Breaking News Live: గుంటూరులో విషాదం - మట్టిపెళ్లలు విరిగిపడి ఒకరు మృతి, నలుగురికి గాయాలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 16 Mar 2022 11:57 AM
Gujrat Drugs: ముంద్రాపోర్టు డ్రగ్స్ కేసులో కీలక వివరాలు బయటికి

గుజరాత్‌లోని ముంద్రాపోర్టులో కొద్ది నెలల క్రితం బయటపడిన డ్రగ్స్ వ్యవహారంలో కీలక వివరాలు వెలుగు చూశాయి. రూ.3 వేల కోట్ల డ్రగ్స్ కేసులో తాజాగా NIA ఛార్జిషీట్ దాఖలు చేసింది. విజయవాడకు ఈ దందాతో లింకులు ఉండగా.. ఆషీ ట్రేడింగ్ పేరుతో డ్రగ్స్ వ్యాపారం సాగింది. ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక వివరాలు వెల్లడించింది. ఈ కేసులో మాచవరం సుధాకర్‌, తన భార్య వైశాలితో పాటు అఫ్గానిస్థాన్‌కు చెందిన పెడ్లర్ సూత్రధారులు అని గుర్తించారు. మాచవరం సుధాకర్‌కు చెందిన ఆషీ ట్రేడింగ్‌తో డ్రగ్స్ దిగుమతి చేసుకునే వారు. టాల్కమ్ పౌడర్ పేరుతో డ్రగ్స్‌ను తెప్పించారు. తమిళనాడు, గుజరాత్, చెన్నై, ఢిల్లీకి చెందిన డ్రగ్స్ పెడ్లర్స్‌పై ఎన్ఐఏ అభియోగాలు మోపింది. ఇప్పటి వరకూ ఈ కేసులో 10 మంది అరెస్టు చేసినట్లుగా NIA వెల్లడించింది. ఆఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మీదుగా ఈ సరఫరా జరిగేదని ఎన్ఐఏ గుర్తించింది. అఫ్గానిస్థాన్‌కు చెందిన హాసన్ డాడీ కీలక సూత్రదారి అని ఎన్ఐఏ వెల్లడించింది. ఈ కేసులో మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. హవాలా ద్వారా డబ్బులు మార్చినట్లుగా గుర్తించారు. 

గుంటూరులో విషాదం - మట్టిపెళ్లలు విరిగిపడి ఒకరు మృతి, నలుగురికి గాయాలు

గుంటూరులో విషాదం చోటుచేసుకుంది. మట్టిపెళ్లలు విరిగిపడి ఒకరు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. అమరావతి రోడ్డులోని ముత్యాలరెడ్డి నగర్‌లో భవన నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మట్టిపెళ్లల కింద చిక్కుకున్న చిక్కుకున్న కూలీలను బయటకు తీసేందుకు సహాచక చర్యలు చేపట్టారు. ఈ కూలీ ఉపాధి కోసం బిహార్ నుంచి ఇక్కడికి వలస వచ్చారు.

Air Gunfire: ఫాంహౌస్ లో ఎయిర్ గన్ ఫైర్ - ఓ బాలిక మృతి

Air Gunfire: సంగారెడ్డిలో ఎయిర్ గన్ ఫైర్ - ఓ బాలిక మృతి


ఓ ఫాంహౌస్ లో ఎయిర్ గన్ పేలి బాలిక మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం వావిరాలలో ఘటన జరిగింది. పిల్లల ఆడుకుంటుండగా ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఉస్మానియా ఆసుపత్రికి బాలిక మృతదేహం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు నిధుల విడుదల

జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ కానున్నాయి. అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నిధులను సెక్రెటేరియట్ నుంచి బటన్ నొక్కి డబ్బు విడుదల చేశారు. 10.89 లక్షల విద్యార్థులకు లబ్ధికలగనుండగా, మొత్తం రూ.709 కోట్లను విడుదల చేశారు. ఇప్పటి వరకూ 9,274 కోట్లను చెల్లించారు. 

