Sanitation Workers Protest: అమరావతి: ఏపీలో ఓవైపు వాలంటీర్లు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె కొనసాగిస్తున్నారు. మరోవైపు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తల సమ్మె 21 వ రోజుకు చేరింది. ఈ క్రమంలో మున్సిపల్‌ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలకు సిద్ధమైంది. సచివాలయంలో జనవరి 2వ తేదీన (మంగళవారం) ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం చర్చించనుంది. ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, కొందరు ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులను మరోసారి చర్చలకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది.


వారం రోజుల నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె
ఏపీ వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు డిసెంబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ కాంట్రాక్ట్‌ సిబ్బంది, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దాంతో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు మొగ్గుచూపారు. అంటు వ్యాధులు వ్యాపించే సీజన్ కావడంతో ఏపీ ప్రభుత్వంపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది.  సమాన పనికి సమాన వేతనం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా 13 డిమాండ్లను నెరవేర్చాలని వారు సమ్మె చేస్తున్నారు. అంగన్వాడీ సంఘాల తరహాలోనే మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో తొలి దఫా చర్చలు విఫలమయ్యాయి. దాంతో పారిశుద్ధ్య కార్మిక సంఘాల ప్రతినిధులను  ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది. 


ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీతం 26 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం రూ.15వేల వేతనం ఇస్తున్నారు. పని ఒత్తిడి, అనారోగ్య సమస్యల కారణంగా.. కార్మికుల సంఖ్యను పెంచాలన్న డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు వేతనం పెంచాలన్న డిమాండ్ ను నెరవేర్చుకోవాలని పారిశుధ్య కార్మికులు సమ్మె బాట పట్టారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు ప్రతిపక్ష టీడీపీ మద్దతు తెలిపింది. తాము అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలు, వాలంటీర్లతో పాటు మున్సిపల్ కార్మికుల వేతన పెంపు సహా పలు డిమాండ్లను నేరవేర్చుతామని చంద్రబాబు, నారా లోకేష్ ఇదివరకే హామీ ఇచ్చారు.