Breaking News Live: మారేడుమిల్లి వద్ద లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు-20 మందికి గాయాలు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 14 Mar 2022 07:40 PM
Maredumilli : మారేడుమిల్లి వద్ద లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు-20 మందికి గాయాలు 

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి వద్ద బస్సు ప్రమాదం జరిగింది. లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని మారేడుమిల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  భద్రాచలం నుంచి కాకినాడ వెళ్తోన్న గోకవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మారేడుమిల్లికి మూడు కి.మీ దూరంలో లారీని ఢీకొట్టింది. బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రయాణిస్తున్నారు.

TDP Leaders Suspension: సస్పెండ్ అయిన టీడీపీ సభ్యులు బయటకు వెళ్లాలి: స్పీకర్ తమ్మినేని

సస్పెండ్ చేసిన ఐదుగురు టీడీపీ సభ్యులు తక్షణం బయటకు వెళ్లిపోవాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆదేశించగా, టీడీపీ నాయకులు ససేమిరా అన్నారు. తాము ఏం తప్పు చేశామని ప్రశ్నించారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. బడ్జెట్ కి సంబంధించిన విలువైన చర్చా సమయాన్ని వేస్ట్ చేశారని అన్నారు. ఎంతో మంది సభ్యులు విలువైన ప్రశ్నలు ఇచ్చారని, వాటిపై చర్చ జరగకుండా అడ్డుకున్నారని అన్నారు. ఇతర సభ్యుల హక్కులను ఉల్లంఘించారని అసహనం వ్యక్తం చేశారు. శాసన సభాపతి స్థానం వద్దకు టీడీపీ నాయకులు వచ్చి పేపర్లు వేయడంపై మాట్లాడుతూ.. స్పీకర్‌పై ఉన్న గౌరవం ఏపాటిదో అర్థం ఆ ఘటనతో అర్థం అవుతోందని అన్నారు. ఆ వీడియో మొత్తం ప్రజలు చూశారని, టీడీపీ నేతల చేష్టలు ప్రజలు చూస్తూనే ఉన్నారని అన్నారు.

TDP Leaders Suspension: ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ నేతల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ నేతలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ ఉదయం నుంచి టీడీపీ నేతలు సభా కార్యాకలాపాలకు అడ్డు తగులుతున్నారనే కారణంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఐదుగురు టీడీపీ సభ్యులపై వేటు వేశారు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావు కేశవ్, నిమ్మల రామానాయుడు, బాలవీరాంజనేయులును ఈ బడ్జెట్ సెషన్ నుంచి పూర్తిగా సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు.

Brother Anil Meets Christian Leaders: విశాఖలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో బ్రదర్‌ అనిల్‌ భేటీ

Brother Anil Kumar Meeting With Christian Leaders: విశాఖలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో బ్రదర్‌ అనిల్‌కుమార్‌ భేటీ అయ్యారు. రాజకీయ పార్టీ పెడతారన్న ప్రచారాలతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. విశాఖలోని మేఘాలయ హోటల్‌లో క్రైస్తవ సంఘాల నేతలతో బ్రదర్ అనిల్ కుమార్ సమావేశం అయినట్లు సమాచారం. వైఎస్ జగన్ పాలనతో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు క్రైస్తవుల సంక్షేమం, మైనార్టీల సంక్షేమంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీసీ సంఘాల ప్రతినిధులతో బ్రదర్ అనిల్ భేటీ అయ్యారు. పార్టీ పెడుతున్నారా అనే ప్రశ్నకు లేదు అని ఇటీవల సమాధానం ఇచ్చారు బ్రదర్ అనిల్. అయినా రాజకీయ వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతూనే ఉంది.

Telangana Assembly: తెలంగాణ మండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎకగ్రీవం

తెలంగాణ శాస‌న‌మండ‌లి చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి రెండోసారి ప‌ద‌వీ బాధ్యత‌లు చేపట్టారు. మండ‌లి చైర్మన్‌గా సుఖేంద‌ర్ రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ ఎన్నిక‌కు ఒకే ఒక్క నామినేష‌న్ రావ‌డంతో గుత్తా ఏక‌గ్రీవంగా ఎన్నికైనట్లు మండ‌లి అధికారులు ప్రక‌టించారు. ఈ నేప‌థ్యంలో గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిని ఛైర్మన్ సీటు వ‌ద్దకు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్సీలు తీసుకెళ్లారు. చైర్మన్ సీటులో కూర్చున్న గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి మంత్రులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

West Godavari Road Accident: పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం - భార్య భర్తలు మృతి

Road Accident In West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొనడంతో భార్య భర్తలు మృతిచెందగా, మరొకరికి త్రివ గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని పోలీసులు రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. మృతులు బుట్టాయిగూడెంనికి చెందిన రాజనాల మురళీకృష్ణ ఊర్మిళగా పోలీసులు గుర్తించారు. 

