AP Governor Suspends Assembly: ఏపీ అసెంబ్లీని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రద్దు చేశారు. 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆర్టికల్ 174 ప్రకారం కేబినెట్ సిఫార్సుల మేరకు రాష్ట్ర శాసనసభను రద్దు చేశారు. ఈ విషయాన్ని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ - జనసేన - బీజేపీ కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఫలితంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిన్న (జూన్ 4) గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించిన గవర్నర్.. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసేవరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు.
ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 అసెంబ్లీ స్థానాల్లో గెలిచాయి. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం అమరావతిలో ఉంటుందని గతంలోనే ప్రకటించారు.