AP Cabinet Meeting : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఉదయం పదకొండు గంటలకు జరగనుంది. ఈ మేరకు అన్ని శాఖలు ప్రతిపాదనలు పంపాలని సీఎస్ సర్క్యూలర్ జారీ చేశారు. ఫిబ్రవరిలో  మంత్రివర్గ సమావేశంలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఈ బడ్జెట్‌లో ఏపీకి ఏమి వస్తాయన్నదానిపై స్పష్టత వస్తుంది. దాంతో వచ్చే ఏడాది బడ్జెట్ ఎలా ఉండాలని.. వచ్చే  ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టే బడ్జెట్ ఇదే కావడంతో కావడంతో ఎలాంటి ప్రజాకర్షక పథకాలు రూపొందించాలన్న దానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. 


మార్చిలో అసెంబ్లీ సమావేశాలు మాత్రమే కాకుండా రెండు కీలక సమావేశాలను ప్రభుత్వం నిర్వహించబోతోంది. అందులో ఒకటి ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కాగా.. మరొకటి జీ20 సన్నాహక సదస్సు. ఈ రెండు విశాఖపట్నంలోనే జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లపైనా కేబినెట్ సమావేశంలో సమీక్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీ గ్లోబల్ పార్టనర్ షిప్ సమ్మిట్ ను భారీగా విజయవంతం చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్,  యాపిల్ సీఈవో  టిమ్ కుక్‌లకు  ఆహ్వానం పంపామని ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి పెద్ద స్థాయి వ్యాపారవేత్తల్ని విశాఖ సమ్మిట్ కు ఆహ్వానించగలిగితే.. పెట్టుబడులు వెల్లువలా వస్తాయని నమ్ముతున్నారు. ఈ దిశగా కేిబనెట్ సమ్మిట్ నిర్వహణపై కీలక  చర్చలు నిర్వహించే అవకాశం ఉంది. 


సీఎం జగన్ ఇటీవల ముందస్తుకు వెళ్తారన్న ప్రచారం కొన్నాళ్లుగా సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తే ఆ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒక వేళ తెలంగాణ సర్కార్ ముందస్తుకు వెళ్లకపోయినా నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది.   ఆ సమయంలోనే ఏపీకి కూడా ఎన్నికలు జరిగేలా చూసుకోవాలని అధికార పార్టీ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ మద్దతు కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఢిల్లీలోనూ విస్తృత ప్రచారం  జరుగుతోంది. అయితే అధికారికంగా వైఎస్ఆర్‌సీపీ మాత్రం ముందస్తు ఎన్నికల ముచ్చటే లేదని చెబతోంది. ఈ అంశంపై ఏమైనా అప్ డేట్ ఉంటే.. సీఎం జగన్ మంత్రులకు ..  ఓ హింట్ అయినా ఇస్తారని భావిస్తున్నారు. 


ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక  పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చినెలలకు సంబంధించి అప్పుల పరిమితి కూడా ముగిసిపోయింది. కార్పొరేషన్లకు సంబంధించి మరిన్ని రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కార్పొరేషన్ల రుణాలతోరెండు నెలల ఆర్థిక సమస్యలు గట్టెక్కితే...  ఏప్రిల్ నుంచి కొత్త రుణాలకు కేంద్రం అనుమతి ఇస్తుందని భావిస్తున్నారు. ఈ ఆర్థిక సమస్యలపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. 


ఏపీ , కర్ణాటక మధ్య పెట్రోల్ ధరల్లో ఎంత తేడా అంటే ? పాదయాత్రలో లోకేష్ చూపించారు...