AP Pensions : ఏపీలో వృద్ధాప్య పింఛన్ల పంపిణీలో కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులకు వేలిముద్రలు పడకపోవడంతో పింఛన్ పంపిణీలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వేలిముద్రల సమస్య ఉన్న వృద్ధులకు ఆధార్ అనుసంధానంతో లబ్ధిదారుని ఫేస్ ను యాప్‌లో సరిపోల్చుకొని పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం వాలంటీర్లను ఆదేశించింది. మార్చి 1 నుంచి ఈ విధానం అమలుచేయాలని నిర్ణయించింది. అలాగే వేలిముద్రల విధానంతో ఇతర పద్ధతులు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది.  


ఇటీవల పింఛన్ల పెంపు 


ఈ ఏడాది జనవరి 1 నుంచి వృద్ధాప్య పింఛన్ పెంచింది ప్రభుత్వం. సామాజిక పెన్షన్లు 2750కి పెంచి జనవరి ఒకటో తేదీ నుంచే పంపిణీ చేస్తుంది. రూ.250 పెంచి రూ. 2,750కి పెన్షన్‌ అందిస్తున్నారు. రాష్ట్రంలో 64.74 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో పెన్షన్లకు నెలకు అందిస్తున్న మొత్తం రూ.1786 కోట్లకు చేరింది.  ఆ తర్వాత 2024 జనవరికి రూ.3000 పింఛన్ అందిస్తామని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దీంతో ఎన్నికల హామీ పూర్తి చేసినట్లు అవుతుందంటున్నారు. పింఛన్ల కోసం  రూ.130.44 కోట్లు నెలకు అదనపు వ్యయం వెచ్చిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.  


రైతు భరోసా విడుదల 


 ఏపీలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్ల నిధులను విడుదల చేశారు. మంగళవారం (ఫిబ్రవరి 28) తెనాలి మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు. వరు­సగా నాలుగో ఏడాదిలో కూడా ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 సాయం అందించారు. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2 వేల చొప్పున 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,090.76 కోట్లు వేశారు.