Breaking News: విజయదశమి సందర్భంగా కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ పూజలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 15న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్దంగా వాహన పూజ, ఆయుధ పూజ నిర్వహించారు. దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి శోభమ్మ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శైలిమ దంపతులు, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏపీ పరిధిలోని జలవిద్యుత్ కేంద్రాలను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. శ్రీశైలం కుడిగట్టున ఉన్న పవర్ హౌస్, సాగర్ కుడి కాల్వపై ఉన్న విద్యుత్ కేంద్రాన్ని అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ అప్పగించాకే తమ పవర్ హౌస్‌లను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ షరతు విధించింది. పవర్ ప్రాజెక్టుల్లోని భవనాలు, కట్టడాలు, యంత్ర సామాగ్రిని కేఆర్‌ఎంబీకి అప్పగించినట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది.
తెలంగాణ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పవర్ హౌస్ కాలనీలో గురువారం రాత్రి బతుకమ్మ ఆడుతున్న మహిళ మెడలో నుంచి చైన్ లాక్కునే ప్రయత్నం చేశాడు చైన్ స్నాచర్స్. వెంటనే అప్రమత్తమైన కాలనీ వాసులు వెంబడించి ఆ ఇద్దరి యువకులను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. ఈ ఇద్దరు వ్యక్తులు సప్తగిరి కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. బతుకమ్మ ఆడుతున్న మహిళలను స్థానికులు వీడియో తీస్తున్న సమయంలో చైన్ స్నాచింగ్ జరిగింది ఆ దృశ్యాలు ఈ వీడియోలో రికార్డు అయ్యాయి.
అఫ్గానిస్తాన్ కాందహార్ లో బాంబు పేలుడు సంభవించింది. కాందహార్ లోని ఓ మసీదు వద్ద బాంబు పేలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఆత్మాహుతి దాడిగా అధికారులు భావిస్తున్నారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మరణాన్ని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ధ్రువీకరించింది. గురువారం సాయంత్రం నుంచి ఆర్కే మరణవార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ అధికారిక సమాచారం లేదు. శుక్రవారం మధ్యాహ్నం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ప్రకటన చేసింది. అనారోగ్యంతో ఆర్కే కన్నుమూశారు.
తెలంగాణ హైకోర్టులో ఇటీవల నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణం చేశారు. హైకోర్టు ఫస్ట్ కోర్టు హాలు వేదికగా శుక్రవారం ఉదయం కొత్త న్యాయమూర్తుల చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ప్రమాణం చేయించారు. న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన వారిలో జస్టిస్ డాక్టర్ చిల్లకూరు సుమలత, జస్టిస్ పెరుగు శ్రీసుధా, జస్టిస్ పటోళ్ల మాధవి దేవీ జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి, జస్టిస్ మున్నూరి లక్ష్మణ్, జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి, జస్టిస్ ఎన్ తుకారాం జీ ఉన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇటిక్యాల మండలం ధర్మవరం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో దాదాపు 20 మందికి గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.
కర్నూలు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో చికిత్స పొందుతున్న పేషెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్య కారణాలతో కోటయ్య అనే వ్యక్తి ఆసుపత్రి బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. అనారోగ్య కారణాలే ఆత్మహత్యకు కారణం అయి ఉండొచ్చునని కుటుంబసభ్యులు అంటున్నారు. కోటయ్యది అనంతపురం జిల్లా కలుగల్లు. ప్రమాదవశాత్తు ఆసుపత్రి బిల్డింగ్ నుంచి కింద పడి ఉంటాడని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు.
కర్నూలు జిల్లాలోని హోలగుంద మండలం దేవరగట్టులో నేడు బన్నీ ఉత్సవాలు జరగనున్నాయి. బన్నీ ఉత్సవంలో వాడే కర్రలను నిలువరించేందుకు అధికారుల చర్యలు తీసుకుంటున్నారు. దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల చెక్ పోస్టు లు ఏర్పాటు చేశారు. బన్నీ ఉత్సవం నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తుకు వచ్చారు. దేవరగట్టులో డ్రోన్, సీసీ కెమెరాలు, ఫాల్కాన్ వాహనాలు ఏర్పాటు చేశారు. బన్నీ ఉత్సవాలకు రింగులు తొడిగిన కర్రలు తీసుకురావొద్దని, సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలు జరుపుకోవాలి కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి సూచించారు. నేటి అర్ధరాత్రి మల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.
Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 15న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -