Breaking News: రాహుల్ గాంధీని ప్రత్యేకంగా కలిసిన తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 8న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
ఇటీవల నియమితులైన తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ కమిటీ నేతలు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీని ప్రత్యేకంగా కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్, నూతనంగా నియమితులైన ఇతర పీసీసీ కమిటీ నాయకులు రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు.
అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు ఢీకొన్నాయి. జోర్హాత్‌లో నిమతి ఘాట్ వద్ద ప్రయాణికులు ఉన్న పడవలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో ఈ రెండు పడవల్లో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అసోం రాజధాని గౌహతికి 350 కిలో మీటర్ల దూరంలో ఈ విషాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో అనేకమంది గల్లంతైనట్టు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
డ్రగ్స్ కేసులో హీరో రానా ఈడీ విచారణ ముగిసింది. బుధవారం ఉదయం మొదలైన విచారణ సాయంత్రం వరకూ మొత్తం 7 గంటల పాటు సాగింది. హీరో రానాతో పాటు కెల్విన్‌కు కూడా కలిపి ఈడీ అధికారులు విచారణ జరిపారు. 2016 నవంబర్‌లో జరిగిన ఎఫ్ క్లబ్‌లో పార్టీపై ఈడీ అధికారులు విచారణ జరిపారు. రానా బ్యాంకు అకౌంట్‌కు సంబంధించి అధికారులు పరిశీలించారు. 2015-18 మధ్యలో రానా బ్యాంకు స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు పరిశీలించారు.
వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కుల లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని కోర్టు సూచించింది. బహిరంగ ప్రభుత్వ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకొని, ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో రానా విచారణ కొనసాగుతోంది. 3 గంటలుగా రానాను ఈడీ అధికారులు ముగ్గురు అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆడిటర్ సతీష్‌తోపాటు అడ్వకేట్‌తో రానా బుధవారం ఉదయం విచారణకు హాజరయ్యారు. 2015-17లకు సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను రానా అధికారులకు ఇచ్చారు. ఈడీ అధికారులు రానా బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తున్నారు. దుబాయ్‌లో జరిగిన ఈవెంట్స్‌లో రానా, కెల్విన్ నగదు లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై వివరణ వేసేందుకు సమయం కావాలని ధర్మాసనాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది బాలాజీ కోరారు. ఈ కేసు విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
కృష్ణా జిల్లాలో కన్న కూతూరుపై తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలో చిన్నారి చికిత్స పొందుతోంది. అత్యాచారానికి పాల్పడిన.. భర్తపై భార్య దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీపై తెలంగాణ గవర్నర్ తమిళి సై స్పందించారు. ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి నియామకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. సామాజిక సేవ విభాగంలో పంపినందున పరిశీలిస్తున్నామని తెలిపారు. తెలంగాణ మంత్రి మండలి చేసిన సిఫారసుపై అధ్యయనం చేస్తున్నామన్నారు. కౌశిక్ రెడ్డి నియామకంపై ఇంకాస్త సమయం పడుతుందని గవర్నర్ స్పష్టం చేశారు.
కర్నూలు జిల్లా డోన్ పోలీస్ స్టేషన్ లో సీఐ, లాయర్ కొట్టుకున్నారు. డో ఓ వివాదానికి సంబంధించి ఇద్దరు లాయర్లు డోన్ పీఎస్‌కు వెళ్లారు.అయితే ఆ వివాదాన్ని సీఐకి వివరించే క్రమంలో సీఐకి, న్యాయవాదికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా గొడవకు దారి తీసింది. దీంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఆ తర్వాత పీఎస్ నుంచి బయటకు వచ్చిన లాయర్‌పై పోలీసులంతా కలిసి మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. దీనిపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్న సోనూసూద్ షెడ్యూల్ లో మార్పు జరిగింది. నేడు హైద్రాబాద్ లోనే సోనూసూద్ ఉండనున్నారు. రేపు ఉదయం 7:30 గంటలకు హైద్రాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నారు. 9 గంటలకు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకొనున్నారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి బాబాయ్ కుమారుడు దేవిరెడ్డి జయశీల్‌రెడ్డి (42) మృతదేహం లభ్యమైంది. నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో దొరికింది. వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన జయశీల్ రెడ్డి ఫోన్ స్విచ్ఛాప్ ఆఫ్ రావడంతో కుటుంబసభ్యులు వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు తెలిపారు. డాగ్‌స్క్వాడ్‌తో పరిశీలించగా శునకం గ్రామాల్లోకి వెళ్లి, తిరిగి వ్యవసాయ క్షేత్రంలో అటూఇటూ తిరిగి వ్యవసాయ బావి వద్ద ఆగింది. దీంతో వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి ఉంటారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఈడీ విచారణకు దగ్గుబాటి రానా హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్ లతో విచారణకు వచ్చారు. నవదీప్ తో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. సాయంత్రం విచారణ కొనసాగనుంది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నా నది పోటెత్తింది. దీంతో సోమశిల రిజర్వాయర్ నిండు కుండలా మారింది. రిజర్వాయర్ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరడంతో అధికారులు, నేతలు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. ప్రస్తుతం ఒక గేటు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు.
ఏపీలోని కొన్ని జిల్లాల్లో వివిధ ప్రధాన ఖనిజ నిల్వలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. బంగారం, వజ్రాలు లభించే ప్రాంతాలు ఉన్నట్లు తెలిసింది. ఇపుడు ఆయా బ్లాక్‌లను కేంద్ర గనులశాఖ రాష్ట్రానికి అప్పగించనుంది. దేశ వ్యాప్తంగా జీఎస్‌ఐ వివిధ ప్రాంతాల్లో ఖనిజ నిల్వలకు సంబంధించి సర్వే చేసింది. బొగ్గు, ఇనుము, బంగారం, వజ్రాలు వంటి ఖనిజాలకు సంబంధించి 100 బ్లాక్‌లను ఎంపిక చేసింది. ఇందులో మన రాష్ట్రానికి చెందిన బ్లాక్‌లు ఆరు నుంచి ఎనిమిది వరకు ఉన్నాయి.
ఇండోనేసియాలోని ఓ జైలులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 41 మంది ఖైదీలు మరణించారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. జకార్తా శివార్లలోని టాంగెరాంగ్ జైలులోని సీ బ్లాక్‌లో దుర్ఘటన జరిగింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
చిత్తూరు జిల్లా, ఐరాల ఎస్.ఐ. లోకేష్ ఐరాల ఎస్సై పై సస్పెన్షన్ వేటు పడింది. వినాయక చవితి ఉత్సవాల పై సూచనలు చేసినందుకే ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వినాయక విగ్రహాలను ఇళ్ళల్లో పెట్టుకోండని సూచనలు ఇచ్చిన ఎస్సే. తీర్థప్రసాదాలను పంపొద్దని చెప్పారు. ఇలా ప్రజలకు సూచన చేసిన ఎస్ఐ పై సస్పెన్షన్ వేటు పడింది. వినాయక చవితి ఆంక్షలపై ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సీరియస్ అయిన ప్రభుత్వం.. ఎస్ ఐ ని సస్పెండ్ చేయాలని ఆదేశించింది. దీంతో అనంతపురం రేంజ్ డీఐజీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అనంతపురం జిల్లాకు చెందిన లోకేష్ ఇటీవల ఎస్ఐ శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఐరాలలో తొలి పోస్టింగ్ ఇచ్చారు.
Background
రష్యాకు చెందిన కొవిడ్-19 వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వి’ తొలిడోసు సరఫరా ప్రారంభించినట్టు డా.రెడ్డీస్ లేబొరేటరీస్ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా తాము ఒప్పందం కుదుర్చుకున్న ఆసుపత్రులకు వీటిని పంపుతున్నట్టు తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ స్పుత్నిక్-వి టీకా లభ్యత గురించి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -