AP Cabinet  first meeting will be held on 24th :  ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించింది. తొలి కేబినెట్ భేటీని 24వ తేదీన నిర్వహించనున్నారు.   ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేయనున్నారు. హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాల విడుదలకు ఈ  మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.                  


ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధానంగా చర్చించనున్న కేబినెట్        


రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రత్యేకంగా కేబినెట్ చర్చించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఏపీకున్న అప్పులపై కొత్త ప్రభుత్వం ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది. రూ. 14 లక్షల కోట్లపైగా ఏపీకి అప్పుల భారం ఉందని ప్రభుత్వానికి సమాచారం వచ్చినట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ అప్పులను ఎలా తెచ్చారు.. ఎలా ఖర్చు పెట్టారు.. ఆ నిధులన్నీ ఏమైపోయాయన్నదానిపై కేబినెట్ సుదీర్ఘంగా అధికారుల వద్ద నుంచి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.  గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టే అంశంపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


ప్రజల కోసం జనసేనాని- కాన్వాయ్ ఆపి, కుర్చీలు వేసుకొని ప్రజల సమస్యలు విన్న పవన్ కళ్యాణ్


ఐదేళ్లలో జరిగిన  విధ్వంసం ప్రజల ముందు ఉంచే అవకాశం         


గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత విధ్వసం జరిగిందని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. ఆ విధ్వసం ఏపీకి, ప్రజలకు ఎంత నష్టం జరిగిందో ప్రజల ముందు పెడతామని చంద్రబాబు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ సారి అసెంబ్లీ సమావేశాలు సుదీర్ఘంగా సాగనున్నాయి. కేబినెట్ లో నిర్ణయం తీసుకుని.. అసెంబ్లీలో మొత్త శ్వేతపత్రాలు  ప్రకటించనున్నారు. జూలైలో  పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా ప్రవేశ పెట్టాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా గత ప్రభుుత్వం ఓటాన్ అకౌంట్ ను మాత్రమే ప్రవేశ పెట్టింది. కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టాల్సి ఉంది.               


తిరుమలలో దర్శనం టిక్కెట్లు, లడ్డూ రేట్లు తగ్గించారా ? అసలు నిజం ఇదే


పూర్తి స్థాయి బడ్జెట్ పైనా కసరత్తు                                                              


కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతలకు తగ్గట్లుగా పథకాలకు నిధులు కేటాయించనున్నారు. పోలవరం, అమరావతితో పాటు రోడ్ల నిర్మాణం వంటి వాటికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనుంది. అలాగే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ వంటిపైనా నిర్ణయం తీసుకోనున్నారు. తొలి కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలపై అందుకే ఆసక్తి ఏర్పడింది.