఎవరిని కేబినెట్ నుంచి తప్పించాలి, ఎవర్నీ కొనసాగించాలో తేల్చడం సీఎం జగన్ కు చిక్కుముడిగా మారనుంది. మరి జగన్ ఈ చిక్కుముడిని ఎలా పరిష్కరిస్తారు, నేతలను ఎలా బుజ్జగిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ అంశంపై సీనియర్ల అభిప్రాయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొత్త కేబినెట్ అంశంపై చర్చించుకున్నారట. మంత్రి వర్గ విస్తరణపై ఏబీపీ దేశం ఆరా తీస్తే.. అవును నిజమేనని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఉగాదికి కొంత మంది నేతలు గుడ్ న్యూస్ విననుండగా, మరికొందరు మంత్రి పదవి కోల్పోనున్నారు.