AP Bundh Live Updates: టీడీపీ నేత పట్టాభి అరెస్ట్.. గవర్నర్ పేటకు తరలిస్తున్న పోలీసులు

ఏపీలో టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చిన వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబరు 20న జరిగే తాజా వార్తలు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 20 Oct 2021 09:24 PM
టీడీపీ నేత పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు..

టీడీపీ నేత పట్టాభిని పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య పోలీసులు వాహనంలో తీసుకెళ్లారు. పట్టాభి ఇంటి హై టెన్షన్ కొనసాగుతోంది. సీఎం వైఎస్ జగన్‌పై నిన్న పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఆపై టీడీపీ నేతలు, ఆఫీసులపై దాడులు జరిగాయి. 120 బి సెక్షన్ కింద అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారని పట్టాభి భార్య మీడియాకు తెలిపారు. తన భర్త ఎలా వెళ్లారో అలాగే ఇంటిికి రాకపోతే ఏపీ ప్రభుత్వం, పోలీసులు బాధ్యత వహించాలన్నారు. తలుపులు బద్ధలుకొట్టుకుని వచ్చి మరీ తన భర్తను అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

రేపు, ఎల్లుండి జనాగ్రహ దీక్ష చేపట్టనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

రేపు, ఎల్లుండి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాగ్రహ దీక్ష చేయనుంది. టీడీపీ బూతుల వ్యాఖ్యలకు నిరసనగా నియోజకవర్గ స్థాయిలో రెండు రోజుల పాటు నిరసనలు తెలుపుతున్నాయి. బూతు వ్యాఖ్యలకు టీడీపీ అధినేత చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో జనాగ్రహ దీక్షలు చేపట్టనున్నట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 

పార్టీ ఆఫీసుకు రాకుండా నారా లోకేష్‌ను అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర వాగ్వివాదం

మంగళగిరిలో టీడీపీ ఆఫీసు వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ ఆఫీసుకు రాకుండా నారా లోకేష్ సహా టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు, పోలీసులు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

చంద్రబాబు కీలక నిర్ణయం.. 36 గంటల పాటు దీక్ష

ఏపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు రోజుల పాటు దీక్ష చేపట్టనున్నారు. ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో చంద్రబాబు దీక్ష చేయనున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకూ చంద్రబాబు దీక్ష కొనసాగనుంది. ఇది 36 గంటల పాటు కొనసాగనున్నట్లుగా టీడీపీ వర్గాలు తెలిపాయి.

పట్టాభిని పార్టీనుంచి సస్పెండ్ చేయాలి.. వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్

సీఎం జగన్‌పై కొమ్మారెడ్డి పట్టాభి చేసిన వ్యాఖ్యల వెనక కచ్చితంగా చంద్రబాబు ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆ వ్యాఖ్యలు చంద్రబాబు చేసినట్టే అనుకోవాలని చెప్పారు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు తనకేం సంబంధం లేదని నిరూపించుకోవాలంటే పట్టాభి చేత జగన్‌కు బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. పట్టాభిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎం వైఎస్ జగన్ అని, అలాంటి ప్రజారంజక నేతపై పట్టాభి నీఛమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు సహజం అని, కానీ టీడీపీ ఉచ్చ నీచాలు మరిచి ప్రవర్తిస్తోందని అన్నారు. ప్రజాదరణ కోల్పోయిన టీడీపీ సిగ్గులేకుండా ప్రవర్తిస్తోందని, నీఛ, నికృష్ట చర్యలు మానుకోకపోతే రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ బూతులకు అభిమానులు తట్టుకోలేరు: జగన్

‘‘టీడీపీ నేతలు ఇలా బూతులు మాట్లాడడం వల్ల దీన్ని టీవీల్లో చూసిన పార్టీ అభిమానులు.. దాన్ని తట్టుకోలేకపోతుంటారు. వాళ్లకి బీపీ వచ్చేస్తుంది. ఆ ఆవేశంతోనే వారు రియాక్ట్ అవుతుంటారు. ఇలా చేసేందుకు ప్రతిపక్ష పార్టీ నేతలే ఉసిగొల్పుతుంటారు’’ అని జగన్ మాట్లాడారు.

ఈ బూతులు ఎప్పుడూ వినలేదు: జగన్

ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. జగనన్న తోడు ప్రారంభం సందర్భంగా ఆయన తాడేపల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజలపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమను ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని జగన్ అన్నారు. కోర్టు కేసులతో ప్రభుత్వ పనులను అడ్డుకుంటున్నారని అన్నారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. ఇలాంటి బూతులు ఎప్పుడూ వినలేదని, కొందరు కావాలనే తిట్టించి రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. కొంత మంది కులాలు, మతాల మధ్య విభేదాలు రేపుతున్నారని అన్నారు. ‘‘మంచి జరిగితే జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే ఊహతో అల్లర్లు చేస్తున్నారు. ఈ రెండున్నర సంవత్సరాల పరిపాలన కూడా సంతృప్తికరంగా ఉండేలా ఉంది. దేవుడి దయ వల్ల మిగతా కాలం కూడా ఇలానే పరిపాలన సాగిస్తాం.’’ అని జగన్ అన్నారు.

