Andhra Pradesh In Union Budget 2024 :  కేంద్ర బడ్జెట్ ప్రకటన తర్వాత దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ ,  బీహార్ గురించి చర్చ జరుగుతోంది. ఈ రెండు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించారని అంటున్నారు. బీహార్ గురించి పక్కన పెడితే ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకమే. ఎన్నో  సమస్యల్లో ఉన్న రాష్ట్రానికి ఊపిరి పోసేలా నిధుల కేటాయింపు ఉంది. 


ఇరవై ఏళ్ల తర్వాత ప్రాధాన్యం


గత ఐరవై ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ అనే పదం కేంద్ర బడ్జెట్‌లో వినిపించేది కాదు. చివరికి రాష్ట్ర విభజన తర్వాత కూడా. ఎందుకిలా అంటే.. అది రాష్ట్రాల బడ్జెట్ కాదని.. కేంద్ర బడ్జెట్ అని.. వాదించేవారు. అయితే ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేకమైన కేటాయింపులు చేసేవారు. ఆ జాబితాలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా ఆంధ్రప్రదేశ్ పేరు మార్మోగిపోయింది. ఎప్పుడో వాజ్ పేయి హయాంలో చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పినప్పుడు ఏపీకి కేంద్ర నిధులు ఎక్కువగా వచ్చేవి. మళ్లీ ఇప్పుడే సాధ్మయ్యాయి.  కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ పదవుల్ని త్యాగం చేసి అయినా సరే మంచి ప్యాకేజీని రాష్ట్రం కోసం సాధించగలిగిందని అనుకోవచ్చు. 


అప్పో.. గ్రాంటో అమరావతికిభారీ నిధులు


దాదాపుగా ఊపిరి పోయిన అమరావతికి కేంద్రం నిధుల ఆక్సీజన్ ఇచ్చింది. అమరావతికి  మళ్లీ ఎదగడానికి కేంద్రం నిధులు ప్రకటించింది.  ఏకంగా పదిహేను వేల కోట్ల రూపాయలు సమకూరుస్తామని ప్రకటించిది. అయితే  కేంద్ర నగదు బదిలీ చేయదని.. అప్పు ఇస్తుందని కొంత మంది వాదిస్తున్నారు. అది గ్రాంట్ అయినా.. అప్పు అయినా.. నేరుగా అలోకేట్ చేసినా.. సరే అమరావతికి పదిహేను వేల కోట్ల అందబోతున్నాయి. ఏ రూపంలో ఇచ్చినా కేంద్రమే అత్యధికంగా తిరిగి చెల్లిస్తుంది. విభజన చట్టంలో భాగంగా సాయం చేస్తున్నామని నిర్మలా సీతారామన్ చాలా స్పష్టంగా చెప్పారు.  అమరావతికి ఎప్పుడో పునాదులు పడ్డాయి. కాబట్టి అక్కడ్నుంచి నిర్మించడమే మిగిలింది. నిధుల సమస్య ఉండదు. ఇక అమరావతి పరుగులు పెట్టనుంది. 


పోలవరం పూర్తికి సాయం 


పోలవరం  ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. నిధులన్నీ పూర్తిగా నాబార్జు ద్వారా రీఎంబర్స్ చేస్తారు. అయితే కొన్ని విషయాల్లో కేంద్రం సహకారం అవసరం. బడ్జెట్‌లో చెప్పిన దాని ప్రకారం పోలవరం వల్ల దేశానికి ఆహార భద్రత పోలవరం ప్రాజెక్టు వల్ల వస్తుంది. ఈ విషయంలో కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందించబోతోంది. ఐదేళ్లుగా నిర్మాణం ఆగిపోవడం వల్ల పోలవరం ప్రాజెక్టుకు అనేక సమస్యలు వచ్చాయి. వాటన్నింటినీ క్లియర్ చేసి.. వరద తగ్గగానే నిర్మాణాలు ప్రారంభించేందుకు చంద్రబాబు సర్కార్ ప్రణాళికలు సిద్దం చేసుకునే చాన్స్ ఉంది. 


ఇండస్ట్రియల్ కారిడార్లకు మంచి రోజులు


హైదరాబాద్ - బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. ఈ రెండు కారిడార్లలో పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కల్పిస్తే పారిశ్రామికంగా ఏపీ తిరుగులేని విధంగా ఎదిగే అవకాశం ఉంటుంది.  వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సాయం చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు.  విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించడం సహా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.   ఎలా చూసినా..  గత ఇరవై ఏళ్ల కాలంలో బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ అనే ప్రస్తావనే వినిపించేది కాదు.కానీ ఈ సారి మారుమోగిపోయింది. ఇది  ఏపీకి  మంచి రోజులు తెచ్చిందని అనుకోవచ్చు.