వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవినీతిపై భారతీయ జనతా పార్టీ మెదటి నుంచి పోరాటం సాగిస్తూనే ఉందని రాష్ట్ర అధ్యక్షుడు సొము వీర్రాజు తెలిపారు. తాము ఏనాడూ వైసీపీ ప్రభుత్వాన్ని సమర్ధించిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.

దూకుడు పెంచుతున్న కమలం...బీజేపీ అగ్రనేతలు ఏపీలో పర్యటించిన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు మరింత దూకుడు పెంచారు. బీజేపీ ఏనాడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టిని సమర్థించలేదని సోమువీర్రాజు పేర్కొన్నారు. కేంద్ర హోంమత్రి అమిత్‌షా, భారతీయ జనతా పార్టి జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్డా ఇటీవల విశాఖ, శ్రీకాళహస్తి బహిరంగసభల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పై చేసిన విమర్శలు, ఆరోపణల పై తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. బీజేపీ ఇప్పుడు కొత్తగా మాట్లాడటం లేదుని ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నామన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ను బీజేపీ ఎప్పుడూ సమర్ధించలేదని తెలిపారు.

ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం పై యువమోర్చా ఉద్యమం చేపడితే కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ వచ్చి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం మాఫియా పై తీవ్ర విమర్శలు చేశారని గుర్తుచేశారు. జేపీ నడ్డా జూన్‌లో విజయవాడ, రాజమండ్రిలో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలపై ఘాటుగా విమర్శించారని గుర్తుచేశారు. అలాగే ప్రకాష్‌ జవదేకర్‌ కూడా జగన్‌ అవినీతిపై స్పందించి జైలుకు వెళ్లే అవకాశం ఉందంటూ ఆరోపించిన విషయాలను సైతం సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఇక శ్రీకాళహస్తిలో నడ్జా, విశాఖలో అమిత్‌షాలు రాష్ట్ర ప్రభుత్వ దోపిడి, కుంభకోణాలపై ఘాటుగా స్పందించి విమర్శించారని చెప్పారు.

మత వివక్షను కొనసాగిస్తోంది...వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మత వివక్ష కొనసాగిస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు.  హిందూ ధర్మంపై దాడులు జరిగితే ఉపేక్షించి నిందితులను వెనకేసుకొచ్చిందని మండిపడ్డారు. రామతీర్ధం ఘటన పై బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసిందని తెలిపారు.  

బీజేపీపై బురద చల్లే ప్రయత్నం...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దురుద్దేశంతో బీజేపీపై  బురద జల్లాలని చూస్తోందని సోము వీర్రాజు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వతో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టి కలసి ఉన్నట్లు, ఇక పై ఉండదేమో అనే అనుమానాన్ని ముఖ్యమంత్రి జగన్‌ వ్యక్తం చేయడం వ్యూహంతో కూడిన వంచనగా వీర్రాజు పేర్కొన్నారు. బీజేపీ ఎప్పుడు మీతో ఉందో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైసీపీకి సహకరించని కారణంగా అభ్యంతరకరమైన సంబోధనతో పవన్‌ కల్యాణ్‌ను జగన్‌ విమర్శించడంతో ఆ పార్టీతో మిత్రపక్షంగా ఉన్న  పార్టీగా బీజేపీ, జగన్‌ను విమర్శిస్తోందన్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పై అభ్యంతరకరంగా  పద ప్రయోగాలు చేసే అర్హత ముఖ్యమంత్రికి లేదన్నారు.

కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటూనే వ్యాఖ్యలు...కేంద్రం నుంచి అవసరమైనన్ని నిధులు తెచ్చుకుంటూ వాటిని దారి మళ్లించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మజా చేసుకుందని సోము వీర్రాజు ఆరోపించారు. విమర్శించినపుడు ఎదురు మాట్లాడక ప్రజల్ని ఏమార్చేలా జగన్‌ వ్యూహం అమలు చేస్తున్నారని అన్నారు.