AP MLC Election: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు చైతన్యం, బాధ్యతతో వ్యవహరించారని.. ప్రభుత్వంపై వ్యతిరేకతను ఓట్ల రూపంలో చూపించారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల (Graduate MLC Election)పై మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగాది పంచాంగాన్ని రెండ్రోజుల ముందే ప్రజలు ఎన్నికల ఫలితాల ద్వారా చెప్పారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజలనే నమ్ముకుందని తమ పార్టీ ప్రజాస్వామయుతంగా పనిచేస్తోందన్న చంద్రబాబు.. ప్రజలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టంచేశారు. తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా చెడు ఎప్పుటికైనా ఓడిపోతుందని, భవిష్యత్ టీడీపీదేనని ఆయన వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం అధికార పార్టీ ఎన్నో అక్రమాలకు పాల్పడిందని.. ఎన్ని అక్రమాలకు పాల్పడినా ప్రజలు వారిని నమ్మలేదని చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా ప్రలోభాలకు గురిచేసినా, భయపెట్టినా ప్రజలు చైతన్యంతో, రాష్ట్రం పట్ల బాధ్యతతో స్పందించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించారని తెలిపారు. పులివెందులలోనూ తిరుగుబాటు మొదలైందని దానికి నిదర్శనమే ఈ ఫలితాలని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల విజయం వెనుక.. నిరుద్యోగుల ఆవేదన, బిడ్డల భవిష్యత్ పట్ల తల్లిదండ్రుల ఆలోచన, రాష్ట్ర భవిష్యత్‌పై విద్యావంతుల తపన, ప్రభుత్వ ఉద్యోగుల వేదన, రైతు కష్టం, సాయమందని బడుగు, బలహీన వర్గాల బాధ, పెరిగిన ధరలతో బతుకు భారమైన సామాన్యుడి కష్టం, అరాచకం కారణంగా బతుకు భారంగా మారిన సగటు మనిషి ఆవేదన ఉందని సష్టంచేశారు.
నాలుగేళ్లలో సీఎం జగన్ అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యేలా విధ్వంస పాలన చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఆయన అక్రమాలను నమ్మి వాటితోనే ముందుకెళ్తున్నారని.. నాలుగేళ్లలో రాజకీయ పార్టీలు పనిచేసే పరిస్థితి లేకుండాపోయిందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే కేసులు పెట్టి వేధించారని... ప్రజాస్వామ్య వ్యవస్థలు పనిచేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి దారుణమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కొన్ని పార్టీలు సిద్ధాంతపరంగా రావని పేర్కొన్న చంద్రబాబు.. గాలికి వచ్చిన పార్టీలు గాలిలో కలిపిపోతుంటాయని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్ పని అయిపోయిందని... ఆయన మళ్లీ ఏ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని టీడీపీ అధినేత పేర్కొన్నారు. జగన్‌కు బాధ్యత లేదని.. మోసాలు చేయడంలో దిట్ట అని ఆరోపించారు. జగన్ ధనబలం.. రౌడీయిజం.. ఎప్పటికీ శాశ్వతం కాదని చంద్రబాబు స్పష్టంచేశారు.
తన నేరాల్లో జగన్.. అధికారులను భాగస్వాములను చేస్తున్నారని, దేశంలో ఏ నాయకుడు చేయనివిధంగా అరాచకాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. పారిశ్రామిక వేత్తలు, ఐఏఎస్‌లను జైలుకు పంపారని.. జగన్‌ను నమ్ముకున్న వారు జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు. రాష్ట్రం ఏమైనా పర్వాలేదు.. నేనొక్కడినే ఉండాలన్నది జగన్ మనస్తత్వమని చంద్రబాబు అన్నారు. ఎవరైనా అడ్డువస్తే.. లొంగదీసుకునేందుకు సామ, దాన, దండోపాయాలను ఉపయోగించడం జగన్ నైజమని ఆరోపించారు.
రాష్ట్రంలో నాలుగేళ్లుగా నాలుగు వ్యవస్థలు పనిచేయట్లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే కేసులు పెడుతున్నారన్న చంద్రబాబు.. శాసనసభ, శాసనమండలిని ప్రహసనంగా మార్చారని మండిపడ్డారు. ఫలితంగా కార్యనిర్వాహక వ్యవస్థ నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. కోర్టులు, జడ్జిలను బ్లాక్ మెయిల్ చేసే విధంగా అధికార పార్టీ నేతలు ప్రవర్తిస్తున్నారన్నారు. జడ్జిలు సుమోటోగా తీసుకుని సీబీఐ విచారణకు ఆదేశించే పరిస్థితి నెలకొదని.. సీఎస్ సహా అధికారులను న్యాయస్థానాలు చీవాట్లు పెట్టే పరిస్థితి జగన్ పాలనలో చూస్తున్నామన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాసేలా.. ఎవరూ నిరసనలు చేయకుండా జీవో నెంబర్ 1 తెచ్చారని.. పాదయాత్రలు, రోడ్‌షోలు చేస్తే ఆంక్షలు విధించారని చంద్రబాబు గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థుల విజయానికి కారణమైన అన్నివర్గాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.