MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి అమర్‌నాథ్‌, నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, పర్యాటక శాఖ మంత్రి రోజా డ్యాన్స్‌ చేస్తున్న ఫొటోలను ప్రదర్శించారు. మంత్రులు ఇలా రికార్డింగ్ డ్యాన్సులు చేస్తే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు పెరుగుతాయంటూ ఎద్దేవా చేశారు. వ్యాపారవేత్తలు సీఎం జగన్ ను కలవడానికి వెళ్తే సమయం ఇవ్వరని, ఎవరైనా కచ్చితంగా కలవాలనుకుంటే నేరుగా తన ఇంటికే రావాలని సీఎం చెప్పినట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రం నుంచి రూ.1.70 లక్షల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్న పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల చర్చలు కోట్లు దాటుతున్నా రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావడం లేదన్నారు. పది వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అమర్ రాజా బ్యాటరీస్ కూడా పక్క రాష్ట్రానికి తరలిపోయిందని రఘురామ కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.



వాళ్ల వల్లే పరిశ్రమలు తరలిపోతున్నాయి..


శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... పది వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రముఖ పారిశ్రామిక సంస్థ అమర్ రాజా బ్యాటరీస్ రూ.పది వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రం నుంచి వెళ్లిపోయింది తెలిపారు. రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. పనికిరాని పాలకుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమెంట్ పరిశ్రమతో పోలిస్తే ఇతర పరిశ్రమల్లో కాలుష్యం లేదని చెప్పిన రఘురామ కృష్ణంరాజు.. పాలకుల ఆలోచనా ధోరణి వల్లే రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని విమర్శించారు. రాయలసీమలో పరిశ్రమల స్థాపనపై ప్రభుత్వం దృష్టి సారించాలని, సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు కోరారు. రాయలసీమ రైతులకు బిందు సేద్యం ఇవ్వడం లేదని చెప్పారు.


రాయలసీమ రైతులకు బిందు సేద్యం అందించాలి..


ప్రభుత్వ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయబోతున్నారని అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును రాష్ట్రపతి ఆమోదించలేదని సుప్రీంకోర్టు మాజీ అటార్నీ జనరల్‌ చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో ఒక మాట, రాష్ట్రంలో మరో మాట అంటూ మాట్లాడడం ఏంటంటూ ధ్వజమెత్తారు. కర్నూలు గర్జనకు హాజరైన ప్రజలు.. బ్యాటరీలను వెనక్కి తీసుకొచ్చి గర్జించాలని అమర్ రాజా సూచించారు. అలాగే హంద్రీనీవా ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి రాయలసీమ రైతులకు బిందు సేద్యం అందించాలని కోరారు. కర్నూలు గర్జనలో నాయకులు చెప్పే మాయ మాటలు విని ప్రజలు మోసపోవద్దని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా ప్రజలను అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు.


అధికారంలోకి వచ్చి ఆరు నెలలకే కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి.. ఇంకా కాంపౌండ్ వాల్ కట్టలేకపోయారని రఘురామ కృష్ణంరాజు దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు కావస్తున్నా.. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. పులివెందుల వెళ్లిన సీఎం  రివర్‌వ్యూ హోటల్‌ను ప్రారంభించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో చేపల దుకాణం పెట్టిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు హోటల్ పెట్టారని దుయ్యబట్టారు.