నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్‌తో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కంపెనీ లిమిటెడ్  ఒప్పందాన్ని కుదుర్చుకుంది. శనివారం గోవాలో G20 క్లీన్ ఎనర్జీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకంలో నిర్మిస్తున్న ఇళ్లకు విద్యుత్‌ ఆదా ఉపకరణాలను మార్కెట్‌ ధర కంటే తక్కువకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర విద్యుత్తు శాఖకు చెందిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌)తో ఒప్పందం చేసుకుంది. 


'నవరత్నాలు-పెదలందరికీ ఇల్లు' పథకం కింద జగనన్న కాలనీల గృహ లబ్ధిదారులకు మొదటి దశలో 6 లక్షల ఎల్‌ఈడీ బల్బులు, 3 లక్షల ఎల్‌ఈడీ ట్యూబ్ లైట్లు, 3 లక్షల బీఎల్‌డీసీ సీలింగ్ ఫ్యాన్లు సరఫరా చేసేలా రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.


ఈ మేరకు ప్రతి ఇంటికీ 4 ఎల్‌ఈడీ బల్బులు, 2 ట్యూబ్‌ లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫ్యాన్లను రాయితీ ధరలకు ప్రభుత్వం అందించనుంది. హౌసింగ్ స్కీమ్‌లో మొదటి దశలో నిర్మిస్తున్న 15.6 లక్షల ఇళ్లలో ఈ ఉపకరణాలను ఉపయోగించడం ద్వారా సంవత్సరానికి 1,145 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని అంచనా అధికారులు వేస్తున్నారు. ఏడాదికి ప్రతి ఇంటికి 734 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని, ఫలితంగా వినియోగదాలకు ఏడాదికి రూ. 2,259 ఆదా అవుతుందని అంచనా వేశారు.


పలువురు అగ్రనేతలు, జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమ నిపుణుల సమక్షంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (హౌసింగ్) అజయ్ జైన్, EESL CEO విశాల్ కపూర్ మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అనంతరం అజయ్ జైన్ మాట్లాడుతూ.. ‘నవ రత్నాలు - పేదలందరికీ ఇల్లు' లబ్ధిదారులకు అత్యున్నత నాణ్యత, తక్కువ ఖర్చుతో కూడిన, ఇంధన ఉపకరణాలను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.


లబ్ధిదారులకు విద్యుత్తు బిల్లుల భారం తగ్గించడంతో పాటు ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించి పర్యావరణాన్ని పరిరక్షించడమే ఈ ఒప్పంద లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లబ్ధిదారులకు ఆధునిక సాంకేతికతతో కూడిన నాణ్యమైన ఇంధన వనరులు అందించడంతోపాటు అత్యున్నత నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారని జైన్ వివరించారు. తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకుని సమర్థవంతంగా పనిచేయడంలో ఈ ఉపకరణాలు మెరుగ్గా పనిచేస్తాయన్నారు. ఈ ఒప్పందం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వెల్లడించారు. 


ఈఈఎస్‌ఎల్‌, ఏపీ గృహనిర్మాణ శాఖ మధ్య కుదిరిన ఒప్పందం రాష్ట్ర ప్రగతికి ప్రతీకగా నిలుస్తుందని ఈఈఎస్‌ఎల్‌ సీఈవో విశాల్‌ కపూర్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన భవిష్యత్తును సృష్టించాలనే రాష్ట్ర నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. ఆధునిక, ఇంధన - సమర్థవంతమైనవాటిని భారీ స్థాయిలో అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందుంటుందన్నారు. సుస్థిర ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ఈ కార్యక్రమం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని కొనియాడారు. 


దక్షిణ ప్రభుత్వ వ్యవహారాల EESL సీనియర్ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధనలో ఇంధన సామర్థ్య గృహ ప్రాజెక్ట్ ఒప్పందం ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందన్నారు. ఇది త్వరలో రాష్ట్రంలోని ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని రెడ్డి అన్నారు.