AP Beverages Corporation Ex MD Vasudeva Reddy Arrest | అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఇటీవల ఏపీలో అరెస్టుల పర్వం మొదలైంది. జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. తాజాగా ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఏపీ సీఐడీ అధికారులు వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారని సమాచారం. ఏపీలో మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఓ అజ్ఞాత ప్రాంతంలో ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీని సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జే బ్రాండ్ మద్యం విక్రయాల విషయంపై వాసుదేవరెడిపై భారీ అభియోగాలు నమోదయ్యాయి.
వైసీపీ హయాంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పట్లో డిప్యూటేషన్ పై వాసుదేవరెడ్డిని రప్పించారని వార్తలు వచ్చాయి. ఏపీలో మద్యం విక్రయాలు పెంచే బాధ్యత ఆయనకు జగన్ అప్పగించారని టీడీపీ నేతలు గతంలోనే ఆరోపించారు. దాంతో వాసుదేవరెడ్డి రాష్ట్రంలో డిస్టిలరీలు, డిపోలు, షాపులపై అజమాయిషీ చేశారు. ఇంకా చెప్పాలంటే ఏపీలో జే బ్రాండ్లు తీసుకురావటంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారట. ఏపీలో మద్యంపై ఆదాయాన్ని ముందుగానే తాకట్టు పెట్టి వైసీపీ ప్రభుత్వం వేల కోట్లు అప్పులు తెచ్చిందని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి చవిచూసింది. అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు గత ఐదేళ్లలో జరిగిన పాలనలో లోపాలు, అవినీతిపై ఫోకస్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వాసుదేవరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లగా.. 2 నెలల తరువాత ఏపీ సీఐడీ ఆయనను అరెస్ట్ చేసింది. వాసుదేవరెడ్డి అరెస్ట్ వార్త రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
వైసీపీ హయాంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌లో భారీ అవినీతి జరిగిందని, ఎన్నికల అనంతరం కార్పొరేషన్ ఆఫీసు నుంచి ఫైళ్లు మాయం చేశారని వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు నమోదు చేసింది. తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం వాసుదేవరెడ్డికి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడం తెలిసిందే.
ఫైళ్లు తరలించారని వాసుదేవరెడ్డిపై కేసు నమోదు
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం మెుగులూరుకు చెందిన శివకృష్ణ ఫిర్యాదుతో వాసుదేవరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్పొరేషన్ నుంచి ఫైళ్లు తరలిస్తున్నట్లు చూశానని ఆ ఫిర్యాదులో శివకృష్ణ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. హైదరాబాద్‌లో వాసుదేవరెడ్డికి చెందిన ఓ ఖరీదైన విల్లాలో మూడు రోజులపాటు సోదాలు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన నివాసాలలో సోదాల్లో భాగంగా కీలకమైన డాక్యుమెంట్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఉద్యోగిగా ఉండే వాసుదేవరెడ్డి డిప్యూటేషన్ పై ఏపీ ప్రభుత్వానికి వచ్చారు. అప్పటి సీఎం వైఎస్ జగన్, వాసుదేవరెడ్డికి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు అప్పగించారు. వైసీపీ నేతలకు సంబంధించిన డిస్టిలరీల నుంచి వచ్చే మద్యాన్ని విక్రయించేలా చూశారని, మద్యం ఆదాయం చూపించి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చుకోవడంలోనూ వాసుదేవరెడ్డి కీలకంగా వ్యవహరించాలని టీడీపీ నేతలు ఆరోపించారు.
Also Read: రోజా చుట్టూ బిగుస్తున్న క్రీడల ఉచ్చు! అరెస్ట్ చేసే ఛాన్స్