AP Assembly Sessions: ఏపీలో అసెంబ్లీ (AP Assembly) సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 11 నుంచి 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించనుంది. తొలి రోజు ఉదయం 11 గంటలకు వార్షిక బడ్జెట్‌ను సర్కారు సభలో ప్రవేశపెట్టనుంది. తొలుత గవర్నర్ ప్రసంగం అనంతరం అదే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టగా.. నవంబర్ 30తో గడువు ముగియనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు వెళ్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు గడువు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.


ఈ క్రమంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటితో పాటు ఇతర బిల్లులను సైతం సభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనుంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో గత జులైలో చివరి సమావేశాలు 5 రోజుల పాటు సాగాయి. ఈసారి సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. సూపర్ సిక్స్ హామీల అమలు, నూతన మద్యం పాలసీ, ఉచిత ఇసుక సరఫరాపై చర్చ సాగనుంది. అంతేకాకుండా మరిన్ని కొత్త స్కీమ్‌ల అమలుపై కూడా సభలో కీలక ప్రకటనలు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ నెల 6న కేబినెట్ భేటీ


అసెంబ్లీ సమావేశాల క్రమంలో ఈ నెల 6న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు సహా బడ్జెట్‌పై లోతుగా చర్చించే అవకాశం రానుంది. అలాగే, సభలో చర్చించే అంశాలపైనా దిశానిర్దేశం చేయనున్నారు.


కాగా, గత అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ నేతలు ఎవరూ హాజరుకాలేదు. ఈ క్రమంలో సమావేశాలు ఏకపక్షంగానే సాగాయి. తొలిరోజు మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నేతలు సమావేశాలకు హాజరైనా ప్రమాణస్వీకారం అనంతరం సమావేశాల బయట ఆందోళన నిర్వహించి అనంతరం వెళ్లిపోయారు. మరి ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారో లేదో అనే దానిపై స్పష్టత లేదు. 


Also Read: Kurnool News: ‘డెలివరీ కోసం వెళితే ప్రాణం తీశారు’ - హాస్పిటల్ ఎదుట కుటుంబసభ్యుల ఆందోళన