Assembly Session Updates: స్పీకర్ పోడియం పైకెక్కి టీడీపీ నేతల ఆందోళన

ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. పైకి ఎక్కి, స్పీకర్ కుర్చీని చుట్టుముట్టి కాగితాలు చింపి స్పీకర్ పైన వేశారు. దీంతో సభలోకి మార్షల్స్ వచ్చి టీడీపీ సభ్యులను నిలువరించే ప్రయత్నం చేశారు. దీనిపై స్పీకర్ తమ్మినేని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభ్యత సంస్కారం లేదా అంటూ నిలదీశారు.

6 వేల స్కూలు మూసి 40 వేల బెల్టు షాపులు తెరిచారు: రోజా

మద్యం మాఫియాతో టీడీపీ కుమ్మక్కు అయింది. చంద్రబాబు బెల్టు షాపులు ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. కానీ, 6 వేల స్కూళ్లు మూసేసి 40 వేల బెల్టు షాపులు తెరిచారు. ఎనీ టైం మందు దొరికే తరహాలో పరిపాలించారు. బడి, గుడి అనే తేడా లేకుండా బెల్టు షాపులు పెట్టించారు. ఇంటింటికీ క్వార్టర్ అందించే పరిస్థితి తెచ్చారు’’ అని ఎమ్మెల్యే రోజా మాట్లాడారు.

AP Assembly Live: టీడీపీ నేతల్ని సస్పెండ్ చేయండి - మంత్రి కొడాలి నాని డిమాండ్

జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న వరుస మరణాల అంశంపై ఏపీ అసెంబ్లీలో రాజకీయ దుమారం రేగుతోంది. టీడీపీ నేతల డిమాండ్‌పై అధికార పార్టీ నాయకులు దీటుగా తిప్పికొడుతున్నారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. చంద్రబాబు జంగారెడ్డి గూడెం పర్యటన నాటకమని అన్నారు. ఎన్టీఆర్ మద్యపానం అమలు చేస్తే చంద్రబాబు దానికి తూట్లు పొడిచాడని అన్నారు. రాజకీయాల కోసం మద్యాన్ని పెంచి పోషించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చనిపోయిన వారి ప్రతి ఒక్కరి ఉసురు చంద్రబాబుకు తగులుతుందని అన్నారు. సభ సజావుగా జరగాలంటే టీడీపీ సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తి చంద్రబాబు అని ఎమ్మెల్యే జోగి రమేశ్ వ్యాఖ్యానించారు. 

జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై చర్చకు టీడీపీ పట్టు - శాసన మండలి వాయిదా

ఏపీ అసెంబ్లీలో పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై చర్చకు టీడీపీ నేతలు పట్టు పడుతున్నారు. విపక్ష సభ్యుల ఆందోళనతో శాసన మండలి వాయిదా పడింది. అంతకుముందే శాసనసభను స్పీకర్ తమ్మినేని సీతారాం వాయిదా వేశారు. జంగారెడ్డి గూడెంలో మరణాలపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. చర్చ జరపకుండా ప్రతిరోజు టీడీపీ సభకు అడ్డుపడుతోందంటూ వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.


పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకూ 18 మంది మృతి చెందారు. ఈ అంశంపై చర్చ జరగాలని టీడీపీ నేతలు కోరుతున్నా, అసెంబ్లీ స్పీకర్, చైర్మన్ అందుకు అంగీకరించకపోవడం విపక్ష నేతలు ఆందోళనకు దిగారు.

#RussiaUkraineCrisis: ఉక్రెయిన్ సంక్షోభం, భారత విద్యార్థులపై చర్చించేందుకు మనీష్ తివారీ నోటీసు

#RussiaUkraineCrisis రష్యా, ఉక్రెయిన్ సంక్షోభంపై, ఉక్రెయిన్ నుంచి దేశానికి తరలించబడిన భారత విద్యార్థుల దుస్థితి, వారి భవిష్యత్తు గురించి చర్చించేందుకుగానూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

Indian Students Dies in Canada: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతి

Indian Students Dies In Road Accident in Canada: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాన్‌, ట్రాలీని ఢీకొట్టిన ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఒంటారియో హైవేపై వీరంతా వ్యానులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. 


మృతులను జస్వీందర్‌ సింగ్‌, హర్‌ప్రీత్‌ సింగ్‌, కరణ్‌పాల్‌ సింగ్, మోహిత్‌ చౌహాన్‌, పవన్‌కుమార్‌ లుగా గుర్తించారు. ఈ ప్రమాదం వివరాలను కెనడాలోని భారత రాయబారి అజయ్‌ బిసారియా వెల్లడించారు. బాధితుల కుటుంబాలకు సాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.

AP Assembly: ఏపీ అసెంబ్లీ వాయిదా

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కాగా టీడీపీ సభ్యుల ఆందోళనలతో శాసనసభ మొదలైన కాసేపటికే వాయిదా పడింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై సభలో టీడీపీ ఆందోళనకు దిగింది. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని పట్టుబట్టారు. సీఎం రాజీనామా చేయాలంటూ పోడియం వద్ద తెలుగు దేశం ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కాగా టీడీపీ వైఖరిని వైసీపీ తప్పుపడుతోంది. చర్చ జరపకుండా ప్రతిరోజు టీడీపీ సభకు అడ్డుపడుతోందంటూ మంత్రి బుగ్గన విమర్శలు గుప్పించారు. టీడీపీ సభ్యుల ఆందోళనతో సభ వాయిదా పడింది.

Background

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరగనుంది. పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదు కానున్నాయి. ఓ వైపు మధ్యాహ్నం పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నా, రాత్రి వేళల్లో చలి గాలుల ప్రభావం అధికంగా ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్నాయి. గత ఐతేళ్లతో పోలిస్తే ఈ సారి వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.


ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. మార్చి 15 న ఉత్తర భారతదేశం నుంచి వీచనున్న పొడిగాలుల వల్ల ఎండల తీవ్రత మరింత అధికం అవుతుంది. కొన్ని చోట్ల 43 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వనుంది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. విశాఖ​, విజయవాడ​, రాజమండ్రి, గుంటూరు, కర్నూలులో వేడి ఎక్కువగా ఉంటుంది. విశాఖలో అయితే ఇక ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు. బాపట్లలో 34 డిగ్రీలు, కాకినాడలో 34.7 డిగ్రీలు, కళింగపట్నంలో 32.8 డిగ్రీలు, నందిగామలో 38.4 డిగ్రీలు, నెల్లూరులో 34 డిగ్రీలు, తునిలో 36.8 డిగ్రీలు, విశాఖపట్నంలో 34 డిగ్రీలు, అమరావతిలో 36.5 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పగటి పూట వేడి అధికం అవుతుంటే, రాత్రిపూట చలి గాలులు వీస్తున్నాయి. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ​, విజయనగరం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతను తాకనుంది.  రాత్రులు కాస్తంత చల్లగా ఉన్నా మధ్యాహ్నాలు మాత్రం ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది. రానున్న పది రోజుల దాక ఇదే పరిస్ధితి. జాగ్రతలు తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. రోజుకు కనీసం 5 లీటర్ల వరకు మంచి నీళ్లు తాగాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్తే గొడుగు తీసుకెళ్లాలని, కొబ్బరి బొండాలు, పళ్ల రసాలు తాగడం ద్వారా డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారని పేర్కొన్నారు. 


తెలంగాణ వెదర్ అప్‌డేట్
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతాలైన సూర్యాపేట​, మహబూబాబాద్, నల్గొండ​, భద్రాద్రి, ములుగు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల​, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డీగ్రీలను తాకే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల 40 డిగ్రీలు సైతం దాటుతుంది. మరోవైపు హైదరాబద్ లో వేడిగా 38-39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి. కానీ వరంగల్, నల్గొండ​, నిజామాబాద్, రామగుండం వైపు ఎండల తీవ్రత కారణంగా ఉక్కపోత పెరుగుతుంది.


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) కాస్త పెరిగింది. గ్రాముకు నేడు రూ.1 పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరుగుతున్న సంగతి తెలిసిందే. వెండి ధర మాత్రం నేడు స్థిరంగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.48,410 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,800 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.74,700 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,410 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,810గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.74,700 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర అంతే పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.48,410 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,810గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.74,700 గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.