Purandeswari  :  ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరి ..  తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో సమావేశం అయ్యారు. పార్టీ అధ్యక్షురాలిగా నియమించిన సమయంలో ఆమె అమరనాథ్ యాత్రలో ఉన్నారు. యాత్ర ముగించుకుని ఢిల్లీకి వచ్చిన తర్వాత జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు  శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని పురందేశ్వరి తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం , ఏపీ ప్రజల ప్రయోజనాల కోసమూ కృషి చేస్తామన్నారు. 


 





 దగ్గుబాటి పురందేశ్వరి ఇప్పటి వరకూ  రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోలేదు.  కాంగ్రెస్ పార్టీ హయాంలో పదేళ్లు కేంద్ర మంత్రిగా చేశారు. ఆ తర్వాత  బీజేపీలో చేరిన జాతీయ స్థాయి పదవుల్లోనే పని చేశారు. అయితే ఆమెను తొలి సారిగా రాష్ట్ర బీజేపీ అద్యక్ష పదవిలో నియమించారు. 


దేశంలో బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్నది ఏపీలోనే. ఒక్క శాతం ఓటు బ్యాంక్ కూడా లేదు. గత తొమ్మిదేళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ..బలహీనంగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో బలోపేతం అయినప్పటికీ ఏపీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఎంత మంది నేతల్ని మార్చినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. దీంతో బీజేపీ హైకమాండ్ పురందేశ్వరి వైపు మొగ్గు చూపింది. 


ఇక ముందు పెద్ద ఎత్తున కార్యక్రమాలు పేట్టాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. పురందేశ్వరి ఒకటి, రెండు రోజుల్లో ఏపీకి రానున్నారు. ఈ సందర్భంగా భారీ కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచన చేస్తున్నారు. గతంలో బీజేపీ అమరావతికి మద్దతు ఇచ్చినా అక్కడి రైతులు నమ్మలేకపోయారు. అలాగే పలు అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినా .. ప్రజలు బీజేపీ, వైసీపీ ఒక్కటే అన్న అభిప్రాయం వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం పురందేశ్వరి నాయకత్వంలో అలాంటి ముద్ర వేయడానికి అవకాశం ఉండదని భావిస్తున్నారు. 


ఇటీవలి కాలంలో బీజేపీ  స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు, ప్రజా చార్జి,షీట్ వంటి కార్యక్రమాలు నిర్వహించింది.  అయితే  ప్రో వైసీపీ ముద్ర ఉండటంతో పెద్దగా  ప్రజల్లోకి వెళ్లలేదు. ఇప్పుడు పురందేశ్వరి నాయకత్వంలో మరింత జోరుగా ప్రజల్లోకి వెళ్లే ఆలోచన చేయాలనుకుంటున్నారు. దీనిపై కార్యాచరణ త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.