సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే కోరికతో చాలా మంది భద్రతను గాలికొదిలేస్తున్నారు. కొన్ని సందర్భాలలో వారు చేసే పిచ్చి చేష్టలతో ఇతరుల ప్రాణాల మీదకు సైతం వస్తుంది. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. సరిగ్గా అలాంటి ఘటనే బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక విద్యార్థి తన కారులో మార్పులు చేసిన సైలెన్సర్‌ను ఉపయోగించి రోడ్లపై పెద్ద శబ్దంతో పాటు స్టంట్లు చేస్తూ కనిపించాడు. ఈ కారు ఎగ్జాస్ట్ నుండి పెద్ద శబ్దం మాత్రమే కాకుండా, మంటలు కూడా వచ్చాయి. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈ చర్యపై కఠిన చర్యలు తీసుకున్నారు. అతడికి రూ. 1.11 లక్షల భారీ జరిమానా విధించి, కారును స్వాధీనం చేసుకున్నారు.

Continues below advertisement

పోలీసులు తక్షణమే చర్యలు తీసుకున్నారు

బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన వీడియోలో కారు ఎగ్జాస్ట్ నుండి మంటలు వస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మోటారు వాహనాల చట్టం ప్రకారం స్పష్టంగా చట్టవిరుద్ధమైన మార్పు, నేరంగా పరిగణిస్తారు. వీడియోలో జరిమానా రసీదు చూపించారు. ఆ రసీదులో రూ. 1,11,500 మొత్తం నమోదు చేశారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. ఆ తర్వాత స్వాధీనం చేసుకున్న కారు దగ్గర నిల్చున్న పోలీసు అధికారిని చూపించారు. ఆయన ఈ జరిమానాను, కార్ సీజ్ చేయడాన్ని ధృవీకరించాడు.

విద్యార్థికి భారీ జరిమానా, కారు సీజ్

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ కారు కేరళకు చెందిన ఒక విద్యార్థికి చెందినది. అతను బెంగళూరులో చదువుతున్నాడు. యెలాహంక RTO ఈ విషయంలో రూ. 1.11 లక్షల జరిమానా విధించి ఆ వాహనాన్ని సీజ్ చేసింది. ప్రజల రోడ్లు స్టంట్లు లేదా ప్రదర్శనలకు స్థలం కాదని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు స్పష్టంగా చెప్పారు. ఈ రకమైన చట్టవిరుద్ధమైన మార్పులు ప్రమాదకరమైనవి మాత్రమే కాకుండా, ఇతరులకు కూడా సమస్యలను కలిగిస్తాయని పోలీసులు హెచ్చరించారు.

Continues below advertisement

భారతదేశంలో కార్ల మార్పులకు సంబంధించిన చట్టం

భారతదేశంలో కార్ల మార్పులు పూర్తిగా నిషేధించలేదు. కానీ దీని కోసం కఠినమైన రూల్స్ ఉన్నాయి. వాహనం భద్రత, శబ్ద స్థాయి లేదా ఉద్గారాలను ప్రభావితం చేసే మార్పులు చేస్తే కనుక చట్టవిరుద్ధంగా భావించి చర్యలు తీసుకుంటారు. అన్ని నిబంధనలను పాటిస్తే.. ECU రీమ్యాపింగ్, పరిమిత పనితీరు భాగాలు, RTO-అనుమతించిన CNG కిట్లు, వికలాంగుల కోసం ప్రత్యేక మార్పులు అనుమతించనున్నారు.

ఏ మార్పులు చట్టవిరుద్ధం?

భారీ శబ్దం చేసే ఆఫ్టర్‌మార్కెట్ ఎగ్జాస్ట్‌లు, ఎగ్జాస్ట్ నుండి మంటలు లేదా స్పార్క్‌లను విడుదల చేసే మార్పులు చేస్తే చర్యలు తప్పవు. వాటితో పాటు ప్రెజర్ హారన్‌లు, ముదురు విండో టింట్‌లు, బుల్ బార్లు, అనుమతి లేకుండా ఇంజిన్‌ను మార్చడం, ఫాన్సీ నంబర్ ప్లేట్‌లు వంటి మార్పులు భారతదేశంలో చట్టవిరుద్ధంగా భావిస్తారు. ఇటువంటి మార్పులు జరిమానాకు కారణం కావడమే కాకుండా, వాహనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. 

Also Read: మొదటి రోజే 93 వేలకు పైగా బుకింగ్స్‌తో అదరగొట్టిన Mahindra XUV 7XO, మహీంద్రా XEV 9S