Purandeswari :   ఆంధ్రప్రదేశ్ లో భారీ లిక్కర్ స్కాం జరుగుతోందని ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సర్కార్‌పై ఘాటు విమర్శలు చేశారు. నాణ్యత లేని బ్రాండ్లను విక్రయిస్తున్న సొమ్ము తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తోందని .. మద్యం అమ్మకాల్లో 25శాతానికి బిల్లులే ఉండటం లేదన్నారు. ఇసుక లోడ్ కొనాలంటే రూ.40 వేలని.. ఇసుక ద్వారా జరుగుతున్న అవినీతిని ఒక సంస్ధకు కేటాయిస్తూ దోచుకున్నారని మండిపడ్డారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో నడుస్తోందన్నారు. 


పోలవరం చేతకాకపోతే కేంద్రానికి అప్పచెప్పాలి ! 


విశాఖలో ఒక వ్యక్తి ల్యాండ్ కబ్జా చేస్తే.. కడప నుంచి వచ్చిన వారు బెదిరిస్తే.. కోర్టుకు వెళ్లి గెలిచి తన ల్యాండ్ గెలుచుకున్నారని తెలిపారు. ఎక్కడ భూమి కనబడితే అక్కడ కబ్జా చేస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ విమర్శించారు.  పోలవరంపై కేంద్రం ఎక్కడా ‌జాప్యం చేయలేదని .. . ఇటీవల రూ.12 వేల కోట్లు పోలవరంకి కేంద్రం ఇచ్చిందన్నారు. పోలవరం మీరు కట్టకుంటే కేంద్రానికి అప్పచెప్పాలన్నారు.  చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇప్పటిదాకా‌ బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కల్పించలేని పరిస్ధితుల్లో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు. మహిళలు మొబైల్ ఊపడానికే తప్ప దిశా ఎందుకు పనికిరావడం లేదని విమర్శించారు. విశాఖలో ఎంపీ కుటుంబానికే రక్షణ లేదన్నారు. నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తోందని మండిపడ్డారు.


ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధుల లెక్క చెప్పాలి ! 


ఏపీలో జాతీయ రహదారులు 8623 కిలో మీటర్ల నిర్మాణాలకు రూ.1 లక్షా 15 వేల కోట్లు కేంద్రం కేటాయించిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రహదారులు వేసిందో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్ధితి ప్రజలందరికీ తెలుసన్నారు. ఏపీ డివిజన్ యాక్ట్ ప్రకారం రెండేళ్లలోనే జాతీయ విద్యాసంస్ధలన్నీ కేంద్రం ఏపీలో నిర్మించిందన్నారు. ఎయిర్ పోర్టుల విస్తరణను కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఏపీలో అభివృద్ధి జరిగిందన్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టు విస్తరణ, పలు ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్ధాపనకు ప్రభుత్వం కృషి చేయలేదని విమర్శించారు. పెట్టుబడులు రాష్ట్రానికి రావడం లేదని.. ఉన్నవి తరలిపోతున్నాయని పురంధేశ్వరి వ్యాఖ్యలు చేశారు.


కేంద్రం ఇస్తున్న నిధుల గురించి ఎందుకు చెప్పరు ? 


రాష్ట్రంలోని ఎయిమ్స్‌ను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్‌ఆర్‌జీపీ కింద 2022 - 23 వరకు 8 వేలకు కోట్లకు పైగా వచ్చాయన్నారు. రాష్ట్రంలో 90 లక్షల మందికి ఉచిత‌ బియ్యం అందుతోందన్నారు. ఈ ఏడాది బియ్యం ద్వారా 10 వేల కోట్లకు పైగా రాష్ట్రానికి అందిందని తెలిపారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ప్రతీ రైతుకు రూ.12 వేలు ఇస్తామన్నారని.. దానిపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇస్తున్న రూ.6 వేలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రైతులను సీఎం మోసం చేయడం కాదా అంటూ మండిపడ్డారు. రైల్వేలో 72 స్టేషన్‌ల అభివృద్ధికి కేంద్రమే సహాయ సహకారాలు అందించిందన్నారు. ఏపీ ప్రభుత్వం సహకరిస్తే అన్ని అభివృద్ధి చెందుతాయని... లేకుంటే పెండింగ్‌లో ఉన్నవి పెండింగ్‌లోనే ఉండిపోతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.46,836 కోట్లు గ్రాంట్లు ద్వారా రాష్ట్రానికి అందిస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం నెరుగా సర్పంచ్‌ల అకౌంట్‌లలోకి నిధులు విడుదల చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం  పక్కదారి పట్టించిందన్నారు.   


బీజేపీ లక్ష్యం అభివృద్ధి ! 


అనంతరం పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. తనను రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు. బీజేపీ.. అభివృద్ధికి పెద్దపీట వేసే పార్టీ అని.. అవినీతిని వ్యతిరేకించే పార్టీ అని అన్నారు.  ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి   బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని బీజేపీ పార్టీ కార్యాయలంలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకున్న పురంధేశ్వరికి బీజేపీ నేతలు స్వాగతం ప లికారు.  ఎయిర్‌పోర్ట్ నుంచి భారీ ర్యాలీతో ఏపీ బీజేపీ చీఫ్‌ బీజేపీ పార్టీ ఆఫీస్‌కు చేరుకున్నారు.  అధ్యక్షురాలికి పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించారు.