AP Telangana Rain Live Updates : కవరేజ్ కు వెళ్తూ వరదలో గల్లంతైన ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్ 

Andhra Pradesh - Telangana Rain Live Updates ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలపై తాజా వార్తలకు ఈ పేజీని చూడండి.

ABP Desam Last Updated: 12 Jul 2022 10:45 PM
కవరేజ్ కు వెళ్తూ వరదలో గల్లంతైన ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్ 

జగిత్యాల జిల్లాలో అపశృతి చోటుచేసుకుంది. కవరేజ్ కి వెళ్తూ ప్రముఖ ఛానల్ రిపోర్టర్ వరదలో గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయినా ఇంకా అతని ఆచూకీ లభ్యం కాలేదు.  ప్రైవేటు వ్యవసాయ క్షేత్రంలో వరదలో చిక్కుకున్న వారి న్యూస్ కవరేజ్ కి వెళుతుండగా ఓ ప్రముఖ ఛానల్ కు చెందిన జర్నలిస్టు వరద నీటిలో గల్లంతయ్యారు. సహాయక బృందాలు కూలీలను సురక్షితంగా తరలిస్తున్నారనే వార్త తెలిసిన రిపోర్టర్ జమీర్ అక్కడికి తన సహచర మిత్రుడితో కలిసి షిఫ్ట్ కార్ లో వెళ్లారు. రాయికల్ మండలం రామోజీ పేట భూపతిపూర్ గ్రామాల మధ్యన ఉన్న కల్వర్టు పై వరద నీరు ఉద్ధృతంగా వస్తున్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు నీటిలో కొట్టుకుపోయింది. అయితే కారులో ఉన్న మరో వ్యక్తి తప్పించుకోగలిగారు. అతను స్థానికులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.  

హైదరాబాద్ నెహ్రూ జూపార్కులోకి చేరిన వరద నీరు

హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులోకి భారీగా  వరద నీరు చేరింది. దీంతో జూపార్కులోని సఫారీ పార్కును అధికారులు మూసివేశారు. వరదనీరు తగ్గాక సందర్శకులను అనుమతిస్తామని తెలిపారు. మీరాలం చెరువు పొంగి జూ పార్కు లోకి నీళ్లు  చేరాయి.  

కోదాడలో పొంగుతున్న వాగులు వంకలు

కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా గడిచిన నాలుగు, ఐదు రోజుల నుంచి భారీగా కురుస్తున్నాయి. ఈ వర్షాలతో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కోదాడ పట్టణంలోని పెద్ద చెరువు, మోతె మండలంలోని నమవరం పెద్ద చెరువులకు వర్షపు నీరు చేరడంతో అలుగుపారుతున్నాయి. చెరువుల కింద ఉన్న గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

భద్రాచలంలో కొనసాగుతోన్న రెండో ప్రమాద హెచ్చరిక, తగ్గుతున్న నీటి మట్టం 

భద్రాచలంలో గోదావరి నీటిమట్టం తగ్గుతోంది. సాయంత్రం 6 గంటలకు 51.80 అడుగులకు నీటి మట్టం చేరింది. సుమారు 3 అడుగులు  గోదావరి ప్రవాహం తగ్గింది. భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 
 

హిమాయత్ సాగర్ లో డేంజర్ లెవెల్స్ 

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ లోని హమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో ప్రమాద స్థాయికి వరద చేరింది. మరో రెండు అడుగులు పెరిగితే మొత్తం గేట్లు ఎత్తడంతో పాటు , దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో పోలీసులు గస్తీ కాస్తున్నారు.
 

బోర్నపల్లి వ్యవసాయ క్షేత్రంలో చిక్కుకున్న 9 మంది రైతులు, రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ 

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో 9 మంది వ్యవసాయ కూలీలు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ప్రభుత్వం NDRF సిబ్బంది,  హెలికాప్టర్ ఏర్పాటు చేసింది. ఈ సంఘటనపై మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ రవి జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తున్నారు. రాయికల్ మండలం బోర్నపళ్లికి NDRF బృందాలు చేరుకున్నాయి. కుర్ర వాగులో చిక్కుకున్న 9 మంది రైతులను  రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్తున్నాయి. బోట్ ద్వారా వీలుకాకుంటే హేలికాఫ్టర్ ద్వారా రైతులను రక్షించేందుకు ప్రయత్నించనున్నారు.  సహాయక చర్యలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్, డీఎస్పీ ప్రకాష్ పర్యవేక్షిస్తున్నారు. 

హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం, నగరంలో పరిస్థితులపై మేయర్ సమీక్ష 

హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్‌లో వర్షం కురుస్తోంది. మన్సురాబాద్, బి.ఎన్ రెడ్డి నగర్, తుర్కయాంజల్‌ తో పాటు హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీ వర్షం కురిసింది. నగరంలో గత నాలుగు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు.
 

పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉద్ధృతి, పోలీస్ చెక్ పోస్ట్ ను చుట్టుముట్టిన వరద 

ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. స్పిల్ వే ఎగువన 34.1 మీ, స్పిల్ వే దిగువన  25.815 మీటర్ల నీటిమట్టం నమోదైంది. స్పీల్ వే 48 గేట్ల ద్వారా 12,09195 కూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. వరద కారణంగా పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. కడెమ్మ వంతెన పూర్తిగా మునిగిపోయింది. ప్రాజెక్ట్ పోలీస్ చెక్ పోస్టును సైతం వరద నీరు చుట్టుముట్టింది. ప్రాజెక్టు ప్రధాన రహదారిపై 14 అడుగులకు గోదావరి వరద చేరింది. ప్రాజెక్టులోకి రాకపోకలు బంద్ అయ్యాయి. 

నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

భారీ వర్షాలకు  నిర్మల్ జిల్లాలో నదులకు వరద పోటెత్తుతోంది. న‌దులు, వాగులు, వంక‌లు ఉప్పొంగుతున్నాయి. ఎస్సారెస్పీ, కడెం, గ‌డ్డెన్న స్వర్ణ ప్రాజెక్ట్ ల‌లోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతుంది. మ‌రోవైపు  సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి నిర్మల్ జిల్లాలో ప‌రిస్థితిని ఎప్పటిక‌ప్పుడు ప‌ర్యవేక్షిస్తున్నారు. జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధుల‌ను అప్రమ‌త్తం చేస్తూ స‌మీక్షలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప‌ర్యటిస్తున్నారు.  స్వర్ణ ప్రాజెక్ట్ లో భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతుండ‌టంతో మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి స్వర్ణ ప్రాజెక్ట్ ను సంద‌ర్శించి ఇన్ ప్లో, అవుట్ ప్లో వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.  నిర్మల్‌ జిల్లా కడెం జలాశయంలోకి వరద పోటెత్తింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 695 అడుగులు చేరింది. జలాశయంలోకి చేరుతున్న 2,22,412 క్యూసెక్కుల నీరు చేరగా, 16 గేట్ల ద్వారా 2,25,796 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తు్న్నారు. 

హైదరాబాద్ లో బలమైన ఈదురుగాలులు, జీహెచ్ఎంసీ అలెర్ట్

హైదరాబాద్ లో ఎడతెరిపిలేని వర్షాలకు తోడు ఈదురుగాలులతో ప్రమాదం పొంచివుందని GHMC హెచ్చరిస్తోంది. నగరంలో రేపు కూడా వర్ష తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అప్రమత్తమైన యంత్రాంగం లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ఏపీలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం జగన్ ఆరా

ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష చేపట్టారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గోదావరి ఉద్ధృతి, వరద సహాయక చర్యలపై సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. గోదావరికి ఈ ఏడాది ముందస్తుగానే వరదలు వచ్చాయన్నారు. జులై నెలలో 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందని అధికారులు సీఎంకు తెలిపారు. ధవళేశ్వరంలో వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు. బుధవారం ఉదయానికి వరద మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. 16 లక్షల క్యూసెక్కులకు వరద చేరుకునే అవకాశం ఉందని సీఎం జగన్‌ అన్నారు. వరదల ఉద్ధృతి పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా గోదావరికి వరదలు కొనసాగే అవకాశం ఉందన్నారు.  

గోష్పాద క్షేత్రాన్ని ముంచెత్తిన గోదావరి వరద

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో గోదావరి వరద గోష్పాద క్షేత్రాన్ని ముంచెత్తింది. నదీ పరీవాహాక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద అఖండ గౌతమీ గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ఇక్కడి ప్రధాన స్నానఘట్టాల మెట్లను వరద ముంచెత్తింది. స్నానఘట్టాలపై ఉన్న శివలింగం, నంది విగ్రహాలు మునిగిపోయాయి. నీటి ఉద్ధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, ముందస్తు జాగ్రత్త చర్యగా ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నట్టు గోదావరి కుడిగట్టు అధికారులు తెలిపారు.  కొవ్వూరు, ప్రక్కిలంక, పోలవరం ఫ్లడ్‌స్టోర్‌లలో ఇసుక, వెదురుకర్రలు, సర్వేబాదులు సిద్ధం చేశామన్నారు. అఖండ గోదావరి కుడిగట్టు పరిధిలోని ఏటిగట్లను ఎప్పటికప్పుడు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తున్నామన్నారు. కాగా వరద గోదావరిని చూడడానికి జనం గోష్పాదక్షేత్రానికి చేరుకుంటున్నారు.

బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం, మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడిందని వాతావరణశాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు ప్రకటించింది. రాజస్థాన్ జైసల్మేర్ వరకు  నైరుతి రుతుపవనాల ద్రోణి యాక్టివ్ ఉన్నట్లు వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాగల రెండ్రోజులపాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. 

Background

పీ, తెలంగాణలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు పడనున్నట్లుగా భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు.  మరో మూడు నాలుగు రోజుల పాటు వానలు భారీగా పడనున్నట్లుగా హైదరాబాద్, అమరావతిలోని భారత వాతావరణశాఖ కేంద్రాలు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించాయి. 7, 8, 11 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు ఉండనున్నట్లు అధికారులు అంచనా వేశారు.


ప్రస్తుత వాతావరణ పరిస్థితి
* అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. నిన్న దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతాలపై ఉన్న అల్ప పీడన ప్రాంతం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా తీర ప్రాంతాల్లోకి విస్తరించి దానికి అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల వరకూ విస్తరించి ఎత్తుకు వెళ్లేకొలదీ నైరుతి దిశగా వంగి ఉంటుంది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత గుర్తించే అవకాశం ఉంది.


* రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోటా, గుణ, దామోహ్, పెండ్రా రోడ్, ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతం మీదుగా అల్ప పీడన ప్రాంత కేంద్రం గుండా వెళ్తూ, అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.


* తూర్పు - పశ్చిమ గాలుల కోత దాదాపు ఉత్తర భారత ద్వీపకల్పం అయిన 20 డిగ్రీల ఉత్తర అక్షాంశమైన వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉంది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణం వైపు వంగి ఉంటుంది.


ఉత్తర కోస్తా, యానాంలో ఇలా..
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల పడతాయి. రేపు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు పడే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాంధ్రలో
ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. 


రాయలసీమలో
ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.