ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానం పరిశీలనలో ఉందని.. ఇంకా బిల్లుపై నిర్ణయం తీసుకోలేదని ... పరిశీలనలో ఉందని రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి రిజుజు చెప్పుకొచ్చారు. దీంతో శాసనమండలి అంశం కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లలేదని.. కేంద్రం ఆ అంశాన్ని లైవ్‌లో ఉంచేందుకు ప్రయత్నిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత ఉండేది. అయితే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్ని బిల్లులలకూ టీడీపీ ఆమోదం తెలిపింది కానీ.. రాజధాని బిల్లును మాత్రం తిప్పి పంపింది. సెలక్ట్ కమిటీకి పంపడంతో ఆగ్రహం చెందిన సీఎం జగన్.. శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు అసెంబ్లీలో నిబంధనల మేరకు .. మూడింట రెండు వందల మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపారు. అప్పట్లో శాసనమండలి వల్ల డబ్బులు దండగ తప్ప ప్రయోజనం లేదన్నారు. ఏడాదిలో తమకు మెజార్టీ వస్తుందని తెలుసని అయినప్పటికీ.. రద్దు చేస్తున్నామని ప్రకటించారు. కానీ ఆ తీర్మానాన్ని కేంద్రం ఇంత వరకూ పట్టించుకోలేదు. ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం బిల్లు రూపంలోకి మార్చి పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందితే శాసనమండలి రద్దవుతుంది. కానీ.. పార్లమెంట్‌లో ఇంత వరకూ ఏపీ శాసనమండలి బిల్లును ప్రవేశపెట్టలేదు. ఆ దిశగా కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే.. శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ వచ్చేసింది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్సీలతో రాజీనామాలు చేయించి.. వారికి మళ్లీ ఎమ్మెల్సీ పదవులే ఇచ్చారు. అలాగే.. ఖాళీ అయిన ప్రతీ ఎమ్మెల్సీ స్థానంలోనూ వైసీపీ అభ్యర్థికి చాన్సిచ్చారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. వాటిని కూడా రేపోమాపో నిర్వహించనున్నారు. దీంతో వైసీపీ బలం మరింతగా పెరుగుతుంది.
ఇలాంటి సమయంలో... వైసీపీ శాసనమండలి రద్దు విషయంలో వీలైనంతగా మౌనాన్ని పాటిస్తోంది. తమ ప్రభుత్వం.. మూడింట రెండు వంతుల మెజార్టీతో చేసిన తీర్మానాన్ని గౌరవించాలని అడగడం మానేసింది. ఏపీ సర్కార్ నిర్లిప్తంగా ఉంది కాబట్టి... కేంద్రం కూడా.. ఇప్పుడేమంత అవసరం అనుకుంటోంది. అందుకే పట్టించుకోవడం లేదు. ఇప్పటి పరిస్థితుల్ని బట్టి చూస్తే.. శాసనమండలిని రద్దు చేస్తే.. వైసీపీ నేతల పదవులు ఊడిపోతాయి. ఇది ఆ పార్టీలో కొత్త సమస్యలు సృష్టిస్తుంది. అందేుకే కేంద్రం పై ఒత్తిడి తేవడం లేదు. కానీ బీజేపీ మాత్రం.. దీన్నో అవకాశంగా ఉపయోగించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడంటే... బీజేపీ వైసీపీ బంధాలు మెరుగ్గా ఉన్నాయి. కానీ రేపు ఏమైనా తేడా వస్తే.. బీజేపీ ఇలాంటి అవకాశాల్ని ఉపయోగించుకుంటుంది. శాసనమండలిని రద్దు చేసేస్తుంది. ఇలాంటి ఆయుధాల్ని బీజేపీకి వైసీపీనే అందిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ అనవసరంగా ఆవేశపడిన చేసిన ఓ పని వల్ల... తాము చేయాలనుకున్నప్పుడు మండలి రద్దు కాకపోగా.. తమకు మెజార్టీ ఉన్నప్పుడు... రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది.