AP Cabinet Decisions : ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన నూతన కేబినెట్ తొలిసారి భేటీ అయింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణణాలను కేబినెట్ తీసుకుంది. ఈ సమావేశం అనంతరం మంత్రి మండలి నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి చెల్లు బోయిన వేణుగోపాల కృష్ణ మీడియాకు తెలిపారు. సంక్షేమానికి క్యాలెండర్ ప్రకారమే పథకాలు అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. మే 13న కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మత్స్యకార భరోసా పథకం, మే 16 తేదీన రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.5,500, మే 31 తేదీన ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద రూ.2000, రెండు దఫాలుగా రూ.7500 రూపాయలను వేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.
జూన్ 1న సాగునీటి విడుదల
జూన్ 19 తేదీన యానిమల్ ఆంబులెన్సులను ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూన్ 6 తేదీన కమ్యూనిటీ హైరింగ్ పథకం కింద 3 వేల ట్రాక్టర్లు, 402 హార్వెస్టర్ల పంపిణీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జూన్ 14 తేదీన వైఎస్సార్ పంటల బీమా, 2021 ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయిన రైతులకు బీమా చెల్లింపునకు కేబినెట్ ఆమోదించింది. జూన్ 21 తేదీన ప్రతిష్టాత్మకమైన అమ్మ ఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో నిధులు వేసేందుకు కేబినెట్ ఆమోదం తెలియచేసింది. ముందస్తుగా వ్యవసాయ సీజన్ అమలకు నిర్ణయించింది. జూన్ 1 తేదీన వ్యవసాయానికి సాగునీటి విడుదల ప్రణాళికను కూడా ఇచ్చేందుకు మంత్రివర్గం తీర్మానించింది. ఎగుమతుల ప్రోత్సాహక విధానం 2022-27 సంవత్సరాలకు ఆమోదం తెలిపింది. 2022-27 ఏపీ లాజిస్టిక్ పాలసీ, ప్రోత్సాహకాలను కూడా ఆమోదం తెలిపింది.
రైతు బజార్లలో మౌలిక సదుపాయాలు
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్ కో సంస్థ ద్వారా బయో ఇథనాల్ తయారీకి కేబినెట్ ఆమోదించింది. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు, రైతు బజార్లలో మౌలిక సదుపాయాల కోసం రూ.1600 కోట్ల రుణ సమీకరణకు కేబినెట్ ఆమోదించింది. ప్రతీ జిల్లా కేంద్రం, కార్పొరేషన్ లో అత్యాధునిక వైద్య సౌకర్యాల కోసం మెడికల్ హబ్ ల ఏర్పాటుకు నిర్ణయించింది. ప్రైవేటు రంగంలో వచ్చే పెట్టుబడులు కూడా కనీసం వంద పడకలు ఉండేలా ఆస్పత్రుల నిర్మాణాలు ఉండేలా చూడాలంది. మచిలీపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు, కొత్తూరు, కడప జిల్లాల్లో అత్యాధునిక ఆస్పత్రుల నిర్మాణం కోసం భూమి కేటాయించాలని నిర్ణయించింది. నెల్లూరు జిల్లాలో టెక్స్ టైల్ పార్కు కోసం భూకేటాయింపు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నర్సాపురంలో రైతుల స్వాధీనంలో ఉన్న భూములకు హక్కులు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.