AP BJP : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో కలిసి వెళ్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం సంచలనం అయింది. ఇప్పటి వరకూ బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. సాంకేతికంగా ఆ రెండు పార్టీలు పొత్తుల్లో ఉన్నాయి కానీ ఇంత వరకూ ఎక్కడా కలిసి పని చేయలేదు. పోరాటాలు చేయలేదు. ఇప్పటికే తాము జనసేనతో పొత్తులోనే ఉన్నామని బీజేపీ చెబుతోంది. పవన్ కల్యాణ్ ప్రకటన తర్వాత బీజేపీ మీడియా విభాగం పొత్తులపై తమ అభిప్రాయాన్ని విడుదల చేసింది. జనసేనతోనే పొత్తులో ఉన్నామని.. పొత్తులపై కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. 
 
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని  పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం వ్యక్తం చేశారని.. కానీ  పొత్తుల అంశం బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందన్నారు.  ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా అనేదానిపై కేంద్ర నాయకత్వం స్పష్టత ఇస్తుందిని ఏపీ బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది.  ప్రధాని మోదీ,  బిజెపి జాతీయ అధ్యక్షులు  జేపీ నడ్డా అన్నీ చర్చించి నిర్ణయిస్తారన్నారు.  ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీతో బిజెపి పొత్తు కొనసాగుతోందని తెలిపింది.  అయితే ఏపీలో బీజేపీ వైసీపీకి దగ్గరగా ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. కానీ తాము వైఎస్ఆర్‌సీపీకి దగ్గరా లేమని ఆ పార్టీ నేతలు చెబుతూ ఉంటారు. సోము వీర్రాజును మార్చి పురందేశ్వరికి బాధ్యతలు ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ సర్కార్‌పై విమర్శలు పెంచారు.                                    


తెలుగుదేశంతో పొత్తులపై ఢిల్లీలో స్థాయిలో చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ  అధినేత చంద్రబాబునాయుడు ఓ సారి ఢిల్లీ వెళ్లి జేపీ నడ్డా, అమిత్ షాలతో చర్చలు జరిపారు. అయితే ఆ సమావేశం తర్వాత పూర్తి వివరాలు వెలుగులోకి రాలేదు. తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉండదని.. ఇప్పటికే ఆలస్యమయిందని చంద్రబాబు.. ఎన్టీఆర్ నాణెం విడుదల సందర్భంగా ఢిల్లీకి వెళ్లినప్పుడు మీడియా ప్రతినిధులతో చెప్పారు.  ఏపీలో పొత్తులపై కాలనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. టీడీపీ గతంలో ఎన్డీఏలో భాగస్వామి. అందుకే.. మళ్లీ ఎన్డీఏలో చేరుతుందని జాతీయ మీడియాలో గతంలో ప్రచారం జరిగింది.                                     


కానీ ఇటీవలి కాలంలో ఏపీ రాజకీయాల్లో జరిగిన మార్పులతో పవన్ కల్యాణ్ ఒక్క సారిగా తన మనసు మార్చుకున్నారు.  చంద్రబాబుతో ములాఖత్ తర్వాత పొత్తును ప్రకటించేశారు. బీజేపీ కలిసి వస్తే సరి లేదంటే లేదన్నట్లుగా మాట్లాడారు. దీంతో ఏపీలో బీజేపీ పరిస్థితి ఒంటరి అయినట్లు అయింది.