వైసీపీ ప్రభుత్వం వ‌న్‌టైమ్ సెటిల్‌మెంట్ ని బలవంతంగా కట్టించుకుంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రజ‌లు ఓటీఎస్ కట్టాక పెన్షన్‌, రేష‌న్‌ కార్డులు తొలగిస్తారని లోకేశ్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఓటీఎస్ స్వచ్ఛందం అని చెబుతున్న ప్రభుత్వం, అధికారుల‌కు టార్గెట్ ఎందుకు విధించింద‌ని ఆయ‌న ప్రశ్నించారు. లోకేశ్ నిన్న, ఇవాళ మంగళగిరి నియోజవర్గంలో పర్యటించారు. అన్ని కాల‌నీలు, గ‌ల్లీలోకి వెళ్లి ప్రజ‌ల‌తో మాట్లాడారు. వారి స‌మ‌స్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా స‌మ‌స్యలను ప్రభుత్వం గాలి కొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధ‌వారం మంగళగిరి టౌన్ లో, గురువారం తాడేప‌ల్లిలో ప‌ర్యటించారు. ఇటీవల మరణించిన కార్యకర్తలు, నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. చేనేత షెడ్డులు, చేనేత కార్మికుల ఇళ్లకి వెళ్లి వారి స‌మ‌స్యలు ప్రత్యక్షంగా చూశారు. చేనేత కార్మికులు మాట్లాడుతూ సొంత మగ్గాలు ఉంటే మాత్రమే నేతన్న నేస్తం ఇస్తున్నార‌ని, త‌మ‌లో 90 శాతం మందికి సొంత మగ్గాలు లేవని వాపోయారు. 


Also Read: సీడీఎస్‌కే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..! కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...


ఎమ్మెల్యే ఆర్కే గెస్ట్ లెక్చరర్


రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి నియోజకవర్గానికి గెస్ట్ లెక్చరర్ గా మారారని, అప్పుడ‌ప్పుడూ వ‌చ్చి మాయ‌మాట‌లు చెప్పి మాయ‌మైపోతున్నార‌ని నారా లోకేశ్ ఆరోపించారు. వారానికోసారి గౌతమ బుద్ధా రోడ్డు ముందు నాలుగు ఫొటోలు దిగి జంప్ అయిపోవ‌డ‌మేనా అభివృద్ధి అని ప్రశ్నించారు. మంగళగిరిలో అభివృద్ధి జీరో, పేదల ఇల్లు కూల్చడం మాత్రం ఫుల్లుగా సాగుతోంద‌న్నారు. సీఎం నివాసం ఉంటున్న నియోజకవర్గంలోని అభివృద్ధికి దిక్కులేద‌ని పేర్కొన్నారు. సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలోనే మత్తు పదార్థాలు విచ్చలవిడిగా అమ్ముతున్నార‌ని, దొంగల భయంతో ప్రజలకి రక్షణ లేకుండా పోయింద‌ని ఆందోళ‌న వ్యక్తం చేశారు. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని, మీ పేరు మీద భూమి ఉందని పెన్షన్లు ఎత్తేస్తున్నార‌ని ఇది చాలా అన్యాయని లోకేశ్ అన్నారు. లోకేశ్ గెలిస్తే ఇళ్లు కూల్చేస్తాడని ప్రచారం చేసిన ఆర్కే ఇప్పుడు పేదవాళ్ల ఇళ్లు కూల్చడం ఆయ‌న నిజ‌స్వరూపాన్ని బ‌ట్టబ‌య‌లు చేసింద‌న్నారు. టిడ్కో ఇళ్లు కేటాయించకుండా ప్రజల్ని అయోమయానికి గురిచేస్తున్నార‌న్నారు. 


Also Read: గ్రామ, వార్డు మహిళా కార్యదర్శులు పోలీసులు కారు.. జీవోను ఉపసంహరించుకుటామని హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కార్ !


ఓటీఎస్ కడితే సంక్షేమపథకాలు రద్దు


సీఎం ఉంటున్న నియోజకవర్గంలో ఇసుక రీచులున్నా ఇసుక అందుబాటులో లేదంటే, ఎక్కడికి పోతోంద‌ని లోకేశ్ నిల‌దీశారు. ఇసుక క‌మీష‌న్లు ఎమ్మెల్యే, మంత్రి నుంచి ఎంత‌వ‌ర‌కూ పంచుకుంటున్నార‌ని ప్రశ్నించారు. నిన్న ఒక్క రోజే 30 మంది వృద్ధులు పెన్షన్లు తొలగించారని ఆందోళ‌న వ్యక్తం చేశారు. వన్ టైం సెటిల్మెంట్ అనేది జ‌గ‌న్ స‌ర్కారు ప‌న్నిన అతిపెద్ద కుట్ర అని, 10 వేలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత అసలు వేధింపులు మొదలవుతాయ‌న్నారు. మీ పేరు మీద సొంత ఇళ్లు ఉందని పెన్షన్, రేషన్ కార్డు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అన్నీ రద్దు చేస్తార‌ని హెచ్చరించారు. ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా ఓటీఎస్‌కి కట్టొద్దని,  పొరపాటున కడితే మీ సంక్షేమ‌ ప‌థ‌కాల‌న్నీ ఆగిపోతాయ‌న్నారు. టీడీపీ గెలిచిన తరువాత ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. 


Also Read: సోమవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే చాన్స్... ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి