Breaking News Live: నెల్లూరు జిల్లా కోవూరులో భారీ పేలుడు.. 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 24 Nov 2021 10:45 PM
నెల్లూరు జిల్లా కోవూరులో భారీ పేలుడు.. 

నెల్లూరు జిల్లా కోవూరులో భారీ పేలుడు సంభవించింది. రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉలిక్కిపడ్డారు. బాంబు పేలిందా లేక, గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయిందా, లేదా ఇంకేదైనా కారణం ఉందా అని ఆందోళనకు గురయ్యారు. పేలుడు తర్వాత కరెంటు పోవడంతో చుట్టూ చీకట్లు అలముకున్నాయి. దీంతో జనం భయాందోళనలకు గురయ్యారు. కోవూరు శ్మశానవాటిక సమీపంలోని బస్ షెల్టర్ లో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలినట్టు స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. బస్ షెల్టర్ కూడా కుప్పకూలింది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం కోవూరు ఎస్సై వెంకటేశ్వరరావు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సోమశిల ప్రాజెక్ట్ కి గండిపడిందనే పుకారుతో ముందురోజు జనం అనవసరపు ఆందోళనకు గురికాగా.. ఇప్పుడు అదే ప్రాంతంలోని ప్రజలు పేలుడు ధాటికి ఉలిక్కిపడ్డారు.

శ్రీశైలం హుండీ లెక్కింపు ఆదాయం రూ.3.56 కోట్లు

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మహాక్షేత్రంలో స్వామి అమ్మవార్ల హుండీల ద్వారా 3 కోట్ల 56 లక్షల 20 వేల 325 రూపాయల నగదు వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు  ఉభయదేవాలయాల హుండీల లెక్కింపు ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్టమైన భద్రత సీసీ కెమెరాల మధ్య ఆలయ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించామని ఈవో తెలిపారు. నగదుతోపాటు 1435 యూఎస్ డాలర్లు, 70 కెనడా డాలర్లు, 2 సింగపూర్ డాలర్లు స్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పించినట్లు ఈవో లవన్న వెల్లడించారు

బయ్యారంలో పులి సంచరిస్తుందని గ్రామస్తుల ఆందోళన

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఇసుకమేది, భీమ్లా తండా సమీపంలో పులి సంచరిస్తుందని గ్రామస్తుల ఆందోళన చెందుతున్నారు. పులి సంచారంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. బయ్యారంలోని వివిధ గ్రామాల్లో పంట పొలాల వద్దకు వెళ్లకుండా రైతులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. పులి ఆనవాళ్ల కోసం అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. ఇటీవల ములుగు జిల్లా అడవుల్లో పులిని వేటగాళ్లు చంపినట్లు తెలుస్తోంది. వేటగాళ్ల కదలికలపై అటవీ అధికారులు దృష్టిపెట్టారు. 

ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఎన్నిక ఏకగ్రీవం

నిజామాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి భారీగా ఓట్లు ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ బరిలో నుంచి తప్పుకున్నాయి. దీంతో కల్వకుంట్ల కవిత ఒక్కరే బరిలో ఉన్నారు. ఫలితంగా ఆమె ఎన్నిక ఏకగ్రీవం అయింది.

ప్రధానికి లేఖ రాసిన- సీఎం జగన్

ఏపీలో వరద నష్టంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక టీమ్‌ను పంపాలని కోరారు. తక్షణ వరద సాయం కింద రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని లేఖలో రాశారు. ఈ లేఖను ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా పంపారు.

ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. ‘‘సర్పంచులకు నిధులు, విధులు లేకుండా పంచాయతీల అభివృద్ధి ఎలా సాధ్యం? కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 14, 15 ఆర్థిక సంఘాల నిధులతో పాటు సాధారణ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం సరికాదు. సర్పంచులకు అధికారాలు లేకుండా చేయడమే మీరు చెబుతున్న అధికార వికేంద్రీకరణా? పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని ఏపీలోని సర్పంచులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పంచాయతీల నిధులు రూ.3,450 కోట్లను తిరిగి ఇవ్వాలి.’’ అని రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఢిల్లీలో డ్రామా

ఓ వైపు రాష్ట్రంలో వర్షాలకు వడ్లు పాడయిపోయి, మొలకెత్తుతుంటే.. కేసీఆర్‌ అండ్‌ బ్యాచ్‌ మాత్రం ఢిల్లీలో డ్రామాలాడుతున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. రైతుల పేరుతో రాజకీయాలు చేస్తూ.. రైతు ప్రభుత్వమని చెప్పుకోడానికి సిగ్గుండాలని ఆమె ట్విటర్‌ ద్వారా విమర్శించారు.





Background

నేడు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన..
నేడు చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పనున్నారు. బుధవారం ఉదయం 10.15 గంటలకు ఏర్పేడు మండలం పాపానాయుడు బ్రిడ్జ్‌ను ఆయన పరిశీలిస్తారు. 10.30 గంటలకు తిరుచానూరులోని స్వర్ణముఖి నదిని సందర్శిస్తారు. 12.10 గంటలకు అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్న రాయచెరువును పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎం.ఆర్. పల్లి సమీపంలోని దుర్గానగర్ కాలనీ, క్రిష్ణా నగర్, గాయత్రి నగర్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య లక్ష్మీపురం సర్కిల్, ఆటోనగర్ ప్రాంతాల పరిశీలన ఉండనుంది.


చిత్తూరు జిల్లాలో అత్యంత ప్రమాదకరమైన స్థితిలో రాయలచెరువు ఉండడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఇప్పటికే చెరువుకు గండీ పడగా.. ఆ ప్రాంతం నుంచి క్రమంగా సిమెంటు, ఇసుక పడిపోతోంది. దీంతో పరిసర ప్రాంతాల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా ఈ చెరువును కూడా చంద్రబాబు సందర్శించనున్నారు.


వాతావరణం ఇలా..
వరద నష్టం నుంచి రాయలసీమ ప్రజలు కోలుకోకముందే మరోసారి వర్ష సూచన ఉదంటూ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు అమరావతి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రానున్న 24 గంటల్లో దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ప్రకటించింది. దీని ప్రభావం శ్రీలంక, దక్షిణ తమిళనాడుపై తీవ్రంగా ఉండబోతుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు. దక్షిణ తమిళనాడు తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తమిళనాడుపై ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుండగా.. చిత్తూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


నేటి ఇంధన ధరలు
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లోనూ నాలుగు రోజులుగా స్థిరమైన ధరలే ఉంటున్నాయి. పెట్రోల్ ధర కూడా స్థిరంగా ఉండి రూ.107.69 గానే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.94.14గా నిలకడగానే ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.


విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు స్వల్పంగా తగ్గింది. లీటరుకు రూ.0.28 పైసలు తగ్గి ప్రస్తుతం రూ.110.08 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.26 పైసలు తగ్గి రూ.96.19గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.


బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు భారీగా తగ్గింది. పసిడి ధరతో పాటు వెండి ధర ఓ మాదిరిగా తగ్గుదల కనిపించింది. వెండి కిలోకు రూ.900 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,050 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.49,150 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.69,500గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.