Andhra Pradesh Formation Day 2023: ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకల నిర్వహణపై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏపీ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఏ రోజు జరుపుకోవాలో తెలియని స్థితి ఉండేది. తెలంగాణతో కలిసి విశాలాంధ్రప్రదేశ్‌గా మారిన రోజు జరుపుకోవాలా?  లేక.. అదే తెలంగాణతో విడిపోయిన రోజున జరుపుకోవాలా? లేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజు జరుపుకోవాలా అనే సందేహం చాలా మందిలో ఉండేది. 2014 జూన్ 2 విభజన తరువాత ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే చంద్రబాబు ఆవిర్భావ వేడుకల జోలికి వెళ్లకుండా జూన్ 2 నుంచి నవ నిర్మాణ దీక్షలు చేపట్టేవారు. తరువాత 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలను నవంబర్ 1న నిర్వహిస్తోంది.


పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం
‘మీ పుట్టిన రోజు ఎప్పుడు?’ అని అడిగితే... రికార్డుల్లో ఉన్నదా, నిజమైనదా అని అడిగే వాళ్లు చాలా మంది ఉంటారు. 2014 జూన్ 2 తరువాత ఏపీ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉండేది. ఒకప్పుడు మద్రాస్‌ రాష్ట్రంలో భాగమైన తెలుగు వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ అప్పట్లో భారీ ఉద్యమమే జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో 1953 అక్టోబరు 1వ తేదీన మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ‘ఆంధ్ర రాష్ట్రం’ ఆవిర్భవించింది. రాయలసీమ, కోస్తా జిల్లాలతో పాటు ఇప్పుడు కర్ణాటకలో ఉన్న బళ్లారి, ఒడిశాలోని బరంపురం ప్రాంతాలతో  కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. అప్పటి నుంచి అక్టోబరు 1వ తేదీ ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించేవారు. 


విశాలాంధ్ర ఏర్పాటు
అక్టోబరు1న ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక మూడేళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 1954, 1955లో ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. అప్పటికే పక్కనే ఉన్న తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా తెలుగే మాట్లాడతారని, తెలుగువారంతా ఒక్కరాష్ట్రంగా ఉంటే గొప్పగా అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ‘విశాలాంధ్ర’ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనిపై తెలంగాణ వైపు నుంచి అభ్యంతరాలు, భారీ కసరత్తు, కమిషన్ల అనంతరం 1956 నవంబరు 1వ తేదీన రాయలసీమ, కోస్తా, తెలంగాణతో కూడిన ‘ఆంధ్రప్రదేశ్‌’ ఏర్పడింది. ఇది రాష్ట్రానికి రెండో పుట్టిన రోజు. ఆ సమయంలో ఆ తర్వాత కర్ణాటకలో బళ్లారి, ఒడిశాలో బరంపురం కలిసిపోయాయి.  


నవంబర్ 1న ఆవిర్భావ వేడుకలు
1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి 2013 వరకు నవంబరు 1న ఏపీ అవతరణ దినోత్సవం నిర్వహించేవారు. 2014 జూన్‌ 2న ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. అప్పటి నుంచి ‘జూన్‌ 2’న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే సీమాంధ్రతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవంపై మరో సారి చర్చ సాగింది. జూన్‌ 2న జరుపుకోవాలని కొందరు అభిప్రాయపడినా సాధ్యమలేదు. భౌగోళికంగా బళ్లారి, బరంపురం లేని ‘ఆంధ్రరాష్ట్రం’ ఏర్పడింది కాబట్టి అక్టోబరు 1నే ఆవిర్భావ దినోత్సవంగా జరపాలని కొందరు, నవంబరు 1నే అనుసరించాలని మరికొందరు వాదించారు.


టీడీపీ నవ నిర్మాణ దీక్ష
రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ అమల్లోకి వచ్చిన జూన్ 2ను నవ నిర్మాణ దీక్ష చేపట్టేది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విజయవాడ బెంజి సర్కిల్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షలు చేపట్టింది.  అక్టోబరు 1న కానీ, నవంబరు 1న గానీ ఆవిర్భావ వేడుకలు జరపలేదు. అప్పటి నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు జూన్‌ 2న ‘నవ నిర్మాణ’ సంకల్పం ఏదీ చెప్పుకోలేదు. అలాగని అక్టోబరు 1న గానీ, నవంబరు 1నగానీ అవతరణ దినోత్సవమూ జరపలేదు. 2020లో నవంబర్ ఒకటో తేదీని ఏపీ అవతరణ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఏటా నవంబర్ 1న రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహిస్తోంది.