Breaking News Live: దక్షిణాఫ్రికాలో కరోనావైరస్ కొత్త వేరియంట్‌

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 25 Nov 2021 05:44 PM
దక్షిణాఫ్రికాలో కోవిడ్-19 కొత్త వేరియంట్

దక్షిణాఫ్రికాలోని శాస్త్రవేత్తలు కరోనావైరస్ కొత్త వేరియంట్‌ను కనుగొన్నారని వార్తా సంస్థ AFP ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. 

సినీ టికెట్ రేట్లపై రంగంలోకి చిరంజీవి.. జగన్ ప్రభుత్వానికి వినతి

ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారంపై మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. టికెట్ ధరల విషయంలో పునరాలోచించాలని జగన్ ప్రభుత్వానికి విన్నవించారు. ‘‘పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం. అదే విధంగా థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకుదెరువు కోసం తగ్గించిన టికెట్ రేట్లను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే సినీ పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులను ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు, టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండడం సమంజసం. దయచేసి ఈ విషయమై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమ నిలదొక్కుకుంటుంది.’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.





స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా

తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ‘‘రెగ్యులర్ మెడికల్ టెస్ట్‌లలో భాగంగా నిన్న రాత్రి చేయించిన కోవిడ్ టెస్ట్‌లో నాకు పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు ఏఐజీ, గచ్చిబౌలి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్ లో ఉండగలరని మనవి.’’ అని పోచారం కోరారు. ఇటీవలే పోచారం మనవరాలి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఆ పెళ్లికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ముగ్గురు కలిసి ఒకే టేబుల్‌పై కూర్చొని భోజనం కూడా చేశారు.

సింగర్ హరిణి తండ్రి మరణం

టాలీవుడ్ సింగ్ హరిణి తండ్రి అనుమానాస్పద రీతిలో చనిపోయారు. హరిణి తండ్రి ఏకే రావు బెంగళూరు సమీపంలోని ఓ రైల్వే ట్రాక్‌పై విగత జీవిగా కనిపించారు. అయితే, వారం రోజులుగా హరిణి కుటుంబం ఆచూకీ తెలియనట్లుగా సమాచారం. ఏకే రావు చనిపోయిన తర్వాతే ఆ కుటుంబం రైల్వే పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమైనట్లుగా తెలుస్తోంది. ఏకే రావు మరణాన్ని హత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఏకే రావు సుజనా ఫౌండేషన్‌కు సీఈవోగా ఉన్నారు.

శ్రీశైలంలో పురుగులు మందు తాగిన యువతి

శ్రీశైలం ఆలయం ముందు మెయిన్ రోడ్డులో హైదరాబాద్‌కు చెందిన మౌనికరెడ్డి (25) అనే యువతి విషయం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వేకువజామున 5 గంటల సమయంలో పురుగుల మందు సేవించి రోడ్డుపై సృహతప్పి పడిపోయింది. ఇది గమనించిన కొందరు భక్తులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన 108 వాహన సిబ్బంది అంబులెన్స్‌లో మౌనిక రెడ్డిని సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్స నిర్వహించారు. మౌనిక రెడ్డికి ప్రమాదమేమీ లేదని ఆమె నెమ్మదిగా కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఆమె సృహలోకి వచ్చిన తరువాత తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

నేడు ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా

ఢిల్లీ రైతు ఉద్యమానికి మద్దతుగా నేడు ఇందిరా పార్కు వద్ద విపక్ష పార్టీలు మహా ధర్నా నిర్వహించనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ధర్నా జరగనుంది. భారతీయ కిసాన్ యూనియన్ నేత టికాయత్ సహా.. పలువురు నాయకులు ఈ మహా ధర్నాలో పాల్గొంటున్నారు. అన్ని పంటలకు మద్దతు ఇవ్వాలని, విద్యుత్ బిల్లును కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ వారు చేస్తున్నారు.

సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఐసోలేషన్ వార్డులో అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పేషెంట్లు, ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. ముందే మంటలను సిబ్బంది మంటలను గమనించడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రిలో ఉన్న ఫర్నిచర్, ఐసోలేషన్ వార్డులో ఉన్న పలు మిషనరీలు దహనం అయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

Background

విశాఖ: ఎండాడ వద్ద ఘోర ప్రమాదంలో సీఐ దుర్మరణం
గురువారం తెల్లవారుజామున విధులు ముగించుకుని మధురవాడ వైపు వెళ్తున్న పోలీసు వాహనం ఎండాడ ఏసీపీ కార్యాలయం దగ్గరలో ప్రమాదానికి గురైంది. బహుశా ఈ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టి ఉంటుందని, లేదా ఈ వాహన డ్రైవర్ (హోమ్ గార్డు) వేరే వాహనాన్ని ఢీకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో 3 టౌన్ సీఐ ఈశ్వరరావుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌కి గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. పీఎం పాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


పెట్రోల్ డీజిల్ ధరలు..
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లోనూ నాలుగు రోజులుగా స్థిరమైన ధరలే ఉంటున్నాయి. కానీ, తాజాగా పెరిగాయి. పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.107.88 అయింది. డీజిల్ ధర కూడా రూ.0.17 పైసలు పెరిగి రూ.94.31 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు కాస్త ఎక్కువగానే పెరిగింది. లీటరుకు రూ.0.90 పైసలు పెరిగి ప్రస్తుతం రూ.110.98 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.81 పైసలు పెరిగి రూ.97.00గా ఉంది.


బంగారం ధరలు..
2 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,700 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,760 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.67,600గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. ఇక విజయవాడలోనూ పసిడి ధర స్థిరంగా కొనసాగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,700 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,760గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,600గా ఉంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,700 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,760గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,600 గా ఉంది.


Also Read: Tomato Rates: సెంచరీ దాటిన టమాటా ధరలు...మరి ప్రత్యామ్నాయంగా ఏం తినాలంటే...


Also Read: ఖమ్మంలో వామపక్షాలతో టీఆర్ఎస్‌ దోస్తీ.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు ప్లాన్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.