Chittoor Tahasildar :   ఏపి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇలాకాలో మరో అవినితి తాహశీల్దార్ బాగోతం వెలుగు చూసింది. మొన్న పెనుమూరు తాహసిల్దార్ రమణీ వ్యవహారం, నేడు ఎస్.ఆర్.పురం తాహసిల్దార్ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూసున్నాయి..   గతంలో అనేక మార్లు‌ లంచాలు తీసుకుంటూ పట్టుబడినా   తీరు మాత్రం‌ మార్చుకోవడం లేదు.. ఎస్.ఆర్.పురం తాహసిల్దార్ షబ్బీర్ భాష వేధింపులు తట్టుకోలేక అధికార పార్టికి చేందిన ఓ సర్పంచ్ ఏకంగా జిల్లా కలెక్టర్ హరినారాయణకు ఫిర్యాదు చేసాడు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎస్.ఆర్.పురం తాహసిల్దార్ కార్యాలయంకు చేరుకుని విచారణ జరిపి జిల్లా కలెక్టర్ హరినారాయణకు నివేదిక పంపారు.. 


చిత్తూరు జిల్లాలో ఎమ్మార్వోల లంచాలపై ఫిర్యాదులు


చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రెవెన్యూ అధికారుల అవినితి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉమ్మడి జిల్లా ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.. తహసీల్దారు కార్యాలయంకు వచ్చే ప్రజల నుండి నగదు ముట్టనిదే పని చేయని తాహసిల్దార్ నగదు ఇవ్వక పోతే కార్యాలయంకు వచ్చిన వారిపై దుర్భాషలాడుతూ రెచ్చి పోయే వారు.. అది ప్రజలైనా, అధికార‌ పార్టి నాయకుడైనా ఎవరైనా సరే..తనకు నగదు మూట చేతిలో పెట్టాల్సిందే ఇదే ఆ తహసీల్దారు పాలసీ.. ఎస్.ఆర్.పురం మండల‌ కేంద్రంలో తాహసిల్దార్ గా భధ్యతలు చేపట్టారు.  తన కార్యాలయంలో ఇద్దరూ విఆర్వోలను ప్రక్కన పెట్టుకుని పనికి తగ్గట్టుగా లంచం వసూలు చేసేవారు.  అంతే కాకుండా ప్రభుత్వ భూములను గుర్తించి నగదు ఇచ్చిన వారికి ఆ భూములను అప్పనంగా కట్ట బెట్టేవాడు. రెవెన్యూ చట్టాలను తనకు అనుకూలంగా మార్చకుని అక్రమాలకు పాల్పడేవాడు.. ఇదేంటని ప్రశ్నించిన వారిపై అసహ్యకరంగా దూషించేవాడు షబ్బీర్ భాషా.


ఎస్‌ఆర్ పురం సర్పంచ్‌పై విచారణ జరిపిన కలెక్టర్ 


రోజు రోజుకి మితి మీరుతున్న తాహసిల్దార్ షబ్బీర్ భాషా ఆగడాలకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని భావించిన స్ధానిక అధికార పార్టీ సర్పంచ్ ఢిల్లియ్య, ఈ నెల తొమ్మిదోవ తారీఖున జిల్లా కలెక్టర్ హరినారాయణను కలిసి తమ సమస్య వెల్లడించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.   దీనిపై సిరియస్ అయ్యిన కలెక్టర్ హరినారాయణ విచారణ చేపట్టాలని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లును ఆదేశించారు . కలెక్టర్ ఆదేశాలతో ఎస్.ఆర్.పురం తాహసిల్దార్ కార్యాలయంకు చేరుకున్న జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కార్యాలయంలోని రికార్డులను‌ పరిశీలించి విచారణ చేపట్టగా, తాహసిల్దార్ షబ్బీర్ భాషాతో పాటుగా ,మరో ఇద్దరూ విఆర్వోలు అక్రమాలు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది..‌దీంతో షబ్బీర్ భాషాపై ఓ నివేదికను తయారు చేసి జిల్లా కలెక్టర్ హరినారాయణకు నివేదిక‌ పంపారు. ఈ నివేదిక పరిశీలించిన తరువాత జిల్లా కలెక్టర్ తాహసిల్దార్ షబ్బీర్ భాషాపై శాఖా పరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. గతంలోనూ షబ్బీర్ భాషాపై అనేక అవినీతి ఆరోపణను వినిపిస్తూ ఉండడంతో దానిపై కూడా జిల్లా కలెక్టర్ విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.. 


అవినీతికి పాల్పడిన ఎవరినీ వదిలి పెట్టవద్దన్న మంత్రి 



 తను ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఇలాంటి అవినీతి అధికారులు ఉన్నారంటే నాకే సిగ్గేస్తుందని డెప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు.. మొన్న ఎస్ఆర్ పురం తాసిల్దార్, నిన్న పెనుమూరు తాసిల్దార్ బాగోతం బయటపడిందని, అవినీతి అనేది క్యాన్సర్ లాంటిది అంటుకుంటే వదలదన్నారు.. ఇలా అధికారులు అవినీతికి పాల్పడుతారని జగనన్న పేదల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేస్తున్నారని, నేను ,మంచి తాహసిల్దార్ అన్న వారే ఇలా అవినీతికి పాల్పడటం సిగ్గుగా ఉందన్నారు.. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకుల చేత ప్రతి పనికి లంచం అడగటం పనికి మాలిన తనమని, అవినీతి అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడం మంచిదేనన్నారు. అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ గారికి గట్టిగా చెప్పడం జరిగిందని డెప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.