Breaking News Live: గుంతకల్లు - బళ్లారి జాతీయ రహదారి వద్ద ఘోర ప్రమాదం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 29 Dec 2021 09:56 PM
గుంతకల్లు-బళ్లారి 67వ జాతీయ రహదారి వద్ద ఘోర ప్రమాదం

గుంతకల్లు-బళ్లారి 67వ జాతీయ రహదారి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. విడపనకల్లు మండలం దొనేకల్లు  గ్రామ శివార్లలోని నిర్మాణం లో ఉన్న  బ్రిడ్జి  వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న నీటి కుంట లోనికి కారు దూసుకెళ్లింది. నీటి లోతు 40అడుగులు కన్న ఎక్కువగా ఉండడంతో క్రేన్ సహాయంతో కారును వెలికితీసేందుకు యత్నిస్తున్నారు పోలీసులు. కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారన్నది ఇంకా తెలియలేదు. కార్ గుంతకల్ వైపు నుండి బళ్ళారి వైపు వెళ్తున్నట్టు చెబుతున్నారు స్థానికులు. 

పోలవరంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ బృందం పర్యటన

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కమిషనర్ ఎ.ఎస్.గోయల్ జాయింట్ కమిషనర్ అనుప్ కుమార్ శ్రీవాస్తవ బృందం పర్యటిస్తున్నారు. ప్రాజెక్టు స్పిల్ వే, స్పిల్ ఛానల్ కాపర్ డ్యాం, గ్యాప్ త్రీ, గ్యాప్ వన్, పవర్ హౌస్ పనులను కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులు ఆరా తీసి అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్‌లో గవర్నర్ తమిళిసై పర్యటన

హైదరాబాద్‌లోని చింతల్‌ బస్తీలో గవర్నర్‌ తమిళిసై బుధవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గవర్నర్ సందర్శించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వంద శాతం తొలి డోసు టీకాలు పూర్తి కావడం సంతోషకరమని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అవసరమైన డోసులు పంపిణీ చేసిందని తెలిపారు. 2022 ఆరోగ్య సంవత్సరంగా సాగాలని కోరుకుంటున్నానని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు.

‘జగనన్న పాల వెల్లువ’ ప్రారంభం

కృష్ణా జిల్లాలో ‘జగనన్న పాలవెల్లువ’ కార్యక్రమం ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రభుత్వ సహకార డెయిరీలకు ఆర్థిక దన్ను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. జగనన్న పాలవెల్లువ పథకం ద్వారా పాలకు గిట్టుబాటు ధర, పాడి రైతుకు ఆర్థిక భరోసా లభించనుంది. గతేడాది నవంబర్‌లో అమూల్‌ సంస్థతో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు. క్రమంగా ఈ పథకం రాష్ట్రమంతటా విస్తరిస్తుంది. జనవరిలో అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లోనూ ఈ పథకాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ఇప్పటికే తయారు చేసింది.

అల్లుడ్ని హత్య చేసిన మామ

మల్కాజ్‌గిరి మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో ఓ అల్లుడు తన మామను హత్య చేశాడు. జగద్గిరిగుట్ట సంజయ్ గాంధీ నగర్‌కు చెందిన నరసింహ (50) గత రాత్రి పాపిరెడ్డి నగర్‌లో నివాసం ఉండే తన అల్లుడు బాలకృష్ణ (23) ఇంటికి వెళ్లాడు. బాలకృష్ణ తండ్రి అక్రమ సంబంధం విషయమై నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదానికి దారి తీసింది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కోపం పెంచుకున్న బాలకృష్ణ.. తన మామ నరసింహ మెడపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతణ్ని కుటుంబ సభ్యులు చింతల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మరణించాడు.

ఎరువుల లారీ చోరీ

చౌటుప్పల్‌లో ఆగి ఉన్న ఓ ఎరువుల లారీ అపహరించిన ఘటన చోటు చేసుకుంది. చౌటుప్పల్‌లోని ఓ ఎరువుల దుకాణానికి ఓ లారీ డ్రైవర్‌ లారీలో ఎరువుల లోట్‌ తీసుకువచ్చాడు. ఎరువుల దుకాణం చిరునామా దొరకకపోవడంతో చిరునామా కోసం లారీ నుంచి కిందకు దిగాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు యూరియా బస్తాల లోడ్‌తో ఉన్న లారీని చోరీ చేశారు. డ్రైవర్‌ దిగడాన్ని గమనించి లారీతో ఉడాయించారు. దీంతో ఖంగుతిన్న లారీ డ్రైవర్‌ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

నేడు నల్గొండ జిల్లాకు సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తండ్రి మారయ్య ఇటీవలే మృతి చెందారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణంలోని ఎమ్మెల్యే  కుటుంబాన్ని పరామర్శించి, మారయ్య దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలోని ఎన్జీ కళాశాల గ్రౌండ్‌లో అధికారులు హెలిపాడ్‌ను ఏర్పాటు చేశారు.


 

Background

ఆఫ్రికా ఖండంలోని సూడాన్‌‌లో ఘోర ప్రమాదం సంభవించింది. దేశంలో ఓ బంగారు గని కూలడంతో 38 మంది కూలీలు దుర్మరణం చెందారు. మరికొందరు గాయపడ్డారని సూడాన్ ప్రభుత్వ మైనింగ్‌ కంపెనీ తెలిపింది. దేశరాజధాని ఖార్టోమ్‌కు 700 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఫూజా గ్రామంలో ఉన్న దర్సాయా బంగారు గనిలో ఈ ఘటన జరిగింది. బంగారు గనిలో ప్రస్తుతం ఎలాంటి తవ్వకాలు జరగడం లేదని, 2019లోనే దానిని మూసేసినట్లుగా ప్రభుత్వ మైనింగ్‌ సంస్థ ప్రకటించింది. అయితే సరైన భద్రత లేకపోవడంతో స్థానికులు తరచూ ఆ గనిలోకి వెళ్తుంటారని, ఆ క్రమంలోనే ప్రమాదం జరిగిందని తెలిపింది. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది తీవ్రంగా గాయపడినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆఫ్రికాలో బంగారం ప్రధాన ఉత్పత్తిదారుగా సూడాన్‌ ఉంది. గతేడాది ఈ దేశం మొత్తమ్మీద 36.6 టన్నుల బంగారాన్ని వెలికితీశారు. సింది. కాగా, ప్రభుత్వం సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో బంగారు గనుల్లో ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి.


వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి
జనవరి 13 నుంచి 22 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతివ్వనున్నామని.. అదనపు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.  అయితే ఒమిక్రాన్  కారణంగా దర్శనాల సంఖ్య పెంచలేదనే విషయాన్ని భక్తులు గుర్తుంచుకోవాలని చెప్పారు. దర్శన టికెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించమని కూడా ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ విషయం గుర్తుపెట్టుకుని భక్తులు సహకరించాలని కోరారు. వైకుంఠ ఏకాదశి రోజున రాత్రి 2 గంటలకు స్వామి వారి దర్శనం ప్రారంభం అవ్వనున్నట్టు చెప్పారు. 


భక్తులు అధిక సంఖ్యలో దర్శనానికి వచ్చి.. ఒమిక్రాన్ వ్యాప్తికి కారణం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. రోజుకు 45 వేలమంది శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. 5 వేల సర్వ దర్శనం టోకెన్లను తిరుమల, తిరుపతి స్థానికులకు జారీ చేయనున్నట్టు చెప్పారు. దర్శన టికెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించమని.. వచ్చి ఇబ్బందులు ఎదుర్కొవద్దని కోరారు. 


ఒమిక్రాన్ కేసులు
తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా రాష్ట్రంలో మరో 7 ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. మెుత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య.. 62కి చేరింది. అయితే మెుత్తం ఒమిక్రాన్ బాధితుల్లో.. 46 మంది టీకాలు తీసుకోలేదు. ఇందులోనూ.. ట్రావెల్ హిస్టరీ లేని ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధరాణ అయింది. అయితే మెుదట్లో.. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలోనే.. ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అయితే ఇప్పుడు ఎలాంటి ప్రయాణాలు లేని వాళ్లలో కూడా.. వేరియంట్ ను గుర్తించారు.


డిసెంబరు 31 రాత్రి లిక్కర్ షాపులకు వెసులుబాట్లు
మందుబాబులకు ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. మద్యం విక్రయ వేళలు పొడిగించినట్టు తెలిపింది. కొత్త ఏడాది సందర్భంగా మద్యం విక్రయ వేళలు పొడిగించారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు తెరిచే ఉంటాయి. 31న రాత్రి ఒంటిగంట వరకు ఈవెంట్ల నిర్వహణకు అనుమతి ఉంటుంది.


మరోవైపు ఒమిక్రాన్ దృష్ట్యా నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం ఇటీవలే ఆంక్షలు విధించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. తెలంగాణ హైకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంక్షలు విధించాలని ఆదేశించింది. ఒమిక్రాన్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి క్రిస్మిస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెలిపింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం తెలిపింది.  ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.