Breaking News Live: Car Accident: హుజూరాబాద్ లో కారు ప్రమాదం, ఇద్దరు మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 08 Mar 2022 06:11 PM
Car Accident: హుజూరాబాద్ లో కారు ప్రమాదం, ఇద్దరు మృతి

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగపూర్  గ్రామ శివారులో జాతీయ రహదారి పై కారు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, నలుగురికి పరిస్థితి విషమంగా ఉంది. 

CM KCR: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, రేపు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన 

నిరుద్యోగులంతా సిద్ధంగా ఉండాలని, రేపు ఉదయం గం.10లకు అసెంబ్లీలో కీలక ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలు, నిరుద్యోగులు రేపు టీవీలు చూడాలని సీఎం కేసీఆర్ అన్నారు. వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. 

కొద్దిసేపట్లో మన ఊరు - మన బడి ప్రారంభించనున్న కేసీఆర్

అనంతరం మన ఊరు - మన బడి కార్యక్రమం ప్రారంభించేందుకు బయలు దేరిన సీఎం కేసిఆర్‌కు దారి పొడవునా ఘన స్వాగతం లభించింది. వనపర్తి ప్రజలు అభిమానులు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. జై కేసీఆర్ జై తెలంగాణ నినాదాలతో ప్రజలు తమ హర్షాతిరేకాలు ప్రకటించారు. మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని కొద్దిసేపట్లో ప్రారంభించనున్నారు.

Wanaparthy: వనపర్తిలో వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రారంభించిన కేసీఆర్

ముఖ్యమంత్రి వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ. లక్ష్మారెడ్డిని ఆయన కార్యాలయంలోని కుర్చిలో కూర్చోబెట్టి ఆశీర్వదించారు. కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ముఖ్యమంత్రి స్థానిక ప్రజాప్రతినిధులను ఆప్యాయంగా వారి భుజాలు తట్టి పలకరించారు.

Wanaparthy: వనపర్తికి బయలుదేరి వెళ్లిన కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి పర్యటనకు బయలు దేరి వెళ్లారు. ప్రగతి భవన్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరారు. జిల్లాలో పలు అభి‌వృద్ధి కార్యక్రమాల ప్రారం‌భో‌త్సవాలు చేయ‌ను‌న్నారు. ఇందు‌కోసం భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వన‌పర్తి వ్యవ‌సాయ మార్కె‌ట్‌ ‌యార్డు ఆవ‌ర‌ణలో ఏర్పాటు చేసిన హెలి‌పా‌డ్‌కు చేరు‌కుంటారు. అక్కడే అగ్రి‌క‌ల్చర్‌ మార్కెట్‌ యార్డును ప్రారం‌భి‌స్తారు. అక్కడి నుంచి రోడ్డు‌మా‌ర్గంలో వనపర్తిలోని జడ్పీ ఉన్నత బా‌లుర పాఠ‌శా‌లకు వెళ్తారు. ‘మ‌న‌ఊరు – మన‌బడి, మన‌బస్తీ – మన‌బడి’ కార్యక్రమాన్ని మ‌ధ్యాహ్నం 12:15 గంట‌ల‌కు రాష్ట్రవ్యా‌ప్తంగా ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. అనంత‌రం విద్యా‌ర్థు‌ల‌ను ఉ‌ద్దే‌శించి ప్రసం‌గి‌స్తారు.

కొత్తపేట గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ కూల్చివేత

హైదరాబాద్‌లో పండ్ల మార్కెట్‌గా పేరొందిన కొత్తపేట గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను కూల్చివేశారు. ఏప్రిల్ 6 వరకు ఫ్రూట్ మార్కెట్ కొనసాగాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఫ్రూట్ మార్కెట్‌ను అధికారులు కూల్చివేశారు. దీంతో ఆ పండ్ల మార్కెట్‌పై ఆధారపడ్డ వేలాది మంది వ్యాపారులు, కూలీలు రోడ్డున పడ్డారు. ఆ ప్రదేశంలో పోలీసులను మోహరించారు.

