Visakhapatnam IGZP Elephant Tiger Adoption: విశాఖపట్నంలోని ప్రసిద్ధ ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల  వన్యప్రాణి సంరక్షణ విభాగం ఒక విశిష్టమైన వేడుకకు వేదికైంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ-అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి  అన్నా కొణిదెల పర్యావరణ పరిరక్షణ వైపు గొప్ప అడుగు వేశారు. జూపార్క్‌లోని జంతువుల దత్తత కార్యక్రమంలో భాగంగా ఒక ఆసియాటిక్ ఏనుగును, ఒక రాయల్ బెంగాల్ పులిని ఒక సంవత్సరం కాలానికి దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Continues below advertisement

తమ జన్మదినం ఆగస్టు 1, 2026  పురస్కరించుకుని అన్నా కొణిదెల ఈ ఆదర్శవంతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. భారతదేశ జాతీయ వారసత్వ జంతువైన ఆసియా ఏనుగు సంరక్షణ, సంపూర్ణ పోషణ, వైద్యావసరాల కోసం రూ. 4.30 లక్షలను విరాళంగా అందించారు. విజ్ఞానానికి, బలానికి నిదర్శనమైన ఏనుగుల సంరక్షణకు పర్యటన వ్యాప్తంగా మరింత మద్దతు లభించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వర్సిటీ వర్గాలు తెలిపాయి.

దీనితో పాటు, భారతదేశ జాతీయ జంతువైన రాయల్ బెంగాల్ పులి దత్తత కోసం శ్రీమతి అన్నాకొణిదెల మరొక రూ. 2.00 లక్షల విరాళాన్ని సమర్పించారు. దేశపు అపూర్వ జీవవైవిధ్యానికి, ధైర్యానికి ప్రతీకగా నిలిచే పులుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సందేశాన్ని ఈ చర్య ద్వారా చాటిచెప్పారు. మొత్తంగా ఈ రెండు ప్రాణుల ఒక ఏడాది సంరక్షణ బాధ్యతల కోసం రూ. 6,30,000 ఆరు లక్షల ముప్పై వేల రూపాయలను నిధిగా అందజేశారు.

Continues below advertisement

అన్నా కొణిదెల ఉదారతపై ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల క్యూరేటర్  మంగమ్మ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వ్యక్తిగత మైలురాళ్లను లేదా పుట్టినరోజుల వంటి ప్రత్యేక సందర్భాలను ఇలా వన్యప్రాణుల సంరక్షణ కోసం కేటాయించడం సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జూ యాజమాన్యం తరఫున ఆమెకు అధికారిక అనిమల్ అడాప్షన్ సర్టిఫికేట్,  జ్ఞాపిక  ను అందజేయనున్నట్లు తెలిపారు.

ప్రజలు, విద్యాసంస్థలు , కార్పొరేట్ సంస్థలు ఐజీజీపీ అమలుచేస్తున్న ఈ దత్తత కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80G(5) కింద మినహాయింపులు కూడా పొందవచ్చని అధికారులు వెల్లడించారు. విశాఖ జూలో డిప్యూటీ సీఎం కుటుంబం చూపిన ఈ ప్రేమ , సంరక్షణ దృక్పథం నెటిజన్లతో పాటు పర్యావరణ ప్రేమికుల నుంచి  ప్రశంసలు అందుకుంటోంది.