టీడీపీ బంద్‌‌పై బొత్స్ సత్యనారాయణ ఫైర్

తెలుగు దేశం పార్టీ ఏపీలో బంద్‌కు పిలుపునిచ్చిన వేళ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ప్రతిపక్షాలపైన మంత్రి విరుచుకుపడ్డారు. టీడీపీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామని చెప్పారు. మావోయిస్ట్ పార్టీకి టీడీపీకి పెద్ద తేడా ఏం లేదని వివరించారు. ‘‘నోటికి అన్నం తింటున్నారా? అశుద్ధం తింటున్నారా? ఏం సమాధానం చెబుతావ్. మీ పార్టీ ప్రతినిధి మాట్లాడిన వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తావు? బీజేపీతో ఉన్న చంద్రబాబు వ్యక్తి పవన్ కళ్యాణ్ సమర్థించడం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చంద్రబాబుకు వత్తాసు పలకటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.

ఎంపీ రామ్మోహన్ నాయుడు అరెస్ట్

ఏపీలో టీడీపీ పిలుపునిచ్చిన బంద్ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ ఆ పార్టీ నేతల్ని అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు‌తో సహా పలువురు టీడీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్సులను తిరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టెక్కలిలో బంద్ చేపట్టేందుకు రోడ్డు మీదకు వచ్చిన టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విశాఖపట్నంలో హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావును స్వగ్రామం రాజాంలో హౌస్ అరెస్ట్ చేశారు. 

చిరిగిపోయిన బుద్ధా వెంకన్న చొక్కా

విజయవాడలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న హంగామా చేశారు. ఆయన తన అనుచరులతో ఆందోళన చేపడుతుండగా.. పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బుద్ధా వెంకన్నకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే బలవంతంగా బుద్ధా వెంకన్నను అరెస్టు చేస్తుండగా.. ఆ ఉద్రిక్తతలో ఆయన చొక్కా చిరిగిపోయింది. అంతకుముందు బుద్ధా వెంకన్న మాట్లాడుతూ తాము ఇంత వరకూ ఇక చెంపపై కొడితే మరో చెంప చూపిస్తూ గాంధీ సిద్ధాంతం అనుసరించేవారమని అన్నారు. ఇకపై తాము ఒక చెంపపై కొడితే ఎదుటివారి రెండు చెంపలు వాయిస్తామని తేల్చి చెప్పారు.

తిరుపతిలో నేతల హౌజ్ అరెస్టు

తిరుపతి నగరంలోని టీడీపీ నాయకులను నిన్న అర్ధరాత్రి నుండి పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకులను గృహనిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ, ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి తరలివస్తున్న నేతలను అడ్డుకుంటున్న పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టీడీపీ ముఖ్య నేతలను పోలీసులు ఎక్కడికక్కడ‌ హౌస్ అరెస్టు చేయడంపై పార్టీ నాయకులు మండిపడుతున్నారు.


పోలీసులు ఇబ్బంది పడే రోజు వస్తుంది: కోటంరెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడిని ఖండిస్తూ బంద్‌ని విజయవంతం చేయడానికి ఎక్కడికక్కడ జిల్లా నాయకత్వాలు సిద్ధమయ్యాయి. రాస్తా రోకో, బైక్ ర్యాలీ.. సహా ఇతర కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. అయితే పోలీస్ యంత్రాంగం మాత్రం ఈ బంద్ ప్రభావం లేకుండా చేయడానికి అదనపు బలగాలను మోహరించింది. టీడీపీ నేతలెవరూ బయటకు రాకుండా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసింది. టీడీపీ నేతల ఇళ్లముందు భారీగా పోలీస్ బలగాలను ఉంచింది. తమ పార్టీ కార్యాలయాలపై ప్రభుత్వం దాడి చేయించిందని, ఇప్పుడు తమను కనీసం ఇంటి బయటకు రాకుండా చేస్తున్నారని అంటున్నారు నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. పోలీసులు అడ్డుకున్నా తాము అనుకున్నది సాధిస్తామని.. బంద్ నిర్వహించి తీరతామని చెబుతున్నారు. ఏడాదిలో టీడీపీ అధికారంలోకి వస్తుందని, పోలీసులు కచ్చితంగా ఇబ్బంది పడే రోజు వస్తుందని హెచ్చరించారు. 

డిపోల ఎదుట భారీ బందోబస్తు

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బస్సులను బయటకు వెళ్లనీయకుండా నేతలు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఏపీలో నిరసనల నేపథ్యంలో తెల్లవారు జామునుంచే బస్టాండ్లు, బస్సు డిపోల ముందు భద్రతను కట్టు దిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. అనుమానితులను ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేస్తున్నారు.

అనంతపురంలో పలువురు టీడీపీ నేతల ముందస్తు అరెస్టు

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యాలయాలపై దాడులు జరిగిన నేపథ్యంలో అందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈరోజు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, బందు నిర్వహించాలని రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున బందు చేసేందుకు తెలుగుదేశం శ్రేణులు సిద్ధమయ్యాయి. అయితే, బంద్ విజయవంతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లా తెలుగుదేశం ముఖ్యనాయకులు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు‌, హిందూపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బి.కె పార్థసారథి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తదితరులను అర్ధరాత్రి నోటీసులు జారీ చేసి గృహనిర్బంధం చేశారు. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ బస్సులను సైతం భారీ పోలీసు బందోబస్తు నడుమ నడుపుతున్నారు. ముఖ్య నాయకులు గృహనిర్బంధంలో ఉండడంతో ద్వితీయ శ్రేణి నాయకులు రోడ్లపైకి వచ్చి బంద్‌కు సహకరించాలని ప్రజలను కోరుతున్నారు.

Background

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతలపై, కార్యాలయాలపై మంగళవారం దాడులు జరిగాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపై యాభై మంది దుండగులు దాడి చేశారు. ఇంట్లోని ఫర్నీచర్, విలువైన సామాగ్రినంతటిని ధ్వంసం  చేశారు. పట్టపగలు అందరూ చూస్తూండగానే నింపాదిగా దాడులు చేసి వెళ్లిపోయారు. గతంలో ఓ రెండు సార్లు పట్టాభిరామ్‌పై దాడి జరిగింది. అయినా పోలీసులు ఎలాంటి భద్రతా ఏర్పాటు చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే దాడులకు పాల్పడ్డారని భావిస్తున్నారు. 


ఒక్క పట్టాభిరామ్ ఇంటిపైనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లపై దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపైనా దాడులు జరిగాయి. కొంత మంది సెక్యూరిటీని నెట్టేసి కార్యాలయంలోకి దూసుకెళ్లి దొరికిన వారిని దొరికినట్లుగా కొట్టినట్లుగా తెలుస్తోంది. కడప సహా పలు చోట్ల టీడీపీ నేతల ఇళ్లపై దాడులు జగినట్లుగా తెలుస్తోంది. ఎక్కడా పోలీసులు అడ్డుకోవడం కానీ..  భద్రత కల్పించడం కానీ చేయలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 


మూలం ఇదీ..
గంజాయి స్మగ్లింగ్ వ్యవహారంలో  వైసీపీ నేతలపై నక్కా ఆనంద్ బాబు విమర్శలు చేయడంతో నర్సీపట్నం పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు అర్థరాత్రి ఇంటికి వెళ్లారు. ఈ అంశంపై మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడిన పట్టాభిరామ్... వైసీపీ నేతలు, పోలీసుల వ్యవహారంపై తీవ్రమైన విమర్శలు చేశారు. పోలీసులను గుప్పిట్లో పెట్టుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇదంతా చేయిస్తున్నారని.. గంజాయి వ్యవహారంపై  మాట్లాడకుండా బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. ఈ ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే దాడులకు దిగినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.


కొద్ది రోజులుగా ఏపీలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అన్నీ గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ ఆరోపణల చుట్టూనే తిరుగుతున్నాయి. రాజకీయ నేతలు, ఆరోపణల మధ్యలో పోలీసులు జోక్యం చేసుకోవడం పరిస్థితిని మరింత తీవ్రంగా మారుస్తోంది. సోమవారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మీడియా సమావేశం పెట్టారు. గంజాయి అక్రమ రవాణా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. గంజాయి స్మగ్లింగ్ వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. అనూహ్యంగా అర్థరాత్రి సమయంలో నర్సీపట్నం పోలీసులు గుంటూరులోని నక్కా ఆనంద్ బాబు ఇంటికి వచ్చారు. నర్సీపట్నం సీఐ కూడా వచ్చారు. అర్థరాత్రి పూట నిద్రలో ఉన్న నక్కా ఆనంద్ బాబును లేపారు. సోమవారం మధ్యాహ్నం ప్రెస్‌మీట్‌లో గంజాయి మాఫియా అని ఆరోపణలు చేశారని.. దానికి ఆధారాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేయడానికి వచ్చామని చెప్పారు.  నోటీసులు ఇవ్వడానికి అర్థరాత్రి రావాలా అని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు ఉదయమే వస్తామని వెళ్లిపోయారు.


ఈ అంశంపై పట్టాభిరామ్ తీవ్రమైన విమర్శలు చేయడంతో వైసీపీ నేతలు దాడులకు తెగబడినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా మూకుమ్మడిగా ఒకే సారి నిరసనలు.. టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరగడంతో ప్రణాళికతోనే చేశారని అనుమానిస్తున్నారు. అందరికీ ఒకే సారి దాడులు చేయాలని  సమాచారం పంపారని.. అడ్డుకోవద్దని పోలీసులకు కూడా ఆదేశాలిచ్చారని.. పోలీసులు  పాటించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.