Anna Canteen Dharanikota: కూలీలు, కార్మికులు , పేదలెవరూ ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్ల సేవలను మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో విజయవంతంగా నడుస్తున్న ఈ పథకాన్ని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ చేరవేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 62 గ్రామీణ అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ రెండో విడత క్యాంటీన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 15వ తేదీన పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గంలోని ధరణికోటలో అధికారికంగా ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 207 అన్న క్యాంటీన్లు ఉండగా, కొత్తగా ప్రారంభించే వాటితో కలిపి ఈ సంఖ్య 269కి చేరనుంది. గత ప్రభుత్వం నిలిపివేసిన ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునరుద్ధరించింది. కేవలం రూ. 5లకే నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించడం ద్వారా పేదలకు పెద్ద ఊరటనిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 8.80 కోట్ల మంది పేదలు ఈ క్యాంటీన్ల ద్వారా భోజనం చేశారు. ప్రతిరోజూ సుమారు 2.10 లక్షల మంది ఈ సేవలను వినియోగించుకుంటుండగా, దీని కోసం ప్రభుత్వం భారీగా సబ్సిడీని వెచ్చిస్తోంది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ఉన్న 207 క్యాంటీన్ల సబ్సిడీ కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 243 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్న 62 గ్రామీణ క్యాంటీన్ల సబ్సిడీ కోసం ఏటా అదనంగా మరో రూ. 58 కోట్లు వెచ్చించనుంది. ఒక్కో క్యాంటీన్‌లో సగటున రోజుకు 1,000 మందికి పైగా భోజనం చేస్తున్నారని, సామాన్యుడిపై భారం పడకుండా ప్రభుత్వం ఈ వ్యయాన్ని భరిస్తోందని అధికారులు వెల్లడించారు. అందరికీ ఆహార భద్రత అనే నినాదంతో గ్రామీణ పేదలకు కూడా చేరువవ్వడమే ఈ విస్తరణ ప్రధాన ఉద్దేశం.
బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ఆయన ధరణికోట చేరుకుంటారు. 1.30 గంటలకు కొత్త అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం, అక్కడ లబ్ధిదారులతో కలిసి భోజనం చేయనున్నారు. పట్టణాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే గ్రామీణులు, స్థానిక కూలీలకు ఈ కొత్త క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ పర్యటన కోసం పల్నాడు జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
