Andhra Pradesh to get world largest green ammonia project at Kakinada: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో సరికొత్త చరిత్ర లాంటి పెట్టుబడి రానుంది. కాకినాడ కేంద్రంగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు AM Green సంస్థ సిద్ధమైంది. సుమారు 10 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 84,000 కోట్లు భారీ పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేయనున్నారు. ఈ మెగా ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్తు కోసం 7.5 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని , 1 గిగావాట్ పంప్డ్ హైడ్రో స్టోరేజీని వినియోగించనుండటం విశేషం. ఇది భారతదేశం నుండి అంతర్జాతీయ మార్కెట్‌కు గ్రీన్ ఎనర్జీని ఎగుమతి చేసే తొలి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా నిలవనుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ వ్యాల్యూ చైన్‌లో కీలక భాగస్వామిగా మారుతోంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమ్మోనియాను జర్మనీ, సింగపూర్ , జపాన్ వంటి అగ్రదేశాలకు ఎగుమతి చేయనున్నారు. పర్యావరణ హితమైన ఇంధన తయారీలో అత్యాధునిక సాంకేతికతను వాడటం ద్వారా ఏపీ పారిశ్రామికంగా కొత్త పుంతలు తొక్కనుంది. కేవలం పెట్టుబడులకే పరిమితం కాకుండా, ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 8,000 మంది యువతకు ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇది కాకినాడ ప్రాంత ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తుందని భావిస్తున్నారు.
ఈ భారీ ప్రాజెక్టుపై మంత్రి నారా లోకేష్ అత్యంత ఆనందం వ్యక్తం చేశారు. కాకినాడలో ఈ మెగా ప్రాజెక్టు ఏర్పాటు కావడం ఏపీకి గర్వకారణం. ఇది రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో ఒక మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ మళ్లీ పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతోందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. గ్రీన్ హైడ్రోజన్ , గ్రీన్ అమ్మోనియా రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి హబ్‌గా మార్చడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందాలు పూర్తి కావడంతో, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ ఎగుమతి టెర్మినల్ ద్వారా కాకినాడ పోర్టు గ్లోబల్ గ్రీన్ గేట్‌వేగా మారుతుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు రాష్ట్రానికి భారీ ఆదాయం, యువతకు ఉపాధి కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని పెంచేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇలాంటి మెగా ప్రాజెక్టులు రాష్ట్రానికి రావడానికి దోహదపడుతున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.