Breaking News Live: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 12న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 12 Oct 2021 09:22 PM
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కి కరోనా సోకింది. గత రెండు మూడు రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్న మంత్రి గంగుల ఇబ్బంది పడుతున్నారు. నేడు జరిగిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా ఆయనను నేరుగా కలిసిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

ఈటల రాజేందర్ పై ఎన్నికల కమిషన్ కు టీఆర్ఎస్ ఫిర్యాదు

 


టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అసత్య ఆరోపణలు చేశారని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ పార్టీ, పార్టీ హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై బీజేపీ అభ్యర్థి దుష్ప్రచారం చేస్తూ లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నేత జగన్ పై బీజేపీ నేతల దాడి చేశారని మరోవైపు ఫిర్యాదు హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించి సభ నిర్వహించడంతో పాటు టీఆర్ఎస్ డబ్బులు ఇస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తీసుకోమని  బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్  ఓటర్లును తప్పుదోవ పట్టించడం, టీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎన్నికల కమిషన్ కు తెలిపారు. 

ప్రకాష్ రాజ్ ఫ్యానల్ 11 మంది సభ్యులు రాజీనామాా

 ప్రకాష్ రాజ్ ఫ్యానల్ 11 మంది సభ్యులు రాజీనామాా చేశారు. మా ఎన్నికల్లో రౌడీయిజం చేశారని నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. రెండేళ్లు మంచు విష్ణు బాగా పనిచేయాలని కోరారు. ముందు రోజు గెలిచిన వాళ్లు తరవాతి రోజు ఓడిపోయారని తెలిపారు. రాజీనామా ఎమోషనల్ నిర్ణయం కాదని ఆయన అన్నారు. మా బై లాస్ మార్చనని మంచు విష్ణు హామీ ఇస్తే తన రాజీనామా వెనక్కి తీసుకుంటానని ప్రకాష్ రాజ్ చెప్పారు.  

బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న సీఎం జగన్ కు రాష్ట్ర మంత్రులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారు సరస్వతీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.  

మమతా బెనర్జీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం..

పశ్చిమ బెంగాల్ సచివాలయంలోని 14 వ అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యాలయంలో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది.  మధ్యాహ్నం సమయంలో 14 వ అంతస్తు నుంచి పొగలు రావడాన్ని గమనించారు సిబ్బంది. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.. మంటలను అదుపు చేశాయి.  ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి గల కారణలపై దర్యాప్తు చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పీఆర్వో, నిర్మాత మహేశ్ కోనేరు మృతి

జూనియర్ ఎన్టీఆర్ పీఆర్ఓ, నిర్మాత మహేష్ కోనేరు ఈ ఉదయం విశాఖపట్నంలో చనిపోయారు. గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఈయన మరణంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తనకు ప్రాణ స్నేహితుడైన మహేష్ కోనేరు మరణం తీవ్రంగా కలచివేసిందని ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 118, తిమ్మరుసు, మిస్‌ ఇండియా చిత్రాలకు ఆయన నిర్మాతగా ఉన్నారు.





కేఆర్ఎంబీ సమావేశం ప్రారంభం

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సమావేశం ప్రారంభం అయింది. కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్ నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో భేటీ అయ్యారు. సమావేశంలో బోర్డు సభ్యులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 14వ తేదీ నుంచి అమలు కావాల్సి ఉంది. దీంతో గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయంలో బోర్డు సమావేశంలో చర్చిస్తున్నారు. హాజరైన తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు.


‘‘కొత్త ట్రైబ్యునల్‌ వచ్చే వరకు మరో 105 టీఎంసీలు ఇవ్వాలి. బోర్డు పరిధిలో విద్యుత్‌ ప్రాజెక్టులూ ఉండాలని కోరుతున్నారు. తెలంగాణలో అనేక ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. నీటి వాటాతో పాటు విద్యుదుత్పత్తి కూడా మాకు ముఖ్యం. ఎత్తిపోతల పథకాలు, బోరు బావులకు విద్యుత్ ఉత్పత్తి చేయాలి. కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోరుతున్నాం. ప్రాజెక్టుల నిర్వహణ ఎలా చేస్తారని అడుగుతున్నాం. ఇవాళ్టి సమావేశం తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. బోర్డు పరిధిలోకి ఏ ప్రాజెక్టులు ఇవ్వాలనేది చర్చిస్తాం’’ అని రజత్‌కుమార్‌ విలేకరులతో అన్నారు.

ఏవోబీలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు

ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందినట్టు తెలుస్తోంది. పోలీసుకు గాయాలు అయ్యాయి. మల్కన్‌గిరి జిల్లా తులసీపహాడ్‌ అటవీప్రాంతంలో ఈ ఘటన నెలకొంది.

జనగామ: బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

జనగామ జిల్లా చిల్పూర్ మండలం, కొండాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు 10 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. బస్సు హుస్నాబాద్ నుంచి జగద్గిరిగుట్ట వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.

ఇంద్రకీలాద్రి వద్ద అధికారుల అత్యత్సాహం.. కాలి నడకనే వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించిన ఎంపీ కేశినేని

ఇంద్రకీలాద్రి వద్ద అధికారుల అత్యుత్సాహం చూపించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని వాహనాన్ని ఘాట్ రోడ్డు ప్రారంభంలో  నిలిపివేశారు. స్థానిక ఎంపీగా ప్రోటోకాల్ పాటించక పోవడంపై కేశినేని అసహనం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలసి కాలి నడకనే ఇంద్రకీలాద్రి పైకి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించారు ఎంపీ. వీఐపీ పాస్ లతో ఇతర వాహనాలను అనుమతిస్తూ ఎంపీ వాహనాన్ని అడ్డుకోవడంపై ఎంపీ సహాయకులు ఆగ్రహించారు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Background


అనంతపురం జిల్లా  కదిరి నియోజకవర్గం ఆమడగూరు మండలం మొలకవారిపల్లి ఎగువ తాండలో విషాదం చోటుచేసుకుంది. నిన్న చెరువులో గల్లంతైన ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. చిన్నారుల మృతదేహాలను కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాల వెలికితీతకు వర్షంలో రాత్రంతా పోలీసులు, గ్రామస్థులు శ్రమించారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.