ESMA On Anganwadi Strike:సుమారు నెల రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీల ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వారిపై ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల పాటు ఎలాంటి సమ్మెలు, ఆందోళనలు చేయొద్దని ఆదేశాల్లో పేర్కొంది. 


26 రోజులుగా సమ్మె బాట


జీతాల పెంపు, గ్రాట్యుటీ పెంపుతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 26 రోజులుగా అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నారు. వారితో దఫదఫాలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం వారి డిమాండ్లపై క్లారిటీ ఇవ్వలేకపోయింది. ఆర్థికంగా ప్రభావం పడని వాటికి ఓకే చెప్పింది కానీ జీతాల పెంపుపై వారికిహామీ ఇవ్వలేదు. అందుకే అంగన్‌వాడీ వర్కర్లు సమ్మె విరమించడం లేదు. 


సమ్మె నిషేధిస్తూ జీవో నెం 2


ప్రభుత్వం చర్చలు జరిపినా, బెదిరించినా సమ్మె విరమించడం లేదని ఇప్పుడు అంగన్‌వాడీల సేవలను అత్యవసర సర్వీసు కిందకు తీసుకొస్తూ జీవో రిలీజ్ చేసింది. అంతే కాకుండా ఇలాంటి సర్వీసుల్లో ఉన్న వారు ఆరు నెలల పాటు సమ్మెలు చేయకూడదని ఎస్మాని ప్రయోగించింది. ఈ మేరకు జీవో నెంబర్‌ 2ను రిలీజ్ చేసింది ప్రభుత్వం. 


ఏంటీ ఎస్మా


2013లో తీసుకొచ్చిన జాతీయ ఆహార భద్రత చట్టంలోని సెక్షన్ 39 పరిధిలోకి అంగన్వాడీలు వస్తారని ప్రభుత్వం వాదిస్తోంది. అందుకే అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించినట్టు పేర్కొంది. ఈ ఎస్మాను 1981లో  తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి సమ్మెలు చేస్తే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అంగన్‌వాడీలను డిస్మిస్‌ చేయవచ్చు.


అంతే కాదు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు కూడా పెట్టవచ్చు. ఈ కేసుల్లో సమ్మెచేసిన వారికి ఆరు నెలలు, సహకరించిన వారికి ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 


జీతాల్లో కోత


ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వం అంగన్వాడీల జీతాల్లో కూడా కోత పెట్టింది. అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకులకు వేతనాల్లో మూడు వేలు తగ్గించి వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసింది.