Chit Fund Raids : మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ఏపీ జీఎస్టీ, ఏపీడీఆర్ఐ, చిట్ రిజిస్టార్ వరుసగా మూడో రోజులు తనిఖీలు చేపట్టాయి. మూడు రోజులలో ఆయా బ్రాంచ్‌లకు ఆరుగురు చొప్పున అధికారులు సోదాలు చేశారు. రికార్డుల తనిఖీలపై జీఎస్‌టీ అధికారులు ముఖ్యంగా దృష్టి సారించారు. మార్గదర్శి కార్యాలయాల్లో తనిఖీలు సందర్భంగా పటిష్ట పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఆదేశాలతో అధికారులు రికార్డులను పరిశీలించారు. 15వ తేదీ నుంచి మార్గదర్శి చిట్ ఫండ్ కు చెందిన 18 యూనిట్లలో తనిఖీలు చేశారు. చిట్ ఫండ్ చట్టం, 1982 ప్రకారం ప్రొసీడింగ్‌లకు సంబంధించిన అన్ని రికార్డులు, మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నిధుల మళ్లింపు, జీఎస్టీ చెల్లించకపోవడం, సెక్షన్ 31 కింద సెక్యూరిటీ ఇవ్వకపోవడం వంటి అంశాలపై అధికారులు ఆధారాలు సేకరించారు. మార్గదర్శి సంస్థల్లో గుర్తించిన విషయాలపై చర్యలు లేదా లీగల్ యాక్షన్ తీసుకోవాలని చిట్‌ల డిప్యూటీ రిజిస్ట్రార్‌లకు అధికారులు సూచించారు.
చిట్ ఫండ్స్ సంస్థల్లో సోదాలు
ఆంధ్రప్రదేశ్‌లో చిట్ ఫండ్ కంపెనీల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. చిట్స్ పేరుతో సేకరిస్తున్న సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించుకుంటున్నారని.. దానితో వడ్డీ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. సోదాలు చేసిన సంస్థల్లో మార్గదర్శి, శ్రీరామ్, కపిల్ చిట్స్ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు సంబంధించిన లావాదేవీలను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. .
మార్గదర్శి డిపాజిట్ల అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ మీడియా దిగ్గజం అయిన రామోజీరావు కుటుంబానికి చెందిన సంస్థ. ఈ సంస్థ విషయంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనేక రకాల ఆరోపణలు చేస్తోంది. రిజర్వు బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణలపై గతంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో రామోజీరావుపై ఉన్న నేరాభియోగాలను కొట్టి వేస్తూ 2018 డిసెంబరు 31న ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దీనిని సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఏపీ ప్రభుత్వం తాము కూడా ఇంప్లీడ్ అవుతామని పిటిషన్ దాఖలు చేసింది. రామోజీ రావుపై నేరాభియోగాలను హైకోర్టు కొట్టివేయడం సరికాదని ప్రభుత్వం వాదిస్తోంది.
ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్‌లో ఇంప్లీడ్ అయిన ఏపీ ప్రభుత్వం
మార్గదర్శి చిట్ ఫండ్ ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతున్నారు. ప్రభుత్వం కూడా అదే వాదనను సుప్రీంకోర్టులో వినిపించింది. మార్గదర్శి కేసులో రామోజీరావు కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అన్ని పిటిషన్లపై తదుపరి విచారణను డిసెంబరు రెండో తేదీన జరగనుంది. ఈ లోపే ఏపీలోని మార్గదర్శి ఆఫీసుల్లో సోదాలు నిర్వహించడం రాజకీయంగానూ చర్చనీయాంశమయ్యే అవకాశాలు ఉన్నాయి. సీఎం జగన్ తన రాజకీయ ప్రత్యర్థుల్లో రామోజీరావును కూడా చేర్చి చెబుతూంటారు. దుష్టచతుష్టయంలో ఆయన కూడా ఒకరని ఆరోపిస్తూ ఉంటారు.