ఆంధ్రప్రదేశ్ కు రండి అంటూ ప్రధాని నరేంద్ర మోదీని భారతీయ జనతా పార్టీ నేతలు ఆహ్వానించారు. కర్ణాటక ఎన్నికల తరువాత రాష్ట్ర పర్యటనకు రావాలని కోరినట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు రండీ... ప్రధానిని ఆహ్వనించిన బీజేపీ నేతలు...
కర్ణాటక ఎన్నికలపై బీజేపి ప్రత్యేక దృష్టి సారిచింది. దీంతో ఇప్పుడు ఆ పార్టీ నేతలంతా కర్ణాటక ఎన్నికల పైనే ప్రత్యేకంగా పని చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ఓటర్లు సైతం అధికంగా ఉండటంతో భారతీయ జనతా పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ నేతలు కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాయకులు కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్దన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కర్ణాటక ఎన్నికలు ముగిశాక ఆంధ్రప్రదేశ్‌లో పర్యటనకు రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించిట్లు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించాలని, అభివృద్ధి పనులను ప్రారంభించాలని ప్రధాని మోదీని బెంగళూరులో నేరుగా కలసి కోరామని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
కర్ణాటక ఎన్నికల్లో కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు.. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల పర్యటన వ్యవహారాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి, ఎన్నికల ప్రచారంలో ఉన్న మోదీకి కలిసినట్లు చెప్పారు. మోదీ మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షాలు తెలిపినట్లు ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, సంక్షేమ పథకాలు కూడా కేంద్ర నిధులతో రాష్ట్రంలో చాలా వరకు అమలవుతున్నందున, ఏపీలో పర్యటించాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అన్ని విషయాలపై స్పష్టమైన అవగాహన ఉందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
కర్ణాటకలో మోదీ ప్రచారానికి ఎదురులేదు..
కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని మోదీ సభలకు విశేషమైన స్పందన వచ్చిందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఎక్కడ చూసినా మోదీ నామస్మరణే వినిపిస్తోందని బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా కర్నాటకలో బీజేపి ప్రభుత్వం తిరిగి వస్తుందని ఆ పార్టి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా, మోదీ ప్రత్యేక శ్రద్ధతో.. ఎన్నికల ప్రచారంతోనేటితరం యువ నేతలకు ఎంతో స్ఫూర్తి పొందుతున్నారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో పనిచేస్తున్న నేతంలందరికీ మోదీ పర్యటన, పార్టీ వ్యవహరాలు ఓ పాఠం లాంటివని, ప్రజలకు ఎలా భరోసా ఇవ్వాలి. చేసిన అభివృద్ధి వివరించి ప్రజల నమ్మకాన్ని ఎలా చూరగొనాలి.. అనే విషయాలను మోడీ నుంచి నేర్చుకున్నామని పార్టీ నేతలు అంటున్నారు. కర్ణాటకలో మళ్లీ కమల వికాసం ఉంటుందన్న నమ్మకాన్ని మోదీ సభలకు వస్తున్న స్పందనతో అర్థం అవుతుందని చెబుతున్నారు.
కర్ణాటక తరువాత ఆంధ్రప్రదేశ్ పైనే ఫోకస్..
కర్ణాటక ఎన్నికల తరువాత జరిగే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పనిలో పనిగా ఇప్పటికే ఎన్నికల ఫీవర్ పెరిగిపోవటంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు పై బీజేపీ ఫోకస్ చేయాలని భావిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోదీ పర్యటించినప్పటికీ అది కేవలం అధికారిక పర్యటన మాత్రమే కావటంతో, పార్టీ శ్రేణులకు అంతగా టచ్ లోకి వెళ్ళలేని పరిస్దితి ఏర్పడింది. ఇప్పుడు ఎన్నికల సీజన్ మెదలవటంతో,తెలంగాణాతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో మోదీ పర్యటనలు ప్లాన్ చేస్తే పార్టీకి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉందని కమల దళం భావిస్తోంది.