APBJP On Delhi Liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ కేసులో ప్రధానంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ , బీఆర్ఎస్ పార్టీ నేతలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే ఎక్కువగా ఢిల్లీ, తెలంగాణ బీజేపీ నేతలే స్పందిస్తున్నారు. దీనికి కారణం ఆ రెండు పార్టీలు ఆయా రాష్ట్రాల్లో కీలకం కావడమే కాదు.. లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా ఆ రాష్ట్రాలకు చెందినవారే. అయితే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా మారినట్లుగా ప్రకటించుకుంది. దీంతో ఏపీ బీజేపీ నేతలు కూడా ఈ అంశంపై బీఆర్ఎస్ నేతల్ని ప్రశ్నిస్తున్నారు.
జాతీయ స్థాయిలో ఏపీ బీజేపీ అభిప్రాయాలు తెలుసుకోవాలంటే జాతీయ మీడియా ప్రధానంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని సంప్రదిస్తూంటుంది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో కూడా మంచి పట్టు ఉన్న ఆయన ఆయా మీడియాలకు బీజేపీ స్పందన తెలియచేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తరచూ బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని రామచంద్ర పిళ్లై రౌస్ అవెన్యూ కోర్టులో వేసిన పిటిషన్ అంశంపై విష్ణురవ్ధన్ రెడ్డి సెటైర్లు వేశారు. ఈడీ అంటే కామెడీ అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో సింపతీ కోసం డిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ప్రయత్నిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. హర్షిత అనే యువతి.. నైట్ సమయంలో ప్రయాణానికి సికింద్రాబాద్ వద్ద సెక్యూర్ ట్రాన్స్ పోర్టు లేదని ట్వీట్ చేశారు. కేటీఆర్, కవితకు ట్యాగ్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందించి డీజీపీకి సిఫారసు చేశారు. హర్షితకు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే ఇది చీప్ పీఆర్ ట్రిక్ అని.. విష్ణువర్దన్ రెడ్డి సటైర్ వేశారు. ఢిల్లీలో కవిత చేస్తున్న ధర్నాకు అటెన్షన్ కోసమే ఇలా చేశారని విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు.
ఓ వైపు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజగా ఉంటూ మరో వైపు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీ నుంచి బీఆర్ఎస్ ను టార్గెట్ చేసే విషయంలో వెనక్కి తగ్గడం లేదు. జాతీయ మీడియాకు బీజేపీ తరపున అభిప్రాయాలు చెబుతూ.. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.