Andhra Pradesh government is drowning in debt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయానికి, ఖర్చుల మధ్య పొంతన కుదరడం లేదు. ఓ వైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమం పేరుతో విపరీతంగా ఖర్చు కనిపిస్తోంది. ఆ ఖర్చుకు ఆదాయానికి పొంతన ఉండటంలేదు. ఎప్పటికప్పుడు ఆదాయం పెరుగుతున్నా ఖర్చులు అంత కంటే ఎక్కువే పెరుగుతున్నాయి. ఆర్బీఐ ఇచ్చే సెక్యూరిటీల వేలం కాకుండా.. ఇతర మార్గాల ద్వారానూ రుణాలు సేకరిస్తున్నారు. 

Continues below advertisement


ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీల వేలం


రాష్ట్రాలకు  ప్రతి మంగళవారం రిజర్వ్‌బ్యాంకు సెక్యూరిటీలు వేలం వేసి రుణాలిస్తుంది. ఇలా  ప్రభుత్వ సెక్యూరిటీలను వేలంపెట్టి తీసుకువస్తున్న రుణాలు సరిపోవడంలేదు. ఇప్పటికే ఈ రంగం ద్వారా 80 శాతం వరకు రుణాలను తీసుకున్న ఆర్థికశాఖ మరో 11,900 కోట్ల కోసం దరఖాస్తు చేసుకుంది.   ఇప్పటికే బడ్జెట్‌ అంచనాల్లో 80 శాతం వరకు రుణాలను ఏపీ ప్రభుత్వం  వినియోగించుకుంది. మూడో త్రైమాసికంలో వినియోగించుకునే రుణాలతో కలిపి 95 శాతానికి రుణం చేరుకుంటుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.  వార్షిక బడ్జెట్‌లో రూ. 79,926 కోట్ల రుణాలను తీసుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ ప్రతిపాదించింది. ఇందులో సెప్టెంబర్‌ వరకు 64,800 కోట్ల రుణాలను మార్కెట్‌ బారోయింగ్స్‌ ద్వారా సేకరించింది. ఇప్పుడు అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు 11,900 కోట్లు సేకరించాలని ఇండెంట్‌ దాఖలు చేసింది. దీంతో మొత్తం రుణాలు 76,700 కోట్లకు చేరుకుంది. అంటే చివరి త్రైమాసికం జనవరి నురచి మార్చి వరకు లో కేవలం రూ. 3,226 కోట్లు మాత్రమే తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. 


ఇతర మార్గాలలోనూ రుణాలు


ఏపీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకూ సొంత ఆదాయం నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అప్పులతోనే అభివృద్ధి పనులు చేయాలి. అమరావతికి ప్రపంచబ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణాలు ఇస్తున్నాయి కాబట్టి అమరావతి పనులు చురుకుగా సాగుతున్నాయి. పోలవరం పనులకు కావాల్సిన నిధులను కేంద్రం సమకూరుస్తోంది. కేంద్ర పథకాల ద్వారా వస్తున్న నిధులను సమర్థంగా వాడుకోవడంతో చాలా వరకూ పనులు సాగుతున్నాయి. రోడ్లు, మౌలిక సదుపాయాల పనులు అలా కొనసాగిస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు వచ్చి పడుతున్న అదనపు ఖర్చుల వల్ల.. లోటు పెరిగిపోతోంది. రుణాల చెల్లింపులకు తోడు... ఇతర మార్గాలలో తీసుకు వచ్చిన రుణాలకు చెల్లింపులు చేయాల్సి ఉండటంతో ఆ భారం పెరుగుతోంది. 


ఆదాయం పెంచుకునేందుకు ప్రత్యేకంగా మంత్రివర్గ ఉరసంఘం


ఆదాయం పెంచుకోకపోతే సమస్యలు వస్తాయని  ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రతిపాదనలు ఇచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో ఈ ఏర్పడిన ఈ కమిటీలో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్,  హోంమంత్రి అనిత, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్  సభ్యులుగా ఉన్నారు.  శాఖల వారీగా ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు, సంక్షేమ పథకాలకు నిధులను అందుబాటులో ఉంచడానికి అవసరమైన చర్యలను మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సు చేయాల్సి ఉంటుంది.   ఆదాయాన్ని పెంచేందుకుగల మార్గాల అన్వేషణతో పాటు దానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి శాఖల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు తీసుకోవాల్సి చర్యలను కూడా సూచించాల్సి ఉంటుంది.


పన్నులు పెంచుతారా?


ప్రభుత్వానికి ఆదాయం పెరగడం అంటే ప్రధానంగా పన్నులు పెంచడమే ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పన్నులు ఏ రూపంలోనూ పెంచలేరు. కానీ పరోక్ష పద్దతిలో మాత్రం పన్నులు పెంచడం ద్వారా ప్రజలకు నొప్పి తెలియకుండా చేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆ పరోక్ష పన్నుల క్రియేటివిటీని చూపించేందుకు ప్రభుత్వం ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు.. అవి పెరుగుతూనే పోతున్నాయి.