AP Assembly Live: 10 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల గందరగోళంతో ఆ పార్టీకి చెందిన 10 మంది సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. ఈ ఒక్కరోజు సెషన్‌కు మాత్రమే వారిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. అశోక్ బేందాలం, ఆదిరెడ్డి భవానీ, నిమ్మకాయల చిన్నరాజప్ప, వెంకటనాయుడు, జోగేశ్వరరావు, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామక్రిష్ణ, మంతెన రామరాజు, రవికుమార్ గొట్టిపాటి, సాంబశివరావు ఏలేరు, సత్యప్రసాద్ అనగానిను సస్పెండ్ చేశారు. వీరు తక్షణం సభ వదిలి వెళ్లాలని స్పీకర్ ఆదేశించారు.

AP Assembly: ఏపీ అసెంబ్లీ వాయిదా

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు బుధవారం ప్రారంభం అయిన వెంటనే వాయిదా పడ్డాయి. సభ మొదలుకాగానే జంగారెడ్డి గూడెంలో జరుగుతున్న మరణాలపై జ్యుడీషియల్ విచారణకు టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. సభలో అసత్యాలా అంటూ నిలదీస్తూ ఆందోళన చేశారు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఎలా ప్రవర్తించాలో తెలియని మీరు ఎమ్మెల్యేలా అంటూ వ్యాఖ్యానించారు. అయినా సభలో ఆందోళన కొనసాగడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

Background


ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న బలమైన వేడిగాలుల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం పొడిగా మారింది. ఈ రోజు ఎండల తీవ్రత మరింత ఎక్కువైంది. ఉష్ణోగ్రతలు ఇప్పుడు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు కానుంది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, ఉత్తర దిశ నుంచి గాలులు వేగంగా వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో వాతావరణం మరికొన్ని రోజులపాటు పొడిగా మారుతుంది. ఓ వైపు మధ్యాహ్నం పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నా, రాత్రి వేళల్లో చలి ప్రభావం తగ్గలేదని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.


ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మధ్యాహ్నం ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖ నగరంలో ఉక్కపోత మరింత ఎక్కువైంది. 100 శాతం తేమ​, ఎండ వేడితో చాలా ఉక్కపోత ఉంటుంది. విజయవాడ నగరంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. విజయవాడతో పాటుగా రాజమండ్రి, ఏలూరు కేంద్రాల్లోనూ ఉక్కపోత అధికం కానుంది. రానున్న మూడు రోజుల్లో 43 డిగ్రీలను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. నందిగామలో 38.5 డిగ్రీలు, అమరావతిలో 38.2 డిగ్రీలు, విశాఖపట్నంలో 37.5 డిగ్రీలు, కాకినాడలోనూ 37 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పగటి పూట వేడి అధికంగా ఉంటుంది. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు ఉన్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కోస్తా భాగల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. ఎండలు రానున్న పదిరోజుల్లో ఎక్కువ పెరుగుతాయి. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్తే గొడుగు తీసుకెళ్లాలని, కొబ్బరి బొండాలు, పళ్ల రసాలు తాగడం ద్వారా డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారని అధికారులు పేర్కొన్నారు. రోజుకు కనీసం 5 లీటర్ల వరకు మంచి నీళ్లు తాగాలని అధికారులు సూచించారు. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న వేడి గాలుల ప్రభావంతో ప్రకాశం, కర్నూలు, గుంటూరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఉక్కపోత ఎక్కువ అవుతుంది. కర్నూలులో 38.5 డిగ్రీలు, నంద్యాలలో 39.5 డిగ్రీలు, అనంతపురంలో 38.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


తెలంగాణ వెదర్ అప్‌డేట్ (Telangana Temperature Today)
ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు భాగాలు, ఉత్తర భాగల్లో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మిర్యాలగూడలో కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో వేడి, ఉక్కపోత రోజురోజుకూ పెరిగిపోతోంది. రాష్ట్రంలోని తూర్పు ప్రాంతాలైన సూర్యాపేట​, మహబూబాబాద్, నల్గొండ​, భద్రాద్రి, ములుగు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల​, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలతో వాతావరణం పొడిగా మారుతుంది. నల్గొండలో 40 డిగ్రీలు, భద్రాచలంలో 39 డిగ్రీలు, మహబూబ్ నగర్‌లో 38 డిగ్రీలు, హైదరాబాద్ లో 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.