మేకపాటి అజాత శత్రువు: రోజా

సంతాప తీర్మానంపై నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. మేకపాటి గౌతమ్ రెడ్డి అజాత శత్రువు అని గుర్తు చేసుకున్నారు. వివాదాలు లేని వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారని అన్నారు. ప్రజల మెప్పు మాత్రమే కాకుండా.. తోటి రాజకీయ నేతలు, విపక్ష నేతల మెప్పుకూడా పొందిన వ్యక్తి అని అన్నారు. సీఎం జగన్‌కు గౌతమ్‌ రెడ్డి నిజమైన సైనికుడని అభివర్ణించారు.

ఇలా మాట్లాడాల్సి వస్తుందనుకోలేదు: మంత్రి అనిల్ యాదవ్

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వివాదాలు లేని వ్యక్తి అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఇలా గౌతమ్‌ రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన చెందారు. తాను తొలిసారి పోటీ చేసిన నాటి నుంచి 2010 నుంచి ఇద్దరం సన్నిహితగా మెలిగామంటూ వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మంత్రి అనిల్‌ ప్రార్థించారు.

AP Assembly: రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు - మంత్రి మేకపాటి మరణానికి సంతాప తీర్మానం

ఏపీ అసెంబ్లీ రెండోరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం అయింది. సభ ప్రారంభం కాగానే ఇటీవల ఆకస్మాత్తుగా మరణించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంతాప తీర్మానంపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు. చర్చ అనంతరం సభ ఎల్లుండికి వాయిదా పడుతుంది.

Background

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి తీరాన్ని దాటింది. అల్పపీడనం మరింత బలహీనపడి తమిళనాడు సరిహద్దులో వాయుగుండం తీరం దాటడంతో రాయలసీమ, తమిళనాడులో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురవనున్నాయి. చాలా ఏళ్ల తరువాత మార్చి నెలలో ఏర్పడిన అల్పపీడనం కనుక, ఇది అంతగా ప్రభావం చూపలేదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.  విశాఖ నగరంతో పాటుగా కోస్తా భాగాల్లో ఉక్కపోత మరింత ఎక్కువగా ఉండనుంది.


ఆంధ్రప్రదేశ్, యానాంలలో బలమైన గాలులు వీస్తున్నాయి మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు అనువైన సమయం కాదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గాలుల ప్రభావం తగ్గితేనే మత్స్యకారులు వేటకు వెళ్లాలని సూచించారు. ఏపీ, యానాంలలో ఈశాన్య దిశ నుంచి వేగంగా గాలులు వీస్తాయి. తీరం వెంట ప్రస్తుతం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. బాపట్లలో 32.4 డిగ్రీలు, కాకినాడలో 33.9 డిగ్రీలు, కలింగపట్నంలో 34.6 డిగ్రీలు, నందిగామలో 36 డిగ్రీలు, తునిలో 36.4 డిగ్రీలు, గన్నవరంలో 34.8 డిగ్రీలు, విశాఖపట్నంలో 35 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
నేడు చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతాల్లో, అనంతపురం జిల్లాలోని దక్షిణ​, పశ్చిమ ఏరియాలు మదనపల్లి, కదిరి, ధర్మవరంలలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ రిపోర్ట్ చేశారు. రేపటి నుంచి వాతావరణం మళ్లీ పొడిగా మారనుంది. తమిళనాడులోని చెన్నై, పుదుచ్చేరి మధ్యలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. అనంతపురంలో చలిగాలులు వీస్తున్నాయి. అనంతపురంలో కనిష్ట ఉష్ణోగ్రత 17.9 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 19 డిగ్రీలు, నంద్యాలలో 19.2 డిగ్రీలుగా నమోదైంది.


తెలంగాణ వెదర్ అప్‌డేట్..
వాయుగుండం తీరాన్ని దాటినా దాని ప్రభావం ఏపీలోనూ ఉంటుంది. ఉదయం వేళ చల్లని గాలులతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలు ఉండగా, పగటిపూట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల మేర నమోదుకానున్నాయి. వాతావరణం పొడిగా ఉంటుందని, ఏ మార్పులు ఉండవని వాతావరణ కేంద్రం పేర్కొంది. 


బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) బంగారం ధరలు నేడు మరింత దారుణంగా పెరిగాయి. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరుగుతున్న సంగతి తెలిసిందే. వెండి ధర కూడా నేడు కిలోకు ఏకంగా రూ.2,300 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.49,400 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.53,890 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.75,700 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,700గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.75,700 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర అంతే పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.49,400 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.53,890గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.75,700 గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.