Breaking News Live: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న లారీ.. వాగులో కొట్టుకుపోయిన 11 మంది ప్రయాణికులు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
నెల్లూరు జిల్లా సంగం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీ కొట్టింది. 15 మందితో ప్రయాణిస్తున్న ఆటో వాగులో పడిపోయింది. వాగులో నుంచి స్థానికులు నలుగురిని కాపాడారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కాపాడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులు వాగులో కొట్టుకుపోయారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
శబరిమలై సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి శబరిమలై వెళ్తోన్న టెంపోను వెనక నుంచి బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కర్నూలుకు చెందిన ఆది నారాయణ, ఈశ్వర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి సీరియస్ గా ఉంది. కర్నూలుకు చెందిన 11 మంది అయ్యప్ప స్వాములు టెంపో వాహనంలో బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు శబరిమలై వెళ్లారు. శబరిమలైకు అరవై కిలోమీటర్ల దూరంలో ఇడుక్కి జిల్లా పెరువంతనం వద్ద ఉదయం పది గంటల సమయంలో టెంపో వాహనం రోడ్డు పక్కన ఆపి టీ తాగు తుండగా టెంపోను వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. శబరిమలై వెళ్లిన పదకొండు మందిలో ఐదుగురు అయ్యప్ప మాల ధరించినవారు, మిగిలిన ఆరుగురు సాధారణ భక్తులు ఉన్నారు.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనకొండ నుంచి ఏలూరు వెళ్లే రహదారిలో ఫాబెక్క్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీగా ఎగిసిపడుతున్న మంటల కారణంగా సమీపంలో నివసించే ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటల్ని అదుపులోకి తెచ్చాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు బయటకి రావాల్సి ఉంది
నీలగిరి జిల్లాలో ఉన్న మద్రాస్ రెజిమెంట్ సెంటర్‌లో వీర సైనికుల భౌతికకాయాలకు గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ నివాళి అర్పించారు. సైనికవీరుల పార్దీవదేహాల ముందు పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. గవర్నర్ తమిళసై తన ట్విట్టర్‌లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన ఆర్మీ సిబ్బంది కూడా ఆమె నివాళి అర్పించారు.
కేంద్ర ప్రభుత్వం నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయాలని తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకోవాలని కోరుతూ సింగరేణి అన్ని కార్మిక సంఘాలు చేపట్టిన మూడు రోజుల సమ్మె విజయవంతం అయింది. తొలిరోజు అన్ని గనుల వద్ద నిరసన తెలిపిన కార్మిక సంఘాలు, విధులు బహిష్కరించారు. సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్యాలయం ముట్టడి నిర్వహించారు. ఈ సందర్బంగా సింగరేణి ప్రధాన కార్యాలయంలోకి వెళ్లేందుకు వచ్చిన ఉద్యోగులను అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకోవాలని ఈ సందర్భంగా అన్ని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కార్మిక సంఘం నాయకులు అధికారుల సంఘం మద్దతు కోరారు.
కూనూరు హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో బ్లాక్ బాక్స్ దొరికింది. విమానాలు, హెలికాప్టర్ల ప్రమాదం జరిగాక అందుకు గల కారణాలను విశ్లేషించేందుకు బ్లాక్ బాక్స్ కీలకంగా మారుతుంది. తాజాగా ఈ బ్లాక్ బాక్స్‌ను ప్రమాదం జరిగిన ప్రాంత పరిసరాల్లోనే భద్రతా సిబ్బంది కనుగొన్నారు. దాన్ని సేకరించి డీకోడింగ్ కోసం తరలించారు. వింగ్ కమాండర్ ఆర్.భరద్వాజ్ నేత్రుత్వంలో వైమానిక దళానికి చెందిన 25 మంది ప్రత్యేక టీమ్ ఈ బ్లాక్ బాక్స్ శోధనలో పాల్గొన్నారు. బుధవారం హెలికాప్టర్ ప్రమాదం జరిగిన తర్వాతి నుంచి అత్యవసర ప్రాతిపదికన వీరంతా గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న మధ్యాహ్నం నుంచి ప్రమాదంలో మరణించిన ఆర్మీ అధికారుల భౌతిక కాయాలను గుర్తించి సమీపంలోని ఆర్మీ క్యాంపునకు తరలించారు. గాయపడ్డవారిని వెల్లింగ్టన్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు.
అఖండ చిత్రబృందం సింహాచలంలో సింహాద్రి అప్పన్నని దర్శించుకున్నారు. బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను కూడా అప్పన్న సేవలో పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో బాలకృష్ణ, చిత్ర టీం పాల్గొని సింహాద్రిశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘అఖండ’ విజయం సాధించిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ ఏడాది తొమ్మిది నెలల తర్వాత విడుదలైన సినిమాకు మంచి ఆదరణ చూపించిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నంలోని ఎంజీఎం గ్రౌండ్స్, ఉడా పార్క్‌లో ‘అఖండ’ విజయోత్సవ వేడుక జరగనుంది.
Background
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో విజయనగరం ఎమ్మెల్సీ రంగరాజు., పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు., తెలంగాణ ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ., ప్రభుత్వ సలహా దారుడు అజయ్ కల్లమ్ రెడ్డిలు కుటుంబ సభ్యులతో కలసి వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
తల్లిదండ్రుల నిరసన
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం సొగనూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పై కప్పు నుండి పెచ్చులు ఉడి పడుతుండటంతో తమ పిల్లలను బడులకు పంపలేమంటూ తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. పాఠశాలలో 235 మంది విద్యార్థులు 9 మంది ఉపాధ్యాయులు గాను ఏడు గదులు ఉన్నాయి. ఇందులో అన్ని గదులు శిథిలావస్థకు చేరాయి. ఏ క్షణం ఏమి జరుగుతుందో అని రోజు బయపడుతూనే ఉన్నారు. ఇలా ఉంటే ప్రాణాలు పణంగా పెట్టి తమ పిల్లలను బడులకు పమపలేమని, కావాలంటే తమ పిల్లలకు గుడిలో, చెట్ల కింద చదువులు నేర్పాలన్నారు. ఈ పాఠశాలపై ఎన్ని సార్లు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లిని పట్టించుకోవడంలేదని, ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి పాఠశాల నూతన భవనం ఏర్పాటు చేయాలని వారు కోరారు.
ప్రధాని సీఎం కేసీఆర్ లేఖ
సింగరేణిలో చేపట్టబోయే నాలుగు గనుల వేలం ప్రక్రియను నిలిపివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. ఈమేరకు పూర్తి వివరాలతో లేఖ రాశారు. కోల్స్ బ్లాక్స్ వేలాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే సింగరేణి కార్మికులు నోటీసులు ఇచ్చారు. వేలం ప్రక్రియ వెనక్కి తీసుకోకపోతే సమ్మె తప్పదని హెచ్చరించాయి. గురువారం నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఈ నేేపథ్యంలోనే ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.
ప్రతి సంవత్సరం 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక భూమిక పోషిస్తోందని సీఎం లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో గరిష్ట విద్యుత్ డిమాండ్ జూన్ 2014లో 5,661 మెగావాట్లు ఉండగా, 2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు పెరిగిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం చాలా కీలకమని సీఎం కేసీఆర్ తెలిపారు.
సింగరేణి బొగ్గు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్ లీజులు మంజూరు చేసిందన్న ముఖ్యమంత్రి.. అందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ కూడా ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. కేంగ్ర బొగ్గు మంత్రిత్వశాఖ ట్రాంచ్ 13 కింద వేలం వేసేందుకు ప్రతిపాదించిన జీబీఆర్‌ఓసీ-3, శ్రావన్‌పల్లి ఓసీ, కోయగూడెం ఓసీ-3, కేకే-6 యూజీ బ్లాక్‌ల వేలం వల్ల సింగరేణి పరిధిలోని బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖను ఆదేశించాల్సిందిగా సీఎం కేసీఆర్.. ప్రధాన మంత్రిని కోరారు. ఈ బ్లాక్‌లను సింగరేణికే కేటాయించేలా చూడాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -