ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థకు చెందినదిగా వైరల్ అవుతున్న ఓ లేఖ సోషల్ మీడియా విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతోంది. అయితే, ఆ లేఖ కచ్చితంగా తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ విడుదల చేసిన లేఖ అనే దానిపై స్పష్టత లేదు. కానీ, అందులోని అక్షర దోషాలు విపరీతంగా ఉన్నాయి. కనీసం ఒక్కో లైనుకు ఒక్కో తప్పు చొప్పున ఆ లేఖలో ఉన్నాయి.


సాక్షాత్తూ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రదానం చేయబోయే పురస్కారం కోసం ఆ సంస్థే విడుదల చేసిన ఓ ఉత్తర్వులో అన్ని తప్పులు ఉండడం చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. సంస్థకు ఉన్న అధ్యక్షులను ప్రభుత్వం అర్హతతో నియమించిందా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అర్హత లేని వారిని ఆ స్థానంలో కూర్చోబెడితే ఇలానే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.


తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు అయిన గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా ప్రముఖ వ్యక్తికి గిడుగు పురస్కారం అందించిన సందర్భంగా సదరు భాషాభివృద్ధి సంస్థ విడుదల చేసిన లేఖలో అన్నీ తప్పుల తడకలే ఉన్నాయి. గౌరవనీయులైన అనే చోట ‘గౌరవనియులైన’.. తేదీన అనే చోట ‘తేదిన’.. గ్రహిత (గ్రహీత), సభా కార్యక్రమం జరుగుతాయి (సభా కార్యక్రమం జరుగుతుంది) ఆహ్వాన్నాని (ఆహ్వానాన్ని) లాంటి తప్పులు ఎన్నో ఉన్నాయి. ఒకటి లేదా రెండు తప్పులు అచ్చు తప్పులు అని భావించే అవకాశం ఉంటుంది. కానీ, ఈ ఉత్తర్వులోని ప్రతి లైనులో అక్షర దోషాలు ఉండడం పట్ల అసలు దాన్ని టైప్ చేసిన వారు ఎవరు? టైప్ చేసిన ఆ ఉత్తర్వుపై సంతకం చేసి అధ్యక్షుడు ఎవరని ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టి ఆ ఇద్దరికి తెలుగు భాషపై పట్టు లేదని ఎద్దేవా చేస్తున్నారు.




రాష్ట్ర తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థకు గత జూన్ నెలలో ఇన్‌ఛార్జి అధ్యక్షుడిగా పి. విజయబాబును ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర యువజన అభ్యుదయం, పర్యాటక, భాషా, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్న విజయ బాబును ప్రాధికార సంస్థ ఇన్‌ఛార్జిగానూ నియమించారు.