Andhra Political News :  ఎన్నికలకు ముందు ఏపీ ప్రభుత్వానికి బిల్లుల కోసం పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది. తాజాగా ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ కూడా తమకు ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తక్షణం చెల్లించాలని కోరుతూ ప్రభుత్వానికి అల్టిమేటం  జారీ చేశారు. తాము చికిత్సలు అందించలేక అప్పుల పాలయ్యామని .. శనివారం నుంచి చికిత్సలు నిలిపివేస్తామని లేఖలో పేర్కొన్నారు.                               


గత ఆరు నెలల కాలంలో ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు రెండు, మూడు సార్లు ఇలాంటి హెచ్చరికలు జారీ చేశాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ప్రభుత్వానికి ఈ విషయంపై విజ్ఞప్తి చేశామని ఇంకా రూ. వెయ్యి కోట్ల బకాయిలు ఉన్నాయని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి.  పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయకపోతే ఆస్పత్రుల నిర్వహణ సమస్యగా మారుతుందన్నారు.                          


బిల్లులతో పాటు చికిత్సలకు ఇస్తున్న ప్యాకేజీల ధరలు కూడా పెంచాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు.  పదేళ్ల క్రితం ప్యాకేజీలతోనే ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నామని, శస్త్ర చికిత్సల ఛార్జీలు పెంచాలని ఆస్పత్రుల యాజమాన్యాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. గత చర్చల్లో పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం హామీలిచ్చినా.. బిల్లులు విడుదల చేయలేదని నెట్ వర్క్ ఆసుపత్రులు ఆరోపిస్తున్నాయి. బిల్లుల విడుదల, ఇతర డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆసుపత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇలా హెచ్చరికలు జారీ చేసినప్పుడల్లా చర్చల్లో పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని, కొన్ని ప్యాకేజీల ఛార్జీలు పెంచుతామని ప్రభుత్వం ఆసుపత్రులకు హామీ ఇస్తూ వస్తోంది. కానీ అమలు కావడం లేదు.                                                      


ఎన్నికలు జగ్గర పడ్డాయి. పదమడో తేదీన పోలింగ్ జరగనుంది. ప్రభుత్వం మారితే బిల్లులు పెండింగ్ లో పెడతారని.. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు ఆందోళనతో ఉన్నాయి. పాత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకండా విచారణలు చేయించే సంప్రదాయాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రారంభించడంతో .. వచ్చే ప్రభుత్వం కూడా అదే చేస్తే తాము ఇబ్బందులు పడతామని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు భావిుస్తన్నాయి. అందకే ఇప్పుడే బిల్లులు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఆర్థిక సమస్యల్లో ఉంది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ రూ. పది వేల కోట్లను ఆర్బీఐ దగ్గర అప్పులు తీసుకుని వచ్చారు. వీటితో ఉద్యోగులకు కొన్ని బకాయిలతో పాటు ఒకటో తేదీనే జీతాలు చెల్లించారు. ఇక పెండింగ్ ఉన్న బిల్లులు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వంపై బిల్లులు రావాల్సిన వారంతా ఒత్తిడి పెంచుతున్